Saturday, April 27, 2024

బిజెపివి దుష్ట రాజకీయాలు: కొప్పుల

- Advertisement -
- Advertisement -

Minister koppula eshwar slams bjp leader

 హైదరాబాద్: బిజెపి నేతలు దుష్ట రాజకీయాలకు తెరతీశారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. తెలంగాణలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రశాంతంగా కొనసాగుతుంటే, అనవసరంగా అక్కడకు పోయి విద్వేషాలు సృష్టిస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  దండుగ అనుకున్న వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ పండుగను చేశారని మీడియాతో తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ధీనాతిధీనంగా ఉన్న రైతు పరిస్థితి ఇప్పుడు చాలా మెరుగైందని  మంత్రి  పేర్కొన్నారు.

సంజయ్ వందలాది మంది తన గుండాలతో నల్లగొండ జిల్లాకు వెళ్లడాన్ని, రైతులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మిషన్ కాకతీయలో 46 వేల చెరువుల పూడిక తీతపనులు చేపట్టామని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సాగునీరు పుష్కలంగా అందుబాటులోకి వచ్చిందన్నారు. విద్యుత్తును 24గంటలు అందిస్తున్నామని, ఇందుకు ఏటా రూ.10వేల కోట్లు సబ్సిడీ ఇస్తున్నట్లు మంత్రి వివరించారు. పంట పెట్టుబడికి రైతుబంధు పథకంలో ఇప్పటి దాక రూ.44 వేల కోట్లిచ్చామని, బీమా పథకంలో 59,630 మంది రైతులకు రూ.2,981 కోట్లు అందజేసినట్లు మంత్రి పేర్కొన్నారు. నీటి తీరువా పన్నును పూర్తిగా ఎత్తేశామని, విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చేశామని, నకిలీ విత్తనాలను పూర్తిగా అరికట్టామని, అవి అమ్మే, సరఫరా చేసే వారిపై పిడి యాక్ట్ కేసులు పెడ్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ వివరించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయ రంగాన్ని, రైతులను గొప్పగా ఆదుకున్నారని, ఆదుకుంటున్నారని, దీంతో 16% అభివృద్ధి సాధించామని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇప్పటి దాక 4 కోట్ల 93 లక్షల 73 వేల 851 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుచేశామని వివరించారు. బిజెపి రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికైనా తన తప్పును గ్రహించి తెలంగాణ రైతులకు, ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, తెలంగాణలో పండే పంటనంతా కూడా కొంటామని కేంద్రం నుంచి ప్రకటన చేయించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News