Home తాజా వార్తలు చేయూత కొనసాగిస్తాం

చేయూత కొనసాగిస్తాం

నూలు, రసాయనాలపై 50% రాయితీ

 నేతన్నలకు చేతి నిండా పని కల్పించి ఆకలి చావులకు దూరం చేశాం
చేనేత అభివృద్ధికి ప్రతిష్టాత్మక సంస్థలతో ఒప్పందాలు, ఎంపిక చేసిన
కార్మికులకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట పురస్కారాలు జాతీయ
చేనత దినోత్సవాన్ని పురస్కరించుకుని వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: అచేతనంగా మారిన చేనేత రంగానికి పూర్తి చేయూతనిచ్చి ఆదుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమలు, చేనేత జౌళి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో ప్రస్తుతం చేనేత రంగం కళకళలాడతోందన్నారు. దీనికి మరింతగా చేయూత నిచ్చేందుకు మూడు ప్రధాన సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అలాగే రాష్ట్రంలోని నేతన్నలకు చేతి నిండా పని కల్పిస్తున్నామన్నారు. దీంతో గతంలో ఉన్న ఆకలి చావులు రాష్ట్రంలో ఇప్పుడు మచ్చుకైనా వినపించడం లేదన్నారు. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం వార్షిక బడ్జెట్‌లో పెద్దఎత్తున నిధులు కేటాయిస్తోందన్నారు. ప్రస్తుతం దేశ, విదేశాలతో పోటీపడే విధంగా చేనేత రంగం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. దీనికి ఇంకా ఎంతో కాలం పట్టదన్నారు.

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. చేనేత కార్మికులకు ముందుగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాల కలెక్టర్లు, చేనేత కార్మికులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, చేనేత రంగాన్ని శరవేగంగా అభివృద్ధి చేయడం కోసం ఐఐసిటి, ఐఎస్‌బి, యుఎన్‌డిపి వంటి సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు. పోచంపల్లి ఇక్కత్ రకంలో సులువుగా టై…. డై చేయడం, రంగుల రసాయనాల వల్ల జరుగుతున్న హానిని నివారించడంతో పాటు లో క్రొత్త మార్గాలను అన్వేషించడం కోసం ఐఐసిటి (ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ)తో ఒప్పందం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే ఐఎస్‌బి (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) సంస్థతో చేనేత కళాకారులకు, రాష్ట్ర ప్రభుత్వము అమలు చేయుచున్న ప్రభుత్వ పధకాల అమలు పై అధ్యయనంతో పాటు వస్త్రాల మార్కెటింగ్ కొరకు నూతన సలహాల కొరకు, యుఎన్‌డిపి (యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం) సంస్థతో చేనేత కార్మికుల జీవనోపాది పెంపుదల మరియు మార్కెటింగ్ సేవల గురించి ఒప్పందాలను చేసుకోవడం జరిగిందన్నారు.

రాష్ట్రంలో 40 వేల మంది చేనేత రంగంపై ఉపాధి పొందుతున్నారన్నారు. చేనేత రంగంపై ఆధారపడ్డ ప్రతి ఒక్కరికి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తున్నదన్నారు. ఇందుకోసం అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా మన పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయని మంత్రి గుర్తు చేశారు. అలాగే నేతన్నలను ప్రొత్సహించడానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట అవార్డులు కూడా ఇస్తున్నామని తెలిపారు. నేతన్నకు చేయూత పథకాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. కరోనా కారణంగా నాలుగు నెలలు ముందుగానే రూ. 96.43 కోట్లు అందించామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గత మూడేళ్లుగా పెద్ద మొత్తంగా చేనేత రంగానికి బడ్జెట్ కేటాయిస్తున్నదన్నారు. చేనేత మిత్ర ద్వారా నూలు, రసాయనాలపై 50 శాతం రాయితీని అందిస్తున్నామన్నారు. ఇప్పటికే ఇందులో 20,554 మంది నేతన్నలు పేరు నమోదు చేసుకున్నారని తెలిపారు. రాయితీల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చేస్తామన్నారు. 2017, మార్చి 31 వరకు ఉన్న నేతన్నల రుణాలను రద్దు చేశామని మంత్రి గుర్తు చేశారు. ఎనిమిది బ్లాక్ లెవల్ క్లస్టర్లు అమలు చేస్తున్నాం. కొత్త బ్లాక్ లెవల్ క్లస్టర్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని ఆయన తెలిపారు.

కాగా జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రం వ్యాప్తంగా 18 మందిని ఎంపిక చేయగా, వారిలో ఇద్దరికి మంత్రి కెటిఆర్ అవార్డులను అందజేయగా, మిగిలిన 16 మంది అవార్డు గ్రహీతలకు ఆయా జిల్లా కలెక్టర్లు అందజేశారు. అవార్డు గ్రహీతలకు నగదు పురస్కారమును ఈ సంవత్సరము నుండే రూ.10,000- నుండి రూ.25,000లకు పెంచి వారి ఖాతాలో జమచేయాలని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. కాగా నారాయణ పేటలో చేనేత కళాకారులకై కామన్ ఫెసిలిటీ సెంటర్ ను నిర్మించుటకు ఆ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ స్థలాన్ని కేటాయించినట్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రి కెటిఆర్ ఆలంబన యాప్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యుఎన్‌డిపి డిప్యూటీ రెసిడెంట్ రషీద్, చేనేత, జౌళి శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.

KTR Participate in National Handloom Day Virtual Program