Saturday, April 27, 2024

మహాయజ్ఞంలా భావించండి

- Advertisement -
- Advertisement -

మహాయజ్ఞంలా భావించండి
కొత్త విద్యావిధానం భావి తరాలకు మార్గదర్శకం
అందరితో చర్చించి 21వ శతాబ్ధ్దానికి అనుగుణంగా సంస్కరణలు తెచ్చాం
దీనిపై ఎంత చర్చ జరిగితే దేశానికి అంత మేలు
ఇది పుస్తకాల బరువును తగ్గించి నైపుణ్యాలను పెంచుతుంది
జాతీయ విద్యావిధానంపై సదస్సులో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: నూతన జాతీయ విద్యావిధానం నవభారతావనికి పునాది అని ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. నూతన విద్యావిధానంలో పేర్కొన్న సంస్కరణలను అమలు చేయడానికి ఈ రంగంతో సంబంధం ఉన్న అందరూ దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. నూతన విద్యావిధానం సవాలుతో కూడుకున్నదని ఆయన అన్నారు. నూతన జాతీయ విద్యావిధానంలో సంస్కరణలపై శుక్రవారం జరిగిన సదస్సులో వీడియో లింక్ ద్వారా మోడీ పాల్గొని ప్రసంగించారు. విద్యావిధానంపై నాలుగైదేళ్లుగా అందరితో చర్చించి జాతీయ విద్యావిధానంలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చామన్నారు. దీనిపై ఎంత చర్చ జరిగితే దేశానికి అంత ప్రయోజనకరమన్నారు. 21వ శతాబ్దానికి అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు తీసుకు వచ్చామని, కొత్త విద్యావిధానం భావి తరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ప్రధాని చెప్పారు. విద్యావిధానంలో సంస్కరణలు తీసుకువస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

‘21వ శతాబ్దంలో యువతకు నైపుణ్యాలు ఎంతో అవసరం. గతంలో ఉన్న శిక్షణ వ్యవస్థ పూర్తి సాధికారికత సాధించలేదు. నిశిత పరిశీలన ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించాలి. ఏం ఆలోచిస్తున్నారనే దానినుంచి ఎలా ఆలోచిస్తున్నారనే దానిపై దృష్టి సారించాలి. పిల్లలు ఐదో తరగతి వరకు మాతృభాషలోనే చదువుకునే వెసులుబాటు కల్పించాం. నూతన విద్యావిధానంలో పిల్లల మనోవికాసం మరింత అభివృద్ధి చెందుతుంది. వారు తమకు నచ్చిన కోర్సు చదువుకోవచ్చు. విద్యార్థులు వారి లక్షం చేరుకునేందుకు నూతన విద్యావిధానం సాయపడుతుంది. పిల్లల్లో మనో వికాసం పెంచే సిలబస్ మాత్రమే ఉండాలి. పాత విద్యావిధానంలో సిలబస్ ఎక్కువగా ఉండేది. సిలబస్ పేరుతో భారీ పుస్తకాల బరువు అవసరం లేదు. వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించేలా విద్యావిధానం ఉండాలి. జాతీయ విలువలు, సంస్కరణ దిశగా ప్రతి దేశం ముందుకు వెళ్తోంది. ఆ దిశగా ప్రతి దేశం తమ విద్యావిధానంలో మార్పులు చేసుకుంటోంది’అని మోడీ అన్నారు.

జాతీయ విద్యావిధానాన్ని ప్రకటించిన తర్వాత ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించకపోవడం సంతోషకరమని ప్రధాని అన్నారు. కొత్త విధానం పట్ల అందరూ సంతృప్తిగా ఉన్నారన్నారు. ఇది ఒక వర్గం వైపుమొగ్గు చూపుతోందని కాని, పక్షపాతంగా ఉందని కానీ ఏ ప్రాంతం, లేదా, వర్గం చెప్పలేదన్నారు. దేశంలోని టాలెంట్ దేశంలోనే ఉండేలా భావితరాల అభివృద్ధి కోసం కృషి చేసేలా చూడడానికి కూడా తాము ప్రయత్నిస్తున్నామన్నారు. విద్యాసంస్థలకు స్వయంప్రతిపత్తి అంశం విషయంలో దేశం రెండు వర్గాలుగా విడిపోయి ఉంది. విద్యాసంస్థల్లో ప్రభుత్వానికి కూడా పాత్ర ఉండాలని ఒక వర్గం వాదిస్తుంటే ప్రతి సంస్థకు స్వేచ్ఛ ఉండాలని మరో వర్గం అంటోంది. ఈ రెండు ఆలోచనల మధ్యేమార్గంగా నాణ్యమైన విద్య ఉంటుంది. నాణ్యమైన విద్య కోసం కృషి చేసే సంస్థలకు ప్రోత్సాహకంగా మరింత స్వేచ్ఛ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల నాణ్యత పెరగడమే కాకుండా ఉన్నత విద్యాసంస్థలు ఎదగడానికి తోడ్పడ్తుందని ప్రధాని అన్నారు. ఈ రోజుల్లో సమాచారానికి కొదవ లేదని, అయితే ఏ సమాచారం అవసరం, ఏది కాదో తెలుసుకోవడం ముఖ్యమని, దీనివల్ల ఆసక్తి, తరగతిలో పాలు పంచుకోవడం పెరుగుతుందని మోడీ చెప్పారు.

PM Modi speech on New education policy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News