Saturday, May 4, 2024

కంటోన్మెంట్ రోడ్లను తెరవండి

- Advertisement -
- Advertisement -

నిబంధనలు తుంగలో తొక్కుతూ రక్షణ విభాగం అధికారులు ఇష్టానుసారంగా రోడ్లు మూసి వేస్తున్నారు 
వాళ్ల అనూహ్య నిర్ణయాలతో లక్షలాది మంది ప్రజలు కష్టనష్టాలు పడుతున్నారు
కొవిడ్‌సాకు చూపి ప్రజల హక్కులు కాలరాస్తున్నారు
రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కు మంత్రి కెటిఆర్ సుదీర్ఘ లేఖ

KTR Writes to Rajnath Singh on Cantonments Officials

మన తెలంగాణ/హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధికారుల తీరుపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయనకు ఒక లేఖ రాశారు. కంటోన్మెంట్ ప్రాంతంలో అధికారులు తమకు నచ్చినట్లుగా రోడ్లును మూసివేస్తున్నారని, దీని వల్ల ప్రజల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ లేఖలో మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. అవసరం ఉన్నా లేకున్నా, సరైన కారణాలు లేకుండానే ఆర్మీ అధికారులు రోడ్ల మూసిపెతను పదేపదే చేయడం ద్వారా కంటోన్మెంట్ ఏరియాలో నివసిస్తున్న లక్షలాదిమందికి నిరంతరం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. జీవనరేఖ లాంటి రోడ్ లను సైతం ఎప్పటికప్పుడు మూసివేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రజల బాధల్ని పరిగణలోకి తీసుకున్న కేంద్రం గతంలో రోడ్ల మూసివేత లో ప్రత్యేకమైన స్టాండర్డ్ ప్రోటోకాల్ పాటించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిందని, అయితే అలాంటి ఆదేశాలను స్థానిక ఆర్మీ అధికారులు ఏమాత్రం పాటించడంలేదని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ ఉత్తర, ఈశాన్య ప్రాంతాలకు చెందిన ప్రజలకు కంటోన్మెంట్‌లోని దారుల నుంచే వచ్చి వెళ్తుంటారని పేర్కొన్నారు. అయితే కంటోన్మెంట్ అధికారులు తరుచూ, సడన్‌గా అక్కడ రోడ్లు మూసేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతమున్న కోవిడ్ సంక్షోభం లోనూ అధికారులు ఇష్టారీతిన రోడ్లు మూసి వేస్తున్నారని తెలిపారు. అత్యంత కీలకమైన అలహాబాద్ గేట్, ఘాఫ్ రోడ్డు, వెల్లింగ్టన్, ఆర్డినెన్స్ రోడ్డు వంటి వాటిని జూలై నెలలో కనీసం పది రోజుల పాటు కూడా తెరవలేదన్నారు.

నగరంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయన్న సాకు చూపించి మూసివేశారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రోడ్ల మూసివేత వల్ల యాప్రాల్, కౌకూర్, బొల్లారం తిరుమలగిరి నుంచి రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులు వీటి వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఇప్పటికే నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో లేదని, వ్యక్తిగత వాహనాల పైన ఈ రోడ్లను వదిలి ఇతర రోడ్లపైన ప్రయాణం చేసి తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితులలో రోడ్ల మూసివేత ద్వారా అనేక మంది ప్రాణాలు పణంగా పెట్టినట్టు అవుతుందని మంత్రి కెటిఆర్ అన్నారు. ఇలాంటి చర్యల వలన కంటోన్మెంట్లోని ప్రజల్లో అసంతృప్తి పెద్దఎత్తున పెరుగుతున్నదని తెలియజేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో సుమారు 25 రోడ్లు పదేపదే మూసివేతకు గురవుతున్నాయని… ఇందులో అనేక రోడ్లు వంద సంవత్సరాల నుంచి నిరంతరం ప్రజలకు ప్రజల కోసం తెరిచి ఉండేవని అన్నారు. పైగా ఇందులో అనేక రోడ్లు రాజీవ్ రహదారి కి కలిపే రోడ్లను సైతం మూసివేయడం ద్వారా రహదారిని వినియోగించుకునేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రిసాల బజార్, బొల్లారం బజార్, లాల్ బజార్ వంటి ప్రాంతాలను కంటోన్మెంట్ బోర్డు చట్టం ప్రకారం మార్కెట్లు గా వీలుగా గుర్తించబడ్డాయని వీటన్నిటి ఉపయోగించుకోవడం ప్రజలందరికీ చట్టప్రకారం కల్పించిన హక్కు అని, దీన్ని సైతం ఆర్మీ అధికారులు గౌరవించడం లేదని తాను రాసిన లేఖలో మంత్రి కెటిఆర్ వివరించారు.
కంటోన్మెంట్ జోన్లలో రోడ్లు మూసివేత, ఇతరత్రా నిర్ణయాలకు సంబంధించి మొదట పేపర్లలో ప్రకటన ఇచ్చి, ఆ తర్వాత దాని మీద ఫీడ్ బ్యాక్ తీసుకుని ఆ తర్వాత డిఫెన్స్ వారు నిర్ణయం తీసుకోవాలన్నారు. కానీ స్థానిక డిఫెన్స్ అధికారులు మాత్రం ఇవేవీ పాటించకుండా తమకు నచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కంటోన్మెంట్ రహదారి నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే రోడ్డు కనెక్టివిటీ ఉందని, రోజుకు సుమారు 10 లక్షల మంది దీన్ని వినియోగిస్తారని చెప్పారు. రక్షణ శాఖ అధికారులు తీసుకునే సడన్ నిర్ణయాల వల్ల వారంతా ఇబ్బందులు పడుతున్నట్టు లేఖలో మంత్రి కెటిఆర్ వివరించారు. . అలాగే ఎన్నికైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అనుసరించాల్సిన ప్రోటోకాల్స్ పాటించడం లేదన్నారు. ఈ అంశాలపై తక్షణమే స్పందించి తగు అధికారులు జారీ చేయాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను మంత్రి కెటిఆర్ కోరారు. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కంటోన్మెంట్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని సూచించారు.

KTR Writes to Rajnath Singh on Cantonments Officials

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News