Monday, April 29, 2024

ఎల్‌ఆర్‌ఎస్‌కు లైన్ క్లియర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు దారులకు రాష్ట్ర ప్రభు త్వం తీపి కబురు చెప్పింది. 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు రెండు నెలల పాటు గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను స్వీకరించింది. అప్పట్లో స్వీకరించిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులపై సిఎం రేవంత్ కీల క నిర్ణయం తీసుకున్నారు. అప్పటి ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు మార్చి 31వ తేదీలోగా క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం కల్పించాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు అప్ప టి నిబంధనల ప్రకారమే లే ఔట్ క్రమబద్ధీకరణ చేపట్టాలని సిఎం రేవంత్ అధికారులతో పేర్కొన్నారు. లక్షలాది మంది దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు మేలు చేసే ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గతంలో రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం ఈ అవకాశం కల్పించనుంది. ఆదాయ సమీకరణ, వనరులపై నిర్వహించిన సమీక్షలో సిఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వి వాదాలు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు, దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు మినహా ఇతర లే ఔట్ల ప్లాట్లకు ప్రభుత్వం ఈ అవకాశం కల్పించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో 25.44 లక్షల మంది పైగా దరఖాస్తుదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ దరఖాస్తుల క్రమబద్ధీకరణతో సుమారు గా ప్రభుత్వానికి రూ 15 నుంచి రూ.20 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
పంచాయతీల్లో 10.76 లక్షల దరఖాస్తులు
రాష్ట్రంలో అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి దాదాపు 25.44 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు. కార్పొరేషన్లలో 4.13 లక్షలు, మున్సిపాలిటీల్లో 10.54 లక్షలు, పంచాయతీల్లో 10.76 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఓపెన్ ప్లాట్లు, నాన్ లే ఔట్‌లకు సంబంధించిన వాటికి దరఖాస్తుదారులు వెయ్యి రూపాయల ఫీజు చెల్లించి, తమ డాక్యుమెంట్ కాపీని సమర్పించారు.
మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీలకు ఈ స్కీమ్
నగర, పురపాలికలు, పంచాయతీల పరిధిలో అక్రమ లే ఔట్‌లోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో కెసిఆర్ ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. అనధికార లే- ఔట్లు, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు అవకాశం ఇస్తూ ఎల్‌ఆర్‌ఎస్ (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్) ప్రవేశపెట్టింది. ఎల్‌ఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్ ఫీజును రూ.1,000లుగా లే ఔట్ దరఖాస్తు ఫీజును రూ.10,000లుగా ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ పథకం కింద 100 గజాలలోపు ప్లాటు కలిగి ఉన్న వాళ్లు రెగ్యులరైజేషన్ ఛార్జీల కింద గజానికి రూ.200 చెల్లించాల్సి ఉండగా, 100 నుంచి 300 గజాల వరకు ఉన్న స్థలాలకు రెగ్యులరైజేషన్ ఛార్జీలు గజానికి రూ.400, 300 నుంచి 500 గజాల వరకు గజానికి రూ.600ల రెగ్యులరైజేషన్ ఛార్జీలు చెల్లించాలి. మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీలకు కూడా ఈ ఎల్‌ఆర్‌ఎస్ స్కీమ్ వర్తిస్తుందని గత ప్రభుత్వం వెల్లడించింది.
న్యాయస్థానాల్లో కేసులు నిలిచిపోయిన ప్రక్రియ…
గత ప్రభుత్వ హయాంలో లే ఔట్ల క్రమబద్ధీకరణను చేపట్టే క్రమంలో న్యాయస్థానాల్లో కేసులు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు ఎన్నికలు రావడం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు నెమ్మదిగా ఆశలు సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో ఇటీవల బడ్జెట్ రూపకల్పన చేస్తున్న సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులపై దృష్టి సారించారు. పెండింగ్ దరఖాస్తుల వివరాలపై అధికారులను ఆరా తీశారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంలో ప్రభుత్వం దరఖాస్తుదారులకు పూర్తి సహకారం అందిస్తుందని అభయమిచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎల్‌ఆర్‌ఎస్‌పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. తమ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవటం ద్వారా ఆయా స్థలాలపై అధికారిక హక్కులన్నీ వారి సొంతమవుతాయి. దీంతో నిర్మాణాలకు అనుమతులు లభించటంతో పాటు, బ్యాంకు రుణాలు పొందేందుకు, స్థలాల క్రయ విక్రయాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News