Saturday, April 27, 2024

‘ఆత్మనిర్భరత’.. ఆయుధాల దిగుమతి!

- Advertisement -
- Advertisement -

స్థానికంగా లభించే ముడిపదార్థాలతోనే స్వయం సమృద్ధి సాధిస్తున్నామని ‘ఆత్మనిర్భరత’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక పక్క ప్రచారం చేస్తోంది. భారత దేశం మరో పక్క ఆయుధాల దిగుమతిలో ప్రపంచంలోనే అగ్రస్థానం లో ఉంది. ప్రపంచ దిగుమతుల్లో 201722 మధ్య భారత దేశం వాటా 11 శాతంగా కొనసాగుతోందని స్టాక్ హోవ్‌ులోని అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ (ఎస్‌ఐపిఆర్‌ఐ) తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఆయుధాల దిగుమతి 201317 మధ్య 12 శాతం ఉండగా 2018 23 మధ్య 11 శాతానికి స్వల్పంగా తగ్గిందని ఆంతర్జాతీయ ఆయుధాల మార్పు ధోరణుల గురించి 2023 మార్చిలో విడుదల చేసిన ఆ నివేదికలో పేర్కొంది.

రక్షణ పరికరాల ఎగుమతిలో భారత దేశ వాటా కేవలం 0.2 శాతమని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపినట్టు అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ గత ఏడాది విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇప్పుడది ఇంకా తగ్గింది. గత నెలలో బెంగళూరులో జరిగిన ఎరో ఇండియా 2023 సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతి 1.5 బిలియన్ డాలర్ల నుంచి 2024 25 నాటికి 5 బిలియన్ డాలర్లకు పెంచనున్నట్టు చెప్పారు. దేశాల మధ్య ఘర్షణలు, అంతర్జాతీయ ఆయుధ వ్యాపారం, సైన్యం, రక్షణకు సంబంధించిన విషయాల గురించిన పరిశోధనలో ‘అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ’ ప్రసిద్ధి చెందింది.

భారతదేశం 1992 2022 మధ్య అంతర్జాతీయంగా ఆయుధాల దిగుమతి భారాన్ని ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువగా భరిస్తోందని ఈ సంస్థ పేర్కొంది. ‘భారత దేశానికి చైనా, పాకిస్థానతో ఉన్న ఉద్రిక్తతల వల్ల ఈ ఆయుధా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది’ అని ఆ సంస్థ పేర్కొంది. భారత దేశానికి రక్షణ ఉత్పత్తుల సామాగ్రిని 2013 22 మధ్య రష్యానే ఎక్కువగా సమకూర్చినప్పటికీ, ఈ దశాబ్దంలో 65 శాతం నుంచి 45 శాతానికి తగ్గింది. యుక్రెయిన్ యుద్ధం వల్ల రష్యాపైన అంతర్జాతీయంగా విధించిన ఆంక్షలతో అక్కడ నుంచి దిగుమతులు ఈ మేరకు తగ్గాయి.

పాకిస్థాన్ తన ఆయుుధాల ఎగుమతిని 2013 17, 2018 22 కాలానికి 14 శాతం పెంచుకుని ప్రపంచ ఎగుమతుల్లో 3.7 శాతం వాటాను సంపాదించింది. ‘అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ’ నివేదిక ప్రకారం 201822 కాలానికి పాకిస్థాన్ దిగుమతి చేసుకునే ఆయుధాల్లో 77 శాతం చైనా నుంచే వస్తున్నాయి. ఆయుధాల ఎగుమతిలో అంతర్జాతీయంగా 40 శాతం వాటా అమెరికాదే. అమెరికా ఇదివరకటి కంటే 14 శాతం ఎక్కువ ఆయుధ ఎగుమతులను పెంచుకుంది. ఈ కాలానికి ఫ్రాన్స్ ఎగుమతులు 44 శాతం పెంచుకోగా, రష్యా (31శాతం), చైనా (23 శాతం), జర్మనీ (35 శాతం) ఆయుధాల ఎగుమతులు తగ్గాయి.

గడిచిన 201317తో పోల్చుకుంటే, 201822 కాలానికి ప్రపంచ ఆయుధాల ఎగుమతిలో అమెరికా, ఫ్రాన్స్ కలిపి 51 శాతంతో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ నివేదిక ప్రకారం 2022లో ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల జాబితాలో భారత్, ఖతార్ తరువాత 2 శాతంతో ఉక్రెయిన్ మూడవ స్థానంలో నిలబడింది. గత ఏడాది ఫిబ్రవరిలో మొదలైన ఉక్రెయిన్ యుద్ధంతో ఆ దేశానికి ఆయుధాలు ఎగుమతి చేసే 29 దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఉక్రెయిన్ ఆయుధ సంపత్తిని పెంచే దేశాల్లో పోలెండ్ 17 శాతం, జర్మనీ 11 శాతం, బ్రిటన్ 10 శాతం, సెజ్ రిపబ్లిక్ 4.4 శాతం ఆయుధాలను ఎగుమతి చేస్తున్నాయి. భారత రక్షణ పరికరాల దిగుమతి 2018 19 మధ్య ఉన్న 46 శాతం నుంచి 2022 నాటికి 36.7 శాతానికి తగ్గిందని ఈ నెల 13వ తేదీ రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ రాజ్యసభలో రాతపూర్వకంగా వెల్లడించారు. భారత దేశం ఇప్పటికీ రక్షణ రంగ పరికరాల దిగుమతిలో అగ్రస్థానంలోనే ఉన్నప్పటికీ, స్థానికంగా దొరికే సామాగ్రితోనే రక్షణ రంగ ఉత్పత్తులను చేపడుతున్నామని ‘ఆత్మనిర్భర భారత్’ అన్న నినాదం కోసం దిగుమతులను తగ్గించి చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మిలిటరీ రిటైర్డ్ అధికారులు మాత్రం అంటున్నారు.

భారత వైమానికి దళం కోసం 114 కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, కొత్తగా భారత నౌకాదళంలో చేరిన విమాన వాహహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ కోసం మరో 26 కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలు కోసం 45 బిలియన్ డాలర్లు వెచ్చించిందని రిటైర్డ్ బ్రిగేడియర్ రాహుల్ భోంస్లే చెప్పా రు. వీరు ఢిల్లీలోని సెక్యూరిటీ రిస్క్ కన్సల్టెన్‌సీగా ఉన్నారు. త్రివిధ దళాలకు కలిపి ఆయుధాలు కలిగిన సాధారణ ఏరోనాటిక్ సిస్టం (జిఎఎఎస్‌ఐ) 18, ఎంక్యూ 9బి అనే మానవ రహిత సముద్ర రక్షణ వైమానిక వాహనాలు 30 వరకు దిగుమతి చేసుకోవడం ద్వారా ప్రపంచంలో అతి పెద్ద రక్షణ ఉత్పత్తుల దిగుమతి దేశంగా భారత దేశం కొనసాగుతోందని రిటైర్డ్ బ్రిగేడియర్ రాహుల్ భోంస్లే తెలిపారు. ‘రక్షణ అవసరాల్లో స్వయం పోషకత్వం సాధించడానికి వాస్తవిక దృష్టితో దీర్ఘకాలికంగా రక్షణ పరికరాల దిగుమతి చేసుకోవడం అవసరం’ అని ఆయన పేర్కొన్నారు.

కొన్ని పరికరాలను, 410 ప్లాట్‌ఫారాల దిగుమతులపై 2020 నుంచి నిషేధం విధించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ‘ఆత్మనిర్భర భారత్’ అన్న మాటను ప్రచారం చేసుకోవడానికి ఇలా త్రివిధ దళాల అధికారులు, రక్షణ శాఖ అధికారులు ఆడంబరంగా ప్రకటించుకుంటున్నారని రిటైర్డ్ మూడు నక్షత్రాల భారత వైమానికి అధికారి ఒకరు భిన్నంగా వ్యాఖ్యానించారు.‘ఆత్మనిర్భర భారత్’ నినాదం రాజుగారి దేవతా వస్త్రాల కథలా ఉందని ఆ అధికారి అన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ అనే దాన్ని విజయవంతం చేయాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం అవుతుందని, దీర్ఘ కాలం తీసుకుంటుందని, అప్పటికప్పుడు తయారయ్యేది కాదన్న సత్యాన్ని వెల్లడించడానికి సంబంధిత అధికారులు వెనకాడుతున్నారని తెలిపారు. ‘ఆత్మనిర్భర భారత్’ను అమలు చేసి, ఫలితాలు రాబట్టాలంటే ఇది సరళంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.

దీని అమలుకు రక్షణ మంత్రిత్వ శాఖాధికారులు అనుసరించే ‘ఆచరణ సాధ్యం కాని రహస్య విధానాలు’ ఈ ప్రయత్నానికి సరిపోవని హెచ్చరించారు. భారత రక్షణ పరికరాల ఎగుమతులు, మిలిటరీ ప్లాట్ ఫారాల ప్రమాణాలతో ముడిపడి ఉన్నాయి. ఇటీవల ఆడంబరంగా ప్రదర్శించిన 300ఒడ్ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాఫ్టర్‌లలో ఒకటి అరేబియా మహాసముద్రంలో కూలిపోవడంతో, వాటి ఎగుమతుల ఆశపై నీళ్ళు చల్లినట్టుయింది. రెండు ఇంజిన్లతో 5.8 టన్నుల బరువున్న ఈ హెలికాఫ్టర్లను తయారు చేసిన హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కంపెనీకి ఇదొక పెద్ద దెబ్బ. అడ్వాన్స్‌డు లైట్ హెలికాఫ్టర్‌ల ఉత్పత్తి ప్రారంభించిన 2002 నుంచి ఇప్పటి వరకు 20 హెలికాఫ్టర్లు ప్రమాదానికి గురయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదాల్లో అనేక మంది మిలిటరీ, సివిల్ అధికారులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు.

42.5 మిలియన్ డాలర్లకు ఈక్విడార్ ఎయిర్ ఫోర్స్‌కు మనం అమ్మిన ఏడు అడ్వాన్స్‌డు లైట్ హెలికాఫ్టర్‌లలో ప్రమాదానికి గురైన నాలుగు హెలికాఫ్టర్లను ఇందులో చేర్చలేదు. ఫలితంగా హిందూస్థాన్ ఏరోనేటికల్ లిమిటెడ్‌తో 2015లో ఈక్విడార్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ ఒప్పందం రద్దు భారత్ స్వయం నిర్మిత హెలికాఫ్టర్ల ఎగుమతులకు ఇది పెద్ద దెబ్బ. నాలుగు హెలికాఫ్టర్లకు జరిగిన ప్రమాదాలలో రెండు ప్రమాదాలు ‘యాంత్రిక వైఫల్యం’ వల్లనే జరిగిందని ఈక్విడార్ రక్షణ మంత్రి ఫెర్నాండో కార్డరో పత్రికలవారికి చెప్పారు. మిగతా రెండు హెలికాఫ్టర్ల ప్రమాదం ‘మానవ తప్పిదం’ వల్లనే జరిగిందని హిందూస్థాన్ ఏరోనేటికల్ టిమిటెడ్, ఈక్విడార్ ఎయిర్‌ఫోర్స్ విడివిడిగా చెప్పాయి.

అమెరికా, ఐరోపా దేశాల్లో పశ్చిమ దేశాలు తయారు చేసే హెలికాఫ్టర్లతో పోటీ పడాలంటే, ఎగిరేటప్పుడు హెలికాఫ్టర్ల భద్రత అనేది ప్రాథమికమైన లక్షణం. ఈక్విడార్ ఇవేమీ చూడకుండా ఒక నమ్మకంతో కొనడంతో ఇప్పుడు హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్‌తో ఒప్పందాలు చేసుకోవడానికి తడబడుతోంది. గాంధీ నగర్‌లో గత అక్టోబర్‌లో జరిగిన డెఫ్‌ఎక్సోపో 2022 లో హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ చీఫ్ సి.బి. అనంతకృష్ణన్ మాట్లాడుతూ అడ్వాన్స్‌డు లైట్ హెలికాఫ్టర్‌కు అపారమైన ఎగుమతి అవకాశాలున్నాయనడం గమనార్హం. “భారత రక్షణ పరికరాలు, హెలికాఫ్టర్లను ఎగుమతి చేయాలని భారత ప్రభుత్వానికి ఎంతో ఉన్నతాశయం ఉన్నప్పటికీ, అడ్వాన్స్‌డు లైట్ హెలికాఫ్టర్ల సామర్థ్యం పైన వినియోగదారుల నమ్మకాన్ని చూరగొనవలసిన అవసరం ఎంతైనా ఉంది” అని ఒక సీనియర్ పారిశ్రామికాధికారి అన్నారు. అడ్వాన్స్‌డు లైట్ హెలికాఫ్టర్ల ఎగుమతుల్లో విజయాలు సాధించడానికి ముందు విశ్వసనీయత సాధించాలని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి హితవు పలికారు.

రాఘవశర్మ
9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News