Sunday, May 12, 2024

దుబాయ్‌లో లాక్‌డౌన్ ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

Dubai migrants

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రెండురోజులుగా దుబాయ్, అబుదాబిలో లాక్‌డౌన్ ఎత్తివేయడంతో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని మన రాష్ట్రానికి చెందిన కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 9 వేల పైచిలుకు కేసులు అక్కడ నమోదు కాగా రెండు రోజుల్లో పాజిటివ్‌ల సంఖ్య 1,000 పైచిలుకు నమోదయినట్టు గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి ఉపాధ్యక్షుడు శేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మన రాష్ట్రం నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన లక్షలాది మంది జీవితాలు కరోనా వైరస్‌తో ప్రమాదంలో పడ్డాయని ఆయన తెలిపారు.

ఇప్పటికే చాలామంది కార్మికులు పనులకు వెళ్లకుండా లేబర్ క్యాంపులోని గదులకే పరిమితమయ్యారు. ఈ గదుల్లో వందల మంది ఉన్నారని, వీరిలో ఎందరికీ వైరస్ సోకిందో ఎవరికీ అంతుబట్టని విధంగా ఉందని ఆయన తెలిపారు. దుబాయిలో పాజిటివ్ అని తేలిన వ్యక్తులను ఇక్కడి ప్రభుత్వం ఐసోలేషన్‌కు తరలించకుండా రూంలోనే ఉంచుతున్నారని ఆయన వాపోయారు. ఒకే గదిలో పాజిటివ్, నెగిటివ్ వ్యక్తులను కలిపి ఉంచుతుండడంతో అందరికీ వైరస్ సోకుతోందని శేఖర్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో ఇక్కడ పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు: గుండెల్లి నర్సింహా
ఇక్కడ పనిచేసే కార్మికులు స్వరాష్ట్రానికి రావడానికి సిద్ధంగా ఉన్నారని గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షుడు గుండెల్లి నర్సింహా పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల్లో మన రాష్ట్రానికి చెందిన వేల మంది కార్మికులు దీనావస్థలో ఉన్నారన్నారు. ఇక్కడ ఉండి భవిష్యత్తులో తాము పనిచేసే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుతం సొంత ఊరి నుంచి డబ్బులు పంపిస్తే తాము ఇక్కడ కిరాయిలు కట్టుకుంటున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులు రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. లాక్‌డౌన్ అనంతరం సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌లు ఇక్కడ పనిచేస్తున్న కార్మికులను స్వరాష్ట్రానికి తీసుకెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఇదే విషయాన్ని టిఆర్‌ఎన్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల దృష్టికి తీసుకెళ్లామన్నారు. మహేశ్‌బిగాల ఇక్కడ అవస్థలు పడుతున్న కార్మికులను ఆదుకోవడానికి ముందుకువచ్చారని ఆయన తెలిపారు.

అందరిలో భయం
పాజిటివ్ వ్యక్తుల్లో తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన వారితో పాటు, కేరళ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందినవారు ఉంటున్నారు. వీరంతా ఇప్పుడు చిన్న చిన్న గదుల్లో పక్కపక్కనే ఉంటున్నారు. ఐదారుగురు వ్యక్తులకు ఒక గది చొప్పున కేటాయించారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ ఎత్తివేసినా పనులు దొరక్క చాలామంది పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని అక్కడి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇంట్లో పనులు చేసే వారిని ప్రస్తుత పరిస్థితుల్లో రావద్దని అక్కడి యజమానులు సూచించడంతో వారికి ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇతర గల్ఫ్ దేశాలు అయిన దుబాయి, మస్కట్, ఖతార్‌లలో కూడా పరిస్థితి అలాగే ఉందని అక్కడి కార్మికులు పేర్కొంటున్నారు.

 

Lockdown lifted in Dubai
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News