Saturday, April 27, 2024

‘మా’ మసకబారిపోయిందని వ్యాఖ్యానించడం తప్పు

- Advertisement -
- Advertisement -

MAA President Naresh press meet

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలు హోరాహోరీగా జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాష్‌రాజ్‌కి మద్ధతుగా నిలిచిన మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. గడిచిన నాలుగేళ్లుగా ‘మా’ ప్రతిష్ఠ మసకబారిందని నాగబాబు వ్యాఖ్యానించారు. దీంతో ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేష్ శనివారం హైదరాబాద్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ “మా అసోసియేషన్ ప్రతిష్ఠ మసకబారిందని నాగబాబు అన్న మాటలు ఎంతో బాధించాయి. ‘మా’ చేపట్టిన అన్ని అభివృద్థి కార్యక్రమాల గురించి సినీ పెద్దలందరికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ముందుకు వెళ్లాను. ఇక ప్రకాశ్‌రాజ్ నాకు మంచి మిత్రుడు. ఎప్పుడో మూడు నెలల క్రితం నాకు ఫోన్ చేసి ఈ ఏడాది ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. తెలుగు సినిమాల్లో నటించేవాళ్లు ఎవరైనా పోటీ చేయవచ్చని చెప్పాను. మంచు విష్ణు.. సినిమా బిడ్డ. కష్టాలు, లాభనష్టాల గురించి పట్టించుకోకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు.

తను కూడా ఈసారి ఎన్నికల్లో భాగమవుతా అన్నారు. ‘మా’ రాజకీయ పార్టీ కాదు… ఎవరు వచ్చినా స్వాగతిస్తామని అన్నాను. ఇక ప్రకాష్‌రాజ్ తన ప్యానల్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం తప్పని అనడం లేదు. అయితే ప్రస్తుతం జనరల్ బాడీలో ఉన్న సభ్యులే తమ పదవీ కాలం ముగియక ముందే ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌లో చేరి.. సమావేశంలో కనిపించడం చూసి మేమంతా షాకయ్యాం. అదే సమావేశంలో నటుడు నాగబాబు మాట్లాడుతూ.. ‘మా’ మసకబారిపోయిందని వ్యాఖ్యలు చేశారు. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. అలాంటిది నాగబాబు.. ‘మా’ మసకబారిపోయిందని వ్యాఖ్యానించడం తప్పు. లోకల్, నాన్‌లోకల్ అని మేము అనలేదు. ఇప్పుడు కూడా ఎన్నికలు ఏకగ్రీవం కావాలని మేము కోరుకుంటున్నాం. మా’ అసోషియేషన్‌లో 914 మంది జీవితకాల సభ్యులు. 29 మంది అసోసియేట్ సభ్యులు, 18 మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి 728 మంది సభ్యులకు రూ.3 లక్షలతో జీవిత భీమా చేయించాం. మృతిచెందిన 16 మంది సినీ ఆర్టిస్టుల కుటుంబాలకు రూ.50 లక్షలు అందజేశాం. 314 మందికి ఆరోగ్య బీమా చేయించాం. రూ.3 వేల పించన్‌ను రూ.6 వేలకు పెంచాం. సభ్యత్వ రుసుము రూ.లక్ష నుంచి రూ.90 వేలకు తగ్గించాం. కొత్తగా 87 మంది సభ్యులు అసోసియేషన్‌లో చేరారు. అసోసియేషన్‌పై నమ్మకం లేకపోతే ఎలా చేరతారు? జాబ్ కమిటీ ద్వారా 35 మంది వృద్థ కళాకారులకు సినిమాల్లో అవకాశం కల్పించాం. కరోనా కష్టకాలంలో ‘మా’ అసోసియేషన్‌కు రూ.30 లక్షల విరాళాలను అందాయి. వాటిలో రూ.10 లక్షల జీవిత అందించారు. అందులో రూ.లక్షను సీసీసీకి పంపించాం. అసోసియేషన్‌లో 20 ఏళ్లుగా సభ్యులుగా ఉన్నప్పటికీ ఎలాంటి పదవీ ఆశించలేదు.

కావాలంటే మేమంతా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము పదవుల కోసం ఆశపడడం లేదు. సాయం అడిగిన ప్రతి ఒక్కరికీ నా వంతు సాయం చేస్తూనే ఉన్నాను. కానీ ఇప్పుడు మేము చేసిన పనులను తక్కువగా చేసి మమ్మల్ని ఎందుకు హింసిస్తున్నారు. మేము హింసకు లొంగం”అని అన్నారు. కరాటే కల్యాణి మాట్లాడుతూ “మా అసోసియేషన్ ఎన్నికలను ఏకగ్రీవం చేస్తామన్నా మేం ఆనందంగా అంగీకరిస్తాం. మహిళకు అవకాశం ఇస్తే ఆనందంగా సపోర్ట్ చేస్తాం”అని తెలిపారు. శివబాలాజీ మాట్లాడుతూ “కమిటీ సభ్యులుగా ఇప్పటివరకు మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. ఒకవేళ ఎవరికైనా వాటిపై సందేహాలు ఉంటే తప్పకుండా మమ్మల్ని అడగవచ్చు. ‘మా’ కార్యాలయంలోని రికార్డులలో ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతి విషయాన్ని నమోదు చేయించాం”అని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News