Friday, May 3, 2024

బాధ్యులపై చర్యలు

- Advertisement -
- Advertisement -

గాంధీ ఆసుపత్రి ఘటనలపై మంత్రి ఈటల గరం

 అధికారులపై ఆగ్రహం
 జరిగిన ఘటనలు ఎంత మాత్రం మంచివి కాదు
 డాక్టర్ స్థాయిలో వసంత్‌కుమార్ ఆత్మహత్యకు ప్రయత్నించడం సరికాదు
 కమిటీలు వేసి నివేదికలు రప్పిస్తాం, బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం
మనతెలంగాణ/హైదరాబాద్: గాంధీ ఆసుపత్రి వ్యవహారంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో అక్రమాలపై బాధ్యులు ఎవరైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో శనివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. గాంధీ ఆసుపత్రిలో పరిణామాలు, ఆరోగ్య శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఆసుపత్రి అధికారులపై ఆయన సీరియస్ అయ్యారు. గాంధీ ఆసుపత్రిలో జరిగిన సంఘటనలు ఏమాత్రం ఆహ్వానించదగినవి కాదని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. డాక్టర్ వసంత్‌కుమార్ ఆరోపణలపై మంత్రి ఆరా తీశారు. డాక్టర్ స్థాయిలో ఉన్న ఆయన ఆత్మహత్యకు యత్నించడం సరికాదన్నారు. వైద్యశాఖలో జరుగుతున్న వాటిపై కమిటీలు ఏర్పాటు చేస్తామని, ఆ కమిటీలు ఎప్పటికప్పుడు తమకు నివేదికలు ఇస్తుంటాయని మంత్రి పేర్కొన్నారు. వ్యక్తుల కంటే వ్యవస్థే ముఖ్యమని,వాస్తవాలు వెలికి తీసి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి వెల్లడించారు. ఇంటర్‌షిప్‌కు సంబంధించి లీవ్ కోసం స్పెషల్ చీఫ్ సెక్రటరీ నుంచి మాత్రమే అనుమతులు తీసుకోవాలన్నారు. హాజరుకు సంబంధించి సూపరిండెంట్‌కు ఎలాంటి అధికారం లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బోధనాసుపత్రుల్లో మెరుగైన సేవలు కోసం ఇతర రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయాలని మంత్రి ఈటల సూచించారు.
అవకతవకలపై విచారణ
గాంధీ ఆసుపత్రిలో అవకతవకలపై విచారణకు వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. విచారణ చేసే బాధ్యతను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు అప్పగించారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య విద్యార్థులకు వంద శాతం హాజరు తప్పనిసరి చేశారు. విద్యార్థుల హాజరు నమోదు బాధ్యతల నుంచి సూపరిండెంట్‌ను తొలగించారు.
ప్రభుత్వాసుపత్రుల్లో ఫీడ్ బ్యాక్ విధానం
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి రోగి అనుభవం ఎలా ఉందో తెలుసుకునేందుకు ఫీడ్ బ్యాక్ విధానం అమలు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఏ పనిచేసినా ఫీడ్ బ్యాక్ అనేది చాలా ముఖ్యమని, ఆ ఫీడ్ బ్యాక్ తో యాజమాన్యాలు ప్రజల ఏం ఆశిస్తున్నారో వాటిని అందించవచ్చని పేర్కొన్నారు. టెక్నాలజీ పెరిగిన తరువాత ఫీడ్ బ్యాక్ అవశ్యకత మరింత పెరిగిందని తెలిపారు. అనేక రంగాల్లో ఐటీ అప్లికేషన్స్ వాడుతున్నామని, వైద్య రంగంలో కూడా వాటిని ఉపయోగించి పారదర్శకతను, కచ్చితత్వాన్ని పెంచి మరింత సంతృప్తి కరమైన సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావల్సిన అవసరం ఉందని చెప్పారు. మై క్రిటిక్ పేరుతో ఫీడ్ బ్యాక్ యాప్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ఇలాంటివి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఒక రోగి ఆసుపత్రికి వస్తే రిసెప్షన్ దగ్గరనుండి డిశ్చార్జ్ అయ్యే వరకు అతనికి ఎదురైన అనుభవాలను ఈ యాప్‌లో పొందుపరచవచ్చు. డాక్టర్స్ ఎన్ని సార్లు చూడడానికి వచ్చారు, వారు ఏ విందంగా చికిత్స అందించారు, హాస్పిటల్‌లో పరిశుభ్రత ఎలా ఉంది, అనే వివరాలు ఈ యాప్‌లో నమోదు చేస్తే ఆసుపత్రిని నడిపేవారికి నేరుగా ఆ వివరాలు అందుతాయని చెప్పారు. టాంపరింగ్‌కి అవకాశం లేకుండా దీనిని తయారు చేశామని నిర్వాహకులు చెబుతున్నారని, దీని ద్వారా గణనీయమైన మార్పు తీసుకువస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ విధానాన్ని పైలెట్‌గా ప్రారంభించి ఫలితాలు సమీక్షించుకుని అన్ని ఆసుపత్రులకు అనుసంధానం చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

Minister Etela Rajender fires on Gandhi Hospital Incidents

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News