Monday, May 6, 2024

ఫికర్ వద్దు

- Advertisement -
- Advertisement -

Minister Etela Rajender Press Meet on Coronavirus

న్ని కోట్ల రూపాయలైనా సరే కొనుగోలుకు సిఎం ఆదేశం
ఆక్సిజన్ తరలింపునకు యుద్ధ విమానాలను
ఉపయోగించిన తొలి రాష్ట్రం తెలంగాణ
మరో 3వేలకు పైగా ఆక్సిజన్ బెడ్లు సమకూర్చుతున్నాం
వ్యాక్సిన్లు రాష్ట్రాలే కొనుక్కోవాలనడం సంకుచిత ధోరణి
కరోనా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ
ప్రైవేటు ఆసుపత్రులు కొవిడ్ చికిత్సలను వ్యాపార కోణంలో
చూడొద్దు, మృతదేహాలనూ ఇవ్వకపోవడం సరైందికాదు
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత రానివ్వమని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ సూచనతో ఆక్సిజన్ నిల్వతో పాటు వైద్య సిబ్బంది, హోమ్ ఐసోలేషన్ కిట్లు, మందులు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. దీంతో పాటు పేషెంట్లకు ఇబ్బందులు తలెత్తకుండా ఆరు లక్షల రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లకు ఆర్డర్ పెట్టినట్లు తెలిపారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో ఆక్సిజన్ లేక చాలా మంది చనిపోతున్నారనే వార్తలు రావడంతో ఆక్సిజన్ సమకూర్చడం కోసం టాంక్ లను యుద్ద విమానంలో పంపించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కొనియాడారు. దాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని ఆసుపత్రులకు సమానంగా అందిస్తున్నామన్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వ ఆసుపత్రులలో, అతిపెద్ద ప్రైవేటు ఆసుపత్రులలో, మెడికల్ కాలేజీ కి అనుబందంగా ఉన్న ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత లేదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో 270 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటే కేంద్రం 400 మెట్రిక్ టన్నులను కేటాయించిందన్నారు. ఎక్కువ దూరంలో ఉన్న ఒరిస్సా నుంచి కాకుండా బళ్లారి నుంచి ఆక్సిజన్ ను అందించాలని కేంద్ర మంత్రికి లేఖ రాయడంతో ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అయితే జిల్లాలోని కొన్ని ఆసుపత్రులు ఆక్సిజన్ సరఫరా చేసే వారితో కుదుర్చుకున్న ఒప్పందంలోని సమస్యల వలనే ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందన్నారు. వాటిని కూడా ఐఏఎస్ అధికారుల బృందం పరిష్కరించి అన్ని ఆసుపత్రులకు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే కరోనా వచ్చిన మొదట్లో కేవలం 1770 ఆక్సిజన్ పడకలు మాత్రమే అందుబాటులో ఉండేవని, కానీ ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన పదివేల పడకలకి ఆక్సిజన్ లైన్లను ఏర్పాటు చేసుకున్నామన్నారు.

కానీ ప్రస్తుతం వెంటిలేటర్స్, ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో లేవనే వార్తలు వినిపిస్తున్నాయని, ఈక్రమంలో మరో 3010 ఆక్సిజన్ బెడ్లనూ సమకూర్చుతున్నట్లు ఆయన వివరించారు. అంతేగాక ఈ రోజు నుంచి ఇఎస్‌ఐ ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలతో ,పూర్తి స్థాయి సిబ్బందితో 350 పడకలను అందుబాటులోకి తేనున్నామన్నారు. వీటిలో ఐసియూ, వెంటిలేటర్లు కూడా ఉన్నాయన్నారు. వీటితోపాటు నిమ్స్ ఆసుపత్రిలో మరో రెండు వందల అక్సిజన్ పడకలను కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. అంతేగాక మరో వెయ్యి పడకలకు అవసరం అయ్యే సి కాప్, బి కాప్, మానిటర్స్, వెంటిలేటర్లను సిఎం అనుమతితో సమకూర్చుకుంటున్నామన్నారు. అయితే కరోనా సోకి ఇంట్లో అవకాశం లేని వారికి ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లలో ఉంచుతున్నామన్నారు. వీటితో పాటుగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఆక్సిజన్ సాధారణ స్థాయికి వచ్చిన తర్వాత స్టెఫ్‌డౌన్ కోసం ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లలో ఉంచేందుకూ సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఈ మేరకు ఇప్పటికే సిఎం ఆదేశాల మేరకు 755 మంది డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిని నియామకానికి అనుమతులు ఇచ్చామన్నారు. వీటితోపాటుగా ఆసుపత్రుల వారిగా ఎక్కడ అవసరముంటే అక్కడే నియామకాలు చేసుకునేందుకు కలెక్టర్లకూ ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మంత్రి అన్నారు. అంతేగాక కరోనా సమయంలో రాష్ట్రంలో తలెత్తుతున్నఅనేక సమస్యలను పరిష్కరించడానికి సిఎస్ ఆధ్వర్యంలో ఐఏఎస్ అధికారుల బృందాలను ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తామని మంత్రి ఈటల హామీ ఇచ్చారు. కరోనా పరిస్థితులపై ఆయన మంగళవారం బిఆర్‌కే భవన్‌లో కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి, కాళోజీ వైద్య విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి, వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ..మహారాష్ట్రలో, కర్ణాటకలో కేసులు పెరుగుతున్న సందర్భంలో సిఎం కెసిఆర్ వైద్యారోగ్యశాఖను అప్రమత్తం చేశారన్నారు. ఈమేరకు అన్ని విభాగాల అధికారులతో సమావేశమవుతున్నామన్నారు.
లిక్విడ్ ఆక్సిజన్ ఆదుకుంటుంది…
రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు జాగ్రత్తతో 22 ఆసుపత్రుల్లో 20 కెఎల్ లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్లను ఏర్పాటు చేసుకోవడం వలనే ప్రస్తుతానికి ఆక్సిజన్ సమస్య రాకుండా అధిగమించామని మంత్రి ఈటల అన్నారు. పిఎం కేర్ ద్వారా 5 ఆక్సిజన్ జనరేటర్ మిషన్లు ఏర్పాటు చేయడానికి కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. దీనిలో భాగంగా గాంధీ ఆస్పత్రిలో రోజుకు 28 లక్షల లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ఆక్సిజన్ జనరేటర్ ను ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. అదే విధంగా టిమ్స్ ఆసుపత్రిలో 14 లక్షల లీటర్లు, ఖమ్మం ఆస్పత్రిలో ఎనిమిదిన్నర లక్షల, భద్రాచలం ఆసుపత్రిలో నాలుగున్నర లక్షలు, కరీంనగర్లో రోజుకి ఐదున్నర లక్షల లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం గల ఆక్సిజన్ జనరేటర్స్‌నూ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కేంద్రాల ద్వారా ప్రతి రోజూ సుమారు 62 లక్షల లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసుకోగలమన్నారు. వాటిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ఆక్సిజన్ సమస్యలు కూడా అధిగమించగలమన్నారు. దీంతో పాటు మరో 12 మిషన్లు కావాలని కేంద్రానికి విన్నవించామన్నారు. అవి కూడా అతి త్వరలోనే వస్తాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ జీ.వోనూ పాటించాలి..
ఇప్పటికే ప్రభుత్వం అనేక జీవోల ద్వారా కరోనా పేషంట్లకు ఎంత చార్జి చేయాలి నిర్ధారణ చేశామని, దాన్ని కచ్చితంగా పాటించాల్సిందేనని మంత్రి ఈటల అన్నారు. కరోనా ట్రీట్మెంట్‌కు సాధారణ పడకలకు అయితే రూ.4 వేలు, ఐసియూలో ఉండి వెంటిలేటర్ లేకపోతే రూ.7500, ఐసియులో ఉండి వెంటిలేటర్ అవసరమైతే తొమ్మిది వేల రూపాయలు తీసుకోవచ్చని సూచించామన్నారు. ప్రస్తుతం ఈ ధరలను తప్పనిసరిగా అమలు చేయాలని ప్రైవేట్ ఆసుపత్రులను కోరారు. అంతేగాక ఆక్సిజన్ సిలిండర్లు,ఇంజక్షన్లు తెచ్చుకోవాలని పేషెంట్లను ఒత్తిడి చేయొద్దన్నారు. హాస్పిటల్లో చేర్చుకోవాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేయాలని, ఇన్సూరెన్స్ కార్డులు, హెల్త్ కార్డులు ఉన్నా తీసుకోకపోవడం కరెక్ట్ కాదని మంత్రి హెచ్చరించారు. అంతేగాక చనిపోయిన తర్వాత కూడా డెడ్ బాడీ ఇవ్వకుండా డబ్బులు కట్టాలి అని డిమాండ్ చేయడం సభ్యసమాజం హర్షించే విషయం కాదని మంత్రి గుర్తుచేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులు వ్యాపార కోణంలో చూడొదన్నారు.ప్రైవేట్ ఆసుపత్రిలో సైతం ఆక్సిజన్ కొరత ఏర్పడితే ప్రభుత్వం ముందుకు వచ్చి సరఫరా చేస్తున్న విషయం మరచిపోవద్దని, ఇదే విధంగా ప్రభుత్వానికి కూడా సహకరించాలని ఆయన కోరారు.
రాష్ట్రాలే వ్యాక్సిన్లు కొనుక్కోమని చెప్పడం సంకుచిత ధోరణి…
కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం రూ 35 వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టిందని మంత్రి ఈటల గుర్తుచేశారు. అయితే కేంద్రమైన రాష్ట్రమైనా ఖర్చు పెట్టేది ప్రజల సొమ్ము అనేది మర్చిపోవద్దని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు రాష్ట్రాలే వ్యాక్సిన్లు కొనుక్కోమని చెప్పడం కేంద్ర ప్రభుత్వ సంకుచిత ధోరణికి నిదర్శనం అని మంత్రి అన్నారు. ప్రతి రూపాయ పన్ను ద్వారనే వచ్చిందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. కేంద్రం అత్యంత శక్తివంతమైనది, వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వమే సమకూర్చి రాష్ట్రాలకు అందజేయాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. మరోవైపు 18 సంవత్సరాలు పైబడిన వారందరూ వ్యాక్సిన్ కొనుక్కోవాలి అని చెప్పడం బాధాకరమన్నారు. ఈ నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న మెడిసిన్ ఇతర దేశాలకు తరలిపోయిందని, ఇంకా పంపిస్తే చరిత్ర క్షమించదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
365 ప్లాన్‌తోనే….
కరోనా నియంత్రణకు 365 పకడ్బందీ నిర్ణయాలతోనే ఇతర రాష్ట్రాలతో పోల్చితే మనం కాస్త బెటర్‌గా ఉన్నామని మంత్రి అన్నారు. ఏడాది పాటు కంటి మీద కునుకు లేకుండా పనిచేయడం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఇ స్థాయిలో ఉందన్నారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఎంతో ఒత్తిడిలో పనిచేస్తున్నారని, కరోనా సోకిన కూడా తిరిగి విధుల్లోకి చేరి ప్రజలకు సేవ అందిస్తున్నట్లు ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలా నిబద్ధతో పనిచేస్తున్న వారిలో ఆత్మవిశ్వాసం దెబ్బతినే విధంగా ఎవరు మాట్లాడినా మంచిది కాదని ఆయన హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News