Sunday, April 28, 2024

ప్రజా ప్రతినిధులతో మంత్రి హరీశ్ రావు సమావేశం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రి నూతన నిర్మాణానికి ప్రజాప్రతినిధులు ఏకగ్రీవ అభిప్రాయం తెలిపారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన నిర్మాణ అంశంపై సోమవారం ఆస్పత్రి పరిధిలోని ప్రజా ప్రతినిధులతో మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రజల వైద్య అవసరాల కోసం పాత భవనాలు తొలగించి అయినా నిర్మాణాలు చేపట్టాలని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిశీలించి, అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు తెలియజేస్తుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. హైకోర్టు నుండి అనుమతి వచ్చిన వెంటనే నూతన భవన నిర్మాణం చేపడతామని మంత్రి వెల్లడించారు.

ప్రజల భవిష్యత్ అవసరాలు తీర్చేందుకు సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇప్పటికే నాలుగు టిమ్స్, నిమ్స్ విస్తరణ, సూపర్ స్పెషాలిటీ ఎంసిహెచ్‌ల నిర్మాణం చేపట్టిందని మంత్రి ఈ సందర్బంగా చెప్పారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం నిర్మించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని స్పష్టం చేశారు. సిఎం కెసిఆర్ 2015లోనే ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించి, కొత్త భవన నిర్మాణానికి ఆదేశించినట్లు గుర్తు చేశారు. తదనంతరం నిర్మాణం కూల్చవద్దని కొందరు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు నియమించిన ఐఐటి హైదరాబాద్ నిపుణుల కమిటీ కూడా ఆస్పత్రి అవసరాలకు ఈ భవనం పని చేయదని చెప్పిందని వివరించారు. తదుపరి కోర్టు ఆదేశాల ప్రకారం ఆస్పత్రి పరిధిలోని ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు తీసుకున్నామని తెలిపారు.

కొత్త భవనం నిర్మాణానికి ప్రజాప్రతినిధులు అందరూ ఏకగ్రీవంగా అంగీకరించడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. హైకోర్టు తుది తీర్పు మేరకు త్వరలోనే కొత్త నిర్మాణం చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో హోం మంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంఎల్‌సిలు ప్రభాకర్ రావు, వాణీ దేవి, రహమత్ బెగ్, హసన్ ఎఫెండి, ఎంఎల్‌ఎలు అక్బరుద్దీన్ ఒవైసి, దానం నాగేందర్, గోపీనాథ్, జాఫర్ హుస్సేన్, కౌసర్ మోయినుద్దీన్, హెల్త్ సెక్రెటరీ రిజ్వి, సిఎం ఒఎస్‌డి గంగాధర్, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఇఎన్‌సి గణపతి రెడ్డి, ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Harish Rao 2

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News