Monday, April 29, 2024

టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు

- Advertisement -
- Advertisement -

బాసర: సాంకేతికయుగంలో అవకాశాలకు కొదువలేదని ఐటి, పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. విద్యార్థులు సృజనతో ఎదిగేందుకు కృషిచేయాలని సూచించారు. బాసర ఆర్జియూకెటిలో శనివారం జరిగిన 5వ స్నాతకోత్సవ వేడుకల్లో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిలతో కలిసి కెటిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేసి మాట్లాడుతూ ప్రపంచంతో పోటీపడగలిగే సత్తా సంతరించుకోగలిగితే ఆపగలిగేవారు ఉండరన్నారు. కంప్యూటర్లే మానవ మేథస్సును అధ్యయనం చేస్తున్నాయన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మిషన్ లెర్నింగ్ కీలక పాత్రపోషిస్తున్నాయన్నారు. పుస్తకాల్లో చదువుకున్న చదువుకు ప్రయోగాత్మక విద్య తోడైతే సరైన ఫలితాలు దక్కుతాయన్నారు.

విద్యాలయాలను పరిశ్రమలతో అనుసంధానించాలని సూచించారు. వర్సిటీలు డిజైనింగ్ కోర్సులకు రూపకల్పన చేయాలన్నారు. ఉన్నత విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థలను మరింత మెరుగ్గాతీర్చిదిద్దాలని సిఎం కెసిఆర్ ఆదేశించారని పేర్కొన్నారు. ఆర్జీయూకెటిలో 2,200మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తున్నామన్నారు. పి1, పి2లో 1500 మంది విద్యార్థుకు డెస్క్‌టాప్‌లు అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ముఖ్యమని, టి హబ్‌తో ట్రిపుల్ ఐటి ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించారు. దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ శాటిలైట్ పంపింది హైదరాబాద్ టి హబ్ కంపెనీయేనని గుర్తుచేశారు. పది మందికి ఉపాధి కల్పించేస్థాయికి మనం ఎదగాలన్నారు. ఔత్సాహికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

తెలంగాణ విద్యాసంస్థలతో ప్రపంచస్థాయి సంస్థలు ఒప్పందం కుదుర్చుకుంటున్నాయని, అమెజాన్ లాంటి కంపెనీలు మన పిల్లలకు అత్యధిక జీతాలు ఇస్తున్నాయని గుర్తు చేశారు. విదేశీ విద్య కోసం రూ.20 లక్షలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కెటిఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు లాప్ టాప్‌లు, యూనిఫాంలు అందజేశారు. 2013 నుంచి 2016 వరకు ప్రతిభ కనబరిచిన 38మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, 570 మంది విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేశారు. వర్సిటిలో సైన్స్ బ్లాక్ ఏర్పాటుకు రూ.5కోట్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. అదేవిధంగా 10పడకల ఆసుపత్రి ఏర్పాటుకు సైతం సిఎం ఆదేశాలిచ్చారని చెప్పారు. ట్రిపుల్ ఐటిలో ఉన్న చెరువును సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. మిషన్ భగీరథ ద్వారా రక్షిత మంచినీళ్లు క్యాంపస్‌కు వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఆర్జియూకెటిలో టి -హబ్ ఏర్పాటకు మంత్రులు సబితారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో టి -హబ్ ప్రతినిధులు, వర్సిటీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, వైస్ ఛాన్సలర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ కుమార్, కలెక్టర్ ముషారప్ అలీ పారుఖి, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కాడే, వర్సిటి అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు ట్రిపుల్ ఐటికి వచ్చిన మంత్రులకు వర్సిటీ విసి వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ కుమార్, అధ్యాపకులు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News