Saturday, April 27, 2024

మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పింది: హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మోటార్లకు మీటర్లు అంశంపై శాసనసభలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య అసెంబ్లీలో వివాదం చోటుచేసుకుంది. మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పిందని హరీశ్‌రావు అంటే విద్యుత్ బిల్లులు కట్టమని కేంద్రం ఎక్కడా చెప్పలేదని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పిందని ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొనగా, హరీష్‌రావు మాటలపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాము అప్పులు తీసుకోవాలనుకుంటే విద్యుత్ సవరణల విషయంలో కేంద్ర ప్రభుత్వం 0.5 శాతం ఎఫ్‌ఆర్‌బిఎంలో వెసులుబాటు కల్పిస్తామని చెప్పిందని హరీష్‌రావు పేర్కొన్నారు. నిజంగా తమకు రాష్ట్ర ప్రయోజనాల కంటే అప్పులే ముఖ్యమని అనుకుంటే రూ.35 వేల కోట్లు అదనంగా వచ్చేవని హరీష్‌రావు పేర్కొన్నారు.

నాటి కేంద్ర ప్రభుత్వం షరతుల్లో బోరుబావుల దగ్గర మీటర్లు పెట్టించి, కరెంట్ బిల్లులు వసూలు చేయాలని నిర్ణయిస్తే కెసిఆర్ వ్యతిరేకించారని, ఈ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బిఎం నిధులను తీసుకోవద్దని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎఫ్‌ఆర్‌బిఎం నిధుల కోసం మోటార్లకు మీటర్లు పెట్టేందుకు అంగీకరించవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నానని ఎమ్మెల్యే హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. మీటర్లు పెడితే కేంద్రం నుంచి రూ.35 వేల కోట్లు వచ్చేవని ఎమ్మెల్యే హరీశ్‌రావు చెప్పారు. 70 లక్షల మంది రైతుల క్షేమం కోసం మాత్రమే తాము మీటర్లకు అంగీకరించలేదని ఆయన స్పష్టం చేశారు.

బిల్లులపై అవాస్తవాలు ప్రస్తావించొద్దు: ఉత్తమ్‌కుమార్
అనంతరం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హరీశ్‌రావు చెప్పేవన్నీ అవాస్తవాలేనని ఆయన మండిపడ్డారు.రైతులకు, వ్యవసాయానికి కరెంట్ బిల్లులు కట్టమని ఏ చట్టం, కేంద్ర ప్రభుత్వం చెప్పలేదన్నారు. గతంలో మీ ముఖ్యమంత్రి ఇదే విషయంలో అబద్ధం మాట్లాడారని, ఇప్పుడు మీరు కూడా అదే అబద్ధం మాట్లాడుతున్నారని, తాను అప్పుడు ఆ పార్లమెంటు కమిటీ సభ్యుడిగా ఉన్నానని – ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బిల్లులపై పదేపదే శాసనసభలో అవాస్తవాలు ప్రస్తావించొద్దని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News