Monday, April 29, 2024

సంపాదకీయం: కర్నాటక సభాపర్వం

- Advertisement -
- Advertisement -

Question is when will corona vaccine come

కోవిడ్ కారణం చూపి కేంద్రం పార్లమెంటు శీతాకాల సమావేశాలను రద్దు చేయడం, కర్నాటక శాసన మండలిలో అధ్యక్ష పీఠం కేంద్రంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల బాహాబాహీ కుర్చీలోంచి ఉపాధ్యక్షుడిని బలవంతంగా బయటకు లాగేసిన పరిణామాలు ఒకే రోజున జరిగిపోయాయి. ఈ రెండూ పార్లమెంటరీ సత్సంప్రదాయాల పట్ల మితిమించుతున్న ఉపేక్షను చాటుతున్నాయి. చట్టసభల సవ్యమైన నిర్వహణ ద్వారా, కూలంకషమైన చర్చ, మథనం ద్వారా విచక్షణాయుతంగా, వివేచనతో బిల్లులను ఆమోదింప చేసుకునే ప్రజాస్వామిక విధి విధానానికి స్వస్తి చెప్పాలనే దురుద్దేశం వల్లనే ఇటువంటి పరిణామాలు సంభవిస్తున్నాయని భావించక తప్పదు. గత సెప్టెంబర్‌లో జరిగిన పార్లమెంటు సమావేశాలలో కరోనా కారణం చూపి ప్రశ్నోత్తరాల సమయాన్ని పూర్తిగా రద్దు చేశారు. సభ సమావేశం కాగానే తొలి రెండు గంటల సేపు సభ్యులడిగే ప్రశ్నలకు ప్రభుత్వం తరపున మంత్రులు సమాధానం చెప్పే ఈ కీలక ఘట్టం ప్రజలకు ప్రభుత్వ జవాబుదారీతనాన్ని రూపు కట్టించి ప్రజాస్వామ్య మౌలిక అవసరాన్ని నెరవేరుస్తుంది. గతంలో భారత, చైనా (1962) యుద్ధ సమయంలో, ఎమెర్జెన్సీలో మాత్రం తెరమరుగైన ప్రశ్నోత్తరాల సమయం పార్లమెంటు గత సమావేశాల్లో కరోనా సాకు మీద రద్దు కావడంపై తీవ్ర విమర్శలు వినవచ్చాయి. ఇప్పుడు శీతాకాల సమావేశాలనే పూర్తిగా రద్దు చేశారు.

రైతుల సుదీర్ఘ ఢిల్లీ ముట్టడి ఆందోళన సృష్టించిన అసాధారణ వాతావరణంలో, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల గుత్తాధిపత్యానికి అప్పగించదలచారనే అభిప్రాయం గాఢంగా నాటుకున్న పరిస్థితుల్లో అత్యంత వివాదాస్పదంగా పరిణమించిన వ్యవసాయ చట్టాలపై లోతైన చర్చకు శీతాకాల సమావేశాలు అవకాశమిచ్చి ఉండేవి. ప్రభుత్వం కూడా తన వాదనను దేశ ప్రజలకు క్షుణ్ణంగా వినిపించుకునేందుకు వీలు కలిగేది. ఈ చట్టాలను పార్లమెంటు గత సమావేశాలలో ఆదరాబాదరాగా దాదాపు దొడ్డి దారిలో ఆమోదింప చేయించుకున్నప్పుడు ఈ చర్చకు అవకాశం కలగలేదు. ఇప్పుడైనా అది జరిగి ఉంటే ప్రజాస్వామ్యయుతంగా ఉండేది. అందుకు సందులేకుండా చేయడం కోసమే శీతాకాల సమావేశాలను ప్రధాని మోడీ ప్రభుత్వం రద్దు చేయించిందనే విమర్శను తప్పుపట్టలేం. కర్నాటక శాసన మండలిలో మంగళవారం నాడు సంభవించిన సన్నివేశం అత్యంత బాధాకరమైనది.

చట్టసభలో తగిన బలం లేని పాలక పక్షాలు ఎలాగోలా బిల్లులను ఆమోదింప చేసుకోడానికి చేసే కుటిల యత్నాల వల్లనే సభలు తరచూ రసాభాసకు గురై ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నది. కర్నాటక శాసన మండలిలో అదే జరిగింది. ఆ సభలో మొత్తం 75 మంది సభ్యులుండగా పాలక భారతీయ జనతా పార్టీకి 31 మంది, కాంగ్రెస్‌కు 29 మంది, జెడి(ఎస్)కు 14 మంది, ఒక ఇండిపెండెంటు ఉన్నారు. సగానికి మించిన బలం ఉంటేగాని బిల్లును ఆమోదింప చేసుకోడం పాలక పక్షానికి సాధ్యం కాదు. ఈ నెల 9న అసెంబ్లీ ఆమోదం పొందిన గోవధ నిషేధం బిల్లు శాసనం కావాలంటే శాసన మండలి దానిని ఆమోదించి తీరాలి. యడ్డియూరప్ప సారథ్యంలోని బిజెపి ప్రభుత్వం జెడి(ఎస్) సహకారంతో ఆ పనిని జరిపించుకోదలచడంతో కాంగ్రెస్ అప్రమత్తత వహించింది.

మంగళవారం నాడు మండలి సమావేశం కాగానే సభలో ఉన్న జెడి(ఎస్)కు చెందిన ఉపాధ్యక్షుడు ధర్మేగౌడను బిజెపివారు అధ్యక్ష స్థానంలో కూచోబెట్టారు. అందుకు కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అంతేకాకుండా ఉపాధ్యక్షున్ని బలవంతంగా సీట్లోంచి బయటకు లాగి తమ పార్టీకి చెందిన చైర్మన్ ప్రతాప్ శెట్టిని అందులో కూచోబెట్టారు. జెడి(ఎస్)తో తమకు పొత్తు కుదిరి కాంగ్రెస్ ఒంటరిదై పోయిన తర్వాత ప్రతాప్ శెట్టి తప్పుకొని ఉండవలసిందని తనపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని కూడా ఆయన అనుమ తించడం లేదని బిజెపి సభ్యులు చెబుతున్నారు. అందుచేత ఆయనకు సభలో అధ్యక్షత వహించే అర్హత లేదన్నారు. ఈ క్రమంలో బిజెపి, కాంగ్రెస్ సభ్యుల మధ్య తోపులాట, తొక్కిసలాట, బాహాబాహీ సంభవించాయి. దానితో చైర్మన్ ప్రతాప్ శెట్టి సభను వాయిదా వేశారు. అదేమైనప్పటికీ ఆయన ఆ పదవిలో ఉన్నంత కాలం సభాధ్యక్ష స్థానంలో డిప్యూటీ చైర్మన్‌ను కూచోపెట్టి కథ నడిపించుకోవాలనుకోడం బిజెపి పన్నిన తప్పుడు వ్యూహంగానే పరిగణించాలి.

ఇటువంటి అప్రజాస్వామిక పథకాల వల్లనే పెద్దల సభలు పరువు కోల్పోతున్నాయి. వ్యవసాయ బిల్లులపై ఓటింగ్ జరిగి తీరాలని ప్రతిపక్షాలు పట్టుపట్టినా వినిపించుకోకుండా అప్పుడు రాజ్యసభలో మూజువాణీ ఓటు మీద బిల్లులను ఆమోదింప చేయడం కూడా రభసకు దారి తీసింది. పాలక ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య బాధ్యతను పక్కన పెట్టినప్పుడు ఇటువంటి సన్నివేశాలే చోటు చేసుకుంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News