Monday, April 29, 2024

కార్పొరేట్లకు ఎందుకీ వత్తాసు?

- Advertisement -
- Advertisement -

Modi support to ambani adani

మాకు మీరు చెబుతున్న దాని మీద విశ్వాసం లేదు మహాప్రభో అని రైతాంగం గత 20 రోజులుగా రాజధాని ఢిల్లీ శివార్లలో తిష్ఠవేసి ఒక వైపు నిరసన తెలుపుతున్నది. మరోవైపు గత ఆరు సంవత్సరాలుగా భారత్ మీద ప్రపంచం చూపుతున్న విశ్వాసం గత కొద్ది నెలలుగా మరింతగా పెరిగింది నా ఏలుబడిని చూడండో అని ప్రధాని నరేంద్ర మోడీ తన గొప్ప గురించి చెప్పుకున్నారు. అదీ ఎక్కడా! వాణిజ్య, పారిశ్రామికవేత్తల ప్రతినిధుల ఫిక్కీ సమావేశంలో మోడీ చెప్పారు. చర్చల పేరుతో కేంద్ర ప్రభుత్వం వేస్తున్న పిల్లిమొగ్గలను రైతులు పట్టించుకోవటం లేదు. బిజెపి చెప్పినట్లుగా రైతుల ఆదాయాలు రెట్టింపు అవలేదు, అయ్యే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించటంలేదు. మాంద్యం లేదా కరోనా మహమ్మారి వచ్చినా మోడీ ఏలుబడిలో కార్పొరేట్ల లాభాలు పెరుగుతాయే తప్ప తగ్గవని తేలిపోయింది. అందుకే బిజెపి ఆదాయం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరుగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు అందచేసిన వివరాల ప్రకారం 2018లో రూ.1,027.37 కోట్లున్న బిజెపి ఆదాయం 2019 నాటికి రూ.2,410.08 (134.59శాతం)కు పెరిగింది. అనధికారికంగా వచ్చే ఆదాయం గురించి చెప్పనవసరం లేదు. కార్పొరేట్ కంపెనీలు, ఇతర వ్యాపార సంస్ధలు ఇచ్చిన ఇంత డబ్బు ఉంది కనుకనే రైతులకు వ్యతిరేకంగా దేశ వ్యాపితంగా 700 జిల్లాల్లో సభలు, ప్రచారం, 700 పత్రికా సమావేశాలు పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు చెప్పిన అసత్యాలు, అర్ధసత్యాలను జనం మెదళ్లకు ఎక్కించే ప్రయత్నమే ఇది.

పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా ఎంత ఎక్కువగా చెబితే అంతగా జనం వాస్తవాలు తెలుసుకుంటారు. మీడియాలో బిజెపికి ఇచ్చినంత గాకపోయినా ఎంతో కొంత చోటు ఇవ్వక తప్పదు కదా!
రైతాంగ ఆందోళన అనేక అంశాలను ముందుకు తెస్తోంది. రాజకీయ పార్టీలు, మేధావులు, మీడియా ఎవరి అసలు రంగు ఏమిటో బయటపెడుతోంది. తొలి రోజుల్లో విస్మరించినా ప్రధాన స్రవంతి మీడియా రైతుల ఆందోళన వార్తలను అరకొరగా అయినా ఇవ్వకతప్పటం లేదు. సెప్టెంబరు నెలలో పార్లమెంట్‌లో అప్రజాస్వాకంగా ఆమోదించిన వివాదాస్పద చట్ట సవరణల మీద ముందుకు తెస్తున్న కొన్నివాదనల తీరుతెన్నులను చూద్దాం. వాటిలో ప్రధానమైనది వ్యవసాయ చట్టాలకు కనీస మద్దతు ధరలకు సంబంధం లేదు ! దేశంలోని మిగతా రాష్ట్రాలకూ కశ్మీరుకు ఉన్న ఆర్టికల్ 370కి సంబంధం లేదు. అయినా సంబంధం అంటగట్టి దాన్ని రద్దు చేసేంత వరకు నిదురపోలేదు.

దేశం మొత్తానికి వర్తించే కనీస మద్దతు ధరలకూ వ్యవసాయ చట్టాలకు ఇప్పటి వరకు సంబంధం లేదు నిజమే! సంబంధం కలపమని, తమకు భరోసా కల్పించమనే కదా రైతులు కోరుతోంది. ఎందుకు నిరాకరిస్తున్నారో చెప్పమంటే సమాధానం చెప్పకుండా అడ్డగోలు వాదనలు ముందుకు తెస్తున్నారు? మూడు చట్ట సవరణలను పూర్తిగా వెనక్కు తీసుకోవాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. తాజా ఆందోళనతో నిమిత్తం లేకుండానే గత కొన్ని సంవత్సరాలుగా కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్ ముందుకు వచ్చిందా లేదా? ఎన్నడూ లేని విధంగా రైతాంగానికి ఇప్పుడు బిజెపి మీద అనుమానాలు ఎందుకు బలపడ్డాయి? సంస్కరణల పేరుతో అన్ని వ్యవస్థలకు తిలోదకాలు ఇచ్చేందుకు, బాధ్యతల నుంచి తప్పుకొనేందుకు, లాభాలు వస్తున్న ఎల్‌ఐసి, చమురు సంస్ధలను కూడా ప్రైవేటు పరం చేసేందుకు మోడీసర్కార్ కుంటిసాకులు చెబుతున్నది.

కనీస మద్దతు ధరలు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ వ్యవస్థలను ప్రభావితం చేసే మూడు చట్టాలలో ఎక్కడా కనీసం మద్దతు ధరల ప్రస్తావన లేదు. కనుకనే రైతాంగం కనీస మద్దతు ధరలను చట్టబద్ధ్దం చేయమంటోంది. గతంలో కూడా రైతు సంఘాలు ఈ డిమాండ్‌ను ముందుకుతెచ్చాయి. చట్టాలకు ఎంఎస్‌పికి సంబం ధం లేదని చెబుతున్న బిజెపి పెద్దలు గతాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటారా లేక దొంగ నిద్ర నటిస్తారా? 2011లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ముఖ్యమంత్రుల కమిటీ కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని ఆషామాషీగా కేంద్రానికి సిఫార్సు చేసిందా? ఈ కమిటీలో నాటి మహారాష్ర్ట, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ముఖ్యమంత్రులు ఇతర సభ్యులు. సిఎంగా ఉన్న మోడీ చేసిన సిఫార్సు ను పిఎం మోడీ ఎందుకు పక్కన పడేస్తున్నారు? బిజెపి నేతలు అసలు ఆ ప్రస్తావనే ఎందుకు తేవటంలేదు. నాడు ఎందుకు సిఫా ర్సు చేసినట్లు ఇప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నట్లు? మా దారే వేరు అని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీకి ఇతరులకు తేడా ఏముంది?

వ్యవసాయ చట్టాలకు, కనీస మద్దతు ధరలకు సంబంధం ఉందా లేదా అన్నది అసలు చర్చే కాదు, సంబంధం కల్పించాలని రైతులు అడుగుతున్నారు. గతంలో కూడా లేదుగా అని బిజెపి అంటోంది. నిజమే, గతంలో లేని వాటిని మోడీ సర్కార్ అనేకం తెచ్చిందిగా దీన్నెందుకు తీసుకురాదు. తెస్తేవారికి పోయేదేముంది? రైతులు శాశ్వతంగా మద్దతుదారులుగా మారతారు కదా! ఇంతకీ 2011 నివేదికలో మోడీ కమిటీ చేసిన సిఫార్సు ఏమిటి? నివేదికలోని క్లాజ్ బి.3లో ఇలా ఉంది.“చట్టబద్ధంగా ఎంఎస్‌పి అమలు: మార్కెట్ పని చేయటంలో మధ్యవర్తులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఆ సమయంలో వారు ముందుగానే రైతులతో ఒప్పందం చేసుకుంటున్నారు. అన్ని నిత్యావసర వస్తువులకు సంబంధించి చట్టబద్ధమైన అంశాలతో శాసనం ద్వారా రైతుల ప్రయోజనాలను కాపాడాలి. అదేమంటే రైతు వ్యాపారి లావాదేవీల్లో ఎక్కడా నిర్ణీత కనీస మద్దతు ధరలకు తగ్గకూడదు.”

దీని అర్ధం ఏమిటి? చట్టబద్ధత కల్పించాలనే కదా! అన్నింటికీ మించి సంబంధం లేదనటం పచ్చి అబద్ధం. వ్యవసాయ మార్కెట్ యార్డులలో జరిగే లావాదేవీలలో కనీస మద్దతు ధరలకంటే తక్కువకు కొనుగోలు చేయకూడదు. కొత్త చట్టం ఆ యార్డుల పరిధిని కుదించి దాని వెలుపల వ్యాపారులు ఎలాంటి పన్నులు, సెస్సులు చెల్లించకుండా కొనుగోళ్లు జరపవచ్చని చెప్పింది. ఏ ధరలకు కొనుగోలు చేయాలో చెప్పలేదు. కనీస మద్దతు ధరలు అమలు జరుగుతున్నాయా లేదా అని పర్యవేక్షించే యంత్రాంగం అక్కడ లేనపుడు ఏమి చేయాలో సవరించిన చట్టాల్లో ఎందుకు చెప్పలేదు? అంతేనా 2014 మే 26న నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయ్యారు. అంతకు ముందు ఏప్రిల్ 14న చేసిన ట్వీట్‌లో మన రైతులు సరైన ధర ఎందుకు పొందకూడదు, వారేమీ అడుక్కోవటంలేదు, కష్టపడుతున్నారు, మంచి ధర పొందాలంటూ దాని లో పేర్కొన్నారు. ఇప్పుడు కూడా రైతులు దేన్నీ దేబిరించటం లేదు.

కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఏమంటున్నారు? “నిజమేనయ్యా మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న కమిటీ చేసిన సిఫార్సు ప్రకారం ఎంఎస్‌పికి చట్టబద్ధత కల్పించాలని ప్రతిపక్షం కోరుతోంది. నేను వారిని అడుగుతున్నా మీరు చాలా సంవత్సరాలు పాలన సాగించారుగా ఎందుకు చేయలేదు” అని ప్రశ్నించారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది బిజెపి. గడ్డంలేని సమయంలో స్వయంగా మోడీ ఏ సిఫార్సు చేశారు. ఇప్పుడు గడ్డం పెంచటాన్ని చూసిన అనేక మంది మోడీలో పరిణతి, పెద్దరికం వచ్చింది అని చెబుతున్న తరుణంలో కాంగ్రెస్ ఐదు దశాబ్దాల్లో చేయని దాన్ని ఇప్పుడెందుకు చేయరు అంటే ఉన్న ఆటంకం ఏమిటో చెప్పకుండా గతంలో ఎందుకు చేయలేదని ఎదురు దాడి చేయటం ఏమిటి? కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఎంఎస్‌పికి వ్యవసాయ చట్టాలకు సంబంధం లేదనే పాటనే పాడారు. ఆమె మరొక అడుగు ముందుకు వేశారు.

చట్టసవరణలు చేయబోయే ముందు సంప్రదింపులు, చర్చలు ఎందుకు జరపలేదు అని అడిగితే ఈ అంశాల మీద 2000 సంవత్సరంలో వాజ్‌పేయి సర్కార్ హయాం నుంచీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి పొమ్మన్నారు. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధ్దత గురిం చి కూడా చర్చ ఉన్నది దాన్నెందుకు పట్టించుకోవటం లేదు? కిసాన్ ముక్తి బిల్లుల పేరుతో రుణభారం నుంచి విముక్తి కలిగించాలని, మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ 2018 జూలై, ఆగస్టు నెలల్లో పార్లమెంట్‌లో రెండు అనధికార బిల్లులను ప్రవేశపెట్టారు. ఆలిండియా కిసాన్ సంఘర్ష సమితిలో భాగస్వాములైన స్వాభిమాని షేత్కారి సంఘటన నేత, ఎంపి అయిన రాజు షెట్టి లోక్‌సభలో, ఆలిండియా కిసాన్‌సభ నేత, సిపిఎం ఎంపి అయిన కెకె రాగేష్ రాజ్యసభలో వాటిని ప్రవేశ పెట్టారు. వాటిని ప్రభుత్వం తిరస్కరించింది. స్వామినాధన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసినట్లు, ఉత్పాదక ఖర్చు మీద 50 శాతం అదనంగా కనీస మద్దతు ధరలు అమలు జరుపుతున్నట్లు బిజెపి ప్రచారం చేస్తున్నది. దీన్ని చూసి నేను చచ్చినా నా సిద్ధాంతం బతికి ఉన్నందుకు సంతోషంగా ఉందని అబద్ధాల జర్మన్ నాజీ మంత్రి గోబెల్స్ ఆత్మ సంతోషపడుతూ ప్రత్యేక అభిమానంతో మన దేశం చుట్టూ తిరుగుతూ ఉండి ఉండాలి ( ఆత్మ గురించి విశ్వాసం ఉన్నవారి మనోభావాల మేరకు).

2014 హర్యానా అసెంబ్లీ ఎన్నికల వరంగా స్వామినాధన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని బిజెపి చెప్పింది. అమిత్ షా భాషలో చెప్పాలంటే ఇదొక జుమ్లా (ఏదో అవసరానికి అనేకం చెబుతుంటాం). 2016 ఏప్రిల్ ఆరవ తేదీన కేంద్ర వ్యవసాయ శాఖ హర్యానాలోని పానిపట్ జిల్లా సమలఖాకు చెందిన పి.పి కపూర్ అనే సమాచార హక్కు కార్యకర్తకు ఇచ్చిన సమాధానం మోడీ ప్రభుత్వ నిజ స్వరూపాన్ని వెల్లడిస్తున్నది. సిఎసిపి మద్దతు ధరలను సూచించేందుకే పరిమితం తప్ప వాటి అమలు నిర్ణయం ప్రభుత్వానిదే. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం కనీస మద్దతు ధరకు విధిగా కొనుగోలు చేయాలని ప్రయివేటు రంగ వ్యాపారులను ఆదేశించే అవకాశం లేదు. కొంత మేరకు చెరకు విషయంలోనే ఏ రంగంలో ఉన్నవారైనా ఎఫ్‌ఆర్‌పి ధరలను అమలు జరపాల్సి ఉంది. దీన్నే ఇంతకు ముందు ఎస్‌ఎంపి అని పిలిచారు.2018 19లో సిఏసిపి తన ధరల విధాన నివేదికలో కనీస మద్దతు ధరలకు రైతులు అమ్ముకొనే హక్కును కల్పిస్తూ చట్టం చేయాలని ప్రతిపాదించింది. రైతుల్లో విశ్వాసం కల్పించేందుకు ఈ చర్య అవసరమని పేర్కొన్నది. అయితే దీన్ని కేంద్రం అంగీకరించలేదు. ఇప్పుడు విశ్వాస సమస్య మరింతగా ముందు కు వచ్చింది. రైతులు చేస్తున్న ఆందోళన ప్రభుత్వం మీద, పాలక వ్యవస్ధ మీద విశ్వాసరాహిత్యాన్ని సూచిస్తున్నది. 1966 67లో గోధుమలకు తొలిసారిగా మద్దతు ధర నిర్ణయం అధిక దిగుబడి వంగడాల సాగు, పెరిగిన ఉత్పత్తి మార్కెటింగ్‌పై రైతులకు విశ్వాసం కొల్పేందుకు ఉద్దేశించిందే అన్నది గమనించాలి.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News