Thursday, May 9, 2024

కేంద్రం సెస్సుల బండారం

- Advertisement -
- Advertisement -

Communal clashes during Ram Navami procession ప్రధాని నరేంద్ర మోడీ తన సహజ ధోరణిలో బొత్తిగా సందర్భోచితం కాని రీతిలో పెట్రోల్, డీజెల్ ధరల ప్రస్తావన తెచ్చి బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఇరకాటంలోపెట్టే ప్రయత్నం చేశారు. ఈ ఇంధనాలపై ఎక్సైజ్ సుంకాన్ని తాము తగ్గించగా, బిజెపి అధికారంలోలేని మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, జార్ఖండ్ రాష్ట్రాలు ఇప్పటికీ పన్ను తగ్గించలేదంటూ వాటిపై బురద చల్లారు. కొవిడ్ పరిణామాలపై చర్చించడానికి ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల వర్చువల్ సమావేశాన్ని ఇందుకు ఆయన ఉపయోగించుకున్నారు.

దేశాన్ని మరోసారి ప్రళయంలో ముంచెత్త గల కరోనా మహమ్మారిని ప్రతిఘటించడానికి ఏమి చేయాలో చర్చించుకోవా ల్సిన సందర్భాన్ని ప్రధాని స్వప్రయోజనకాండకు వాడుకున్నారు. పెట్రోల్, డీజెల్ పై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం గత ఏడాది నవంబర్‌లోనే తగ్గించిందని, అలాగే బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా వాటిపై అమ్మకపు పన్నులో కోత విధించాయని, నాన్ బిజెపి రాష్ట్రాల ప్రభుత్వాలే ఇంత వరకు ఎటువంటి మినహాయింపు ఇవ్వలేదని ప్రధాని వేలెత్తి చూపించారు. పై నుంచి చూసేవారికి ప్రధాని మోడీ వాదన సరైనదిగానూ, సహేతుకమైనదిగానూ కనిపిస్తుంది. కేంద్రం, బిజెపి పాలిత రాష్ట్రాలు అంత త్యాగం చేస్తే నాన్ బిజెపి రాష్ట్రాలు ఎందుకు ఆ పని చేయలేకపోయాయి అనే ప్రశ్న తలెత్తేటట్టు చేయడంలో ప్రధాని మోడీ కృతకృత్యులయ్యారు. దీనికి కొన్ని నాన్ బిజెపి రాష్ట్రాలు వెంటనే తగు రీతిలో సమాధానమిచ్చాయి.

కేంద్రం తమకు ఇవ్వాల్సిన మొత్తాలను పెద్ద ఎత్తున బకాయిపెడుతూ ఆర్థికంగా చేతిలో చిల్లిగవ్వలేని దుస్థితిని సృష్టించి తమపై బురద చల్లడంలోని అనౌచిత్యాన్ని ఈ రాష్ట్రాలు ఎండగట్టాయి. రాష్ట్రాలన్నింటికీ కలిపి వస్తు, సేవల పన్ను వాటా కింద కేంద్రం రూ. 78,704 కోట్లు బకాయిపడి వుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్వయంగా ప్రకటించింది. కేంద్రం తమ రాష్ట్రానికి రూ. 97 వేల కోట్లు రుణపడినట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. ఇందులో సగం మొత్తాన్ని చెల్లించినా పెట్రోల్, డీజెల్‌పై వసూలు చేస్తున్న పన్నును తగ్గించడానికి తాము వెనుకాడేవాళ్లం కాదని ఆమె అన్నారు. ఇప్పటికే ఏడాదికి రూ. 1500 కోట్లు భరించేలా పెట్రోల్, డీజెల్‌పై పన్నును తాము ఒక రూపాయి తగ్గించామని ఆమె వివరించారు. కేంద్రం నుంచి తమకు రూ. 26,500 కోట్లు రావాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే చెప్పారు. కేంద్రం వసూలు చేస్తున్న ప్రత్యక్ష పన్నుల రాబడిలో మహారాష్ట్ర నుంచి వెళుతున్నదే 38.3 శాతం కాగా, జిఎస్‌టి వసూళ్ల నుంచి తమకు వస్తున్నది 15 శాతమేనని ఆయన వివరించారు. ముంబైలో ప్రతి లీటర్ డీజెల్ మీద కేంద్రం వసూలు చేస్తున్న పన్ను రూ. 24.38 కాగా, రాష్ట్రం వసూలు చేస్తున్నది రూ. 22.37 మాత్రమేనని ఆయన వివరించారు.

అసలే ఆదాయ వనరులు పరిమితంగా వున్న రాష్ట్రాలను పన్ను తగ్గించుకోవాలని కేంద్రం అడగడం అన్యాయమని అందుకు బదులు కేంద్రం పెట్రోల్, డీజెల్ మీద సెస్‌ను వసూలు చేయడం మానుకోవాలని కేరళ అభిప్రాయపడింది. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇంత వరకు బకాయిపడిన మొత్తం రూ.31,105 కోట్లు. ప్రధాని మోడీ ప్రభుత్వం పన్నుల విషయంలో వహిస్తున్న కపట వైఖరి ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు. అది ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి పైసానూ రాష్ట్రాలతో పంచుకోవలసి వుండగా, అలా పంచుకోనవసరం లేకుండా నేరుగా తానే అనుభవించేలా సెస్‌ల రూపంలో ప్రజలను పిండి వసూలు చేసుకునే దొడ్డి దారిని తెరిచింది. బిజెపి పాలిత రాష్ట్రాలను సంతృప్తి పరుస్తూ నాన్ బిజెపి రాష్ట్రాలను ఎండగట్టి అక్కడి పాలక పక్షాలను ప్రజలకు శత్రువులుగా నిరూపించే దుష్ట పన్నాగాన్ని ప్రధాని మోడీ ప్రభుత్వం ఎంచుకున్నది.

ఈ విషయంపైనే పెట్రో ధరల సందర్భంగా బిజెపియేతర రాష్ట్రాల ప్రభుత్వాలు నేరుగా ప్రధాని మోడీని నిలదీశాయి. ఆయన అధికారంలోకి వచ్చిన గత ఎనిమిదేళ్లలో కేంద్రం పెట్రో, డీజెల్ పై వసూలు చేసిన ఎక్సైజ్ సుంకం కిమ్మత్తు రూ. 27 లక్షల కోట్లు. అదే సమయంలో ఈ ఇంధనాలపై రాష్ట్రాలు వసూలు చేసిన పన్ను కిమ్మత్తు రూ. 16.50 లక్షల కోట్లు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన సమయంలో క్రూడాయిల్ య మార్కెట్ ధర బ్యారెల్ 108 డాలర్లుగా వున్నప్పుడు దేశంలో పెట్రోల్ లీటరు రూ. 71.41, డీజెల్ రూ. 55.49 వుండగా, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధర 100.21 డాలర్లున్నప్పుడు దేశంలో పెట్రోల్ లీటరు రూ. 105.41, డీజెల్ రూ. 96.67 వుండడంలోని ఔచిత్యాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ లెక్కన 2014 నాటి ధరలే ఇప్పటికీ కొనసాగవలసి వుండగా ఈ పెంచిన ధర ఏమైందని వారు అడుగుతున్నారు. ప్రధాని మోడీ అహేతుకంగా పెట్రోల్, డీజెల్ ధరలపై నాన్ బిజెపి రాష్ట్రాలను బోనెక్కించే ప్రయత్నం చేసి కందిరీగల తుట్టెను కదిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News