Wednesday, May 1, 2024

నేడే సాగర్ సమరం

- Advertisement -
- Advertisement -

 ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధం, 346 కేంద్రాల్లో ఏర్పాట్లు
 ఉదయం 7గం.నుంచి రాత్రి 7గం. వరకు ఓటింగ్ ప్రక్రియ
 కొవిడ్ నిబంధనలు పాటించాలని ఓటర్లకు ఎన్నికల కమిషన్ పిలుపు

మనతెలంగాణ/హైదరాబాద్: దివంగత ఎంఎల్ నోముల నర్సింహయ్య అకాల మరణంతో జరుగుతున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2 లక్షల 20 వేల 300 మంది ఓటర్లు ఉన్న సాగర్ నియోజకవర్గంలో మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్లు తప్పనిసరిగా మాస్కు ధరించాలని నిబంధన పెట్టారు. కరోనా నేపథ్యంలో శనివారం(ఏప్రిల్ 17) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లకు సమయాన్ని కేటాయించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు గంటపాటు కొవిడ్ పాజిటివ్ రోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనుమతించనున్నారు.

పిపిఇ కిట్లు ధరించి వారు ఓటు హక్కును వినియోగించుకునేలా ఆరోగ్య శాఖ అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. పోలింగ్‌కు సంబంధించి మొత్తం 5,535 సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. అందులో 2,390 పోలిసులు, 1,622 మంది పోలింగ్ సిబ్బంది, 130 మైక్రో అబ్జర్వర్లు, 210 మంది వెబ్‌క్యాస్టింగ్ సిబ్బంది, 44 మంది సెక్టార్ ఆఫీసర్లు, 293 మంది బిఎల్‌ఒలు, 710 మంది ఆరోగ్య శాఖ సిబ్బంది, 95 మంది డ్రైవర్లు సాగర్ ఉప ఎన్నికలలో విధులు నిర్వహించనున్నారు. సాగర్ నియోజకవర్గంలో మొత్తం 2,20,300 మంది ఓటర్లు ఉండగా, అందులో 1,09,228 మంది పురుషులు, 1,11,072 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నాగార్జన సాగర్ ఉప ఎన్నికలో మొత్తం 41 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ఉప ఎన్నిక కోసం 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే వెంటనే దానిని పరిష్కరించేలా సాంకేతిక నిపుణులను అందుబాటులో ఉంచారు. కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్, సీసీ కెమెరాలు, వీడియో రికార్డింగ్ ద్వారా పోలింగ్‌ను పర్యవేక్షిస్తామని తెలిపారు.

నాగార్జున సాగర్ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార టిఆర్‌ఎస్, కాంగ్రెస్,బిజెపిలు తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించాయి.ఇక ఇన్నాళ్లూ చేసిన ప్రచారానికి ఓటర్లు తమ మద్దతును, అభిప్రాయాలను ఓటు రూపంలో శనివారం పోలింగ్‌లో ఇవ్వనున్నారు. అయితే పోలింగ్ సమయం ఎక్కువగా ఉండడంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో నమోదైన సుమారు 80 శాతంకి పైగా ఈసారి పోలింగ్ శాతం నమోదు చేపించేలా ఆయా పార్టీలు వ్యవహరిస్తున్నాయి. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ఓటర్లందరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది.

Nagarjuna Sagar by election Tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News