Thursday, May 9, 2024

ఇజ్రాయెల్‌లో జాతీయ ప్రభుత్వం..?

- Advertisement -
- Advertisement -

వామపక్ష పార్టీలతో చర్చలు జరుపుతున్నానని
తెలిపిన మితవాద నేత బెన్నెట్

National govt form in israel
జెరూసలేం: ఇజ్రాయెల్‌లో జాతీయ ప్రభుత్వం ఏర్పాటు దిశగా రాజకీయ సమీకరణలు జరుగుతున్నాయి. సుదీర్ఘకాలం ఆ దేశానికి ప్రధానిగా వ్యవహరించిన బెంజమిన్ నెతన్యాహుకు ఉద్వాసన పలికేందుకు వామపక్ష పార్టీలు, మధ్యేవాదులతోపాటు అరబ్ పార్టీతోనూ చేతులు కలిపేందుకు మితవాదులు ముందుకొస్తున్నారు. యూదు జాతీయ వాదాన్ని బలపరిచేవారిని మితవాదులుగా చెబుతారన్నది గమనార్హం. జాతీయ ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రతిపక్ష నేత యయిర్ లేపిడ్‌తో మంతనాలు సాగిస్తున్నట్టు మితవాద పక్షంగా భావించే యమీనా పార్టీ నేత నఫ్తాలీ బెన్నెట్ వెల్లడించారు. ఇటీవల ఆ దేశ పార్లమెంట్ నెస్సెట్‌కు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ, కూటమికీ తగినన్ని సీట్లు రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నది. మెజార్టీ సీట్లు సాధించిన పార్టీ నేతగా నెతన్యాహుకు ప్రభుత్వం ఏర్పాటుకు ఆ దేశ అధ్యక్షుడు రెవూవెన్ రివ్లిన్ మొదటి అవకాశమీయగా మద్దతును కూడగట్టడంలో విఫలమయ్యారు.

రెండేళ్ల వ్యవధిలో నాలుగుసార్లు ఎన్నికలు నిర్వహించినా ఇదే పరిస్థితి. దాంతో, మరోసారి ఎన్నికలకు వెళ్లకుండా జాతీయ ప్రభుత్వం ఏర్పాటుకు యత్నిస్తున్నట్టు బెన్నెట్ తెలిపారు. బెన్నెట్ ప్రయత్నాలు సఫలమైతే యయిర్‌తో ఆయన ప్రధాని పదవిని పంచుకోవాల్సి ఉంటుంది. మొదటి రెండేళ్లు బెన్నెట్, ఆ తర్వాత రెండేళ్లు యయిర్ ఆ పదవిని చేపట్టేందుకు ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు తెలుస్తోంది. 120 స్థానాలున్న నెస్సెట్‌లో మార్చిలో జరిగిన ఎన్నికల్లో నెతన్యాహు పార్టీ లికుడ్‌కు 30 సీట్లు, యయిర్ పార్టీ యేశ్ అటిడ్‌కు 17 సీట్లు, బెన్నెట్ పార్టీ యమీనాకు 7 సీట్లు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News