Monday, April 29, 2024

ఎన్నికల తర్వాతే టిటిడిపికి కొత్త బాస్ ?

- Advertisement -
- Advertisement -

ముందు గ్రామ,మండల, జిల్లా స్థాయి నాయకత్వంపై దృష్టి
కాసాని వేసిన కమిటీలన్నీ క్యాన్సిల్ ?!
కొత్త..పాత నేతల సమిష్టి బంధంగా నూతన టీమ్‌కు ఛాన్స్

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశం పార్టీకి నూతన బాస్ ఎవరు? అధినేత చంద్రబాబు ఈ స్థానాన్ని ఎప్పుడు భర్తీ చేస్తారు? వీలైనంత తొందరలోనేనా? లేక మరింత సమయం పడుతుందా? ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం పార్టీలో జోరుగా నడుస్తున్న చర్చ ఇది. అయితే ప్రస్తుతం జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయక పోవడంతో ప్రస్తుతానికి అధ్యక్ష పదవి భర్తీని కొన్నాళ్లు నిలిపివేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో నుండి మధ్యంతర బెయిల్‌పై విడుదలైనప్పటికీ ఆయన ఆనారోగ్యంగాను ఉండి ఆసుపత్రి పాలు కావడంతో ప్రస్తుతానికి టి టిడిపి అధ్యక్ష పదవీ బాధ్యతల జోళికి వెళ్లకుండా కనీసం ఒక నెల రోజుల తర్వాతనే దాని సంగతి చూసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటి వరకు బిసి సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కొనసాగగా అంతకు ముందు ఎస్‌సి సామాజిక వర్గానికి చెందిన షాద్‌నగర్ మాజీ ఎంఎల్‌ఏ బక్కని నర్సింహులు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించారు. అటు ఎస్‌సి, ఇటు బిసి సామాజిక వర్గాల తర్వాత మూడోసారి ఒసి సామాజిక వర్గానికి చెందిన వారికే వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. పార్టీ సీనియర్‌గా ఉన్న నన్నూరి నర్సిరెడ్డి పేరు బలంగా వినిపిస్తుండగా…అలా కాకుండా ఎస్‌సి, ఎస్‌టి, బిసి సామాజిక వర్గాల నుండి కనీసం ముడూ పోస్టులు ఉపాధ్యక్ష పదవులు ఇచ్చాకే ఒసి సామాజిక వర్గానికి చెందిన వారికి అధ్యక్ష బాధ్యత ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపైనా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ శ్రేణులతో చర్చస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతకు ముందు పార్టీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వేసిన కమిటీలన్నీ రద్దు చేయాలని మాత్రం పార్టీ నేతలు కోరుతున్నట్లు చెబుతున్నారు. ఎస్‌సి,ఎస్‌టి, బిసి కమిటీల్లో ఆయన తనకు అనుకూలంగా ఉన్న వారినే నియమించుకున్నారు తప్పితే,  పార్టీనే నమ్ముకుని ఉన్న వారిని మాత్రం విశ్వసించలేదని, నన్నూరి నర్సిరెడ్డి పలువురి పేర్లు పరిశీలనకు పంపించినా వాటిని కాదని తన ఇష్టం వచ్చిన వారినే నియమించారని పార్టీ నేతలు ఆరోపిస్తుండడం గమనార్హం.
కింది నుండి పైకి…
కాగా ముందు అధ్యక్షుడిని నియమిస్తే అతను అన్నీ చూసుకుంటారని అనుకున్నా కాసాని తీరును పరిశీలించిన క్రమంలో ముందుగా కింది నుండి పైకి అంటే గ్రామ, మండల, జిల్లా స్థాయి అధ్యక్ష బాధ్యతలను ఎవరెవరికి అప్పగించాలన్న దానిని నేరుగా చంద్రబాబు లేదా లోకేష్ మాత్రమే చూసేలా నిర్ణయాలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ కూడా చేయని క్రమంలో ముందు పార్టీ నిర్మాణంపైనే దృష్టి సారిస్తారని చెబుతున్నారు. కాసాని వేసిన కమిటీలన్నింటినీ రద్దు చేసి నూతనంగా వేసే కమిటీలో కొత్త పాతల కలబోతగా గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు ఉంటాయని చెబుతున్నారు. కింది స్థాయి నుండి పైకి ఇలా వేసే కమిటీలను కొత్త అధ్యక్షుడు కూడా ఓకే అనక తప్పదని పార్టీ వర్గాలు చెబుతుండడం విశేషం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News