Sunday, May 12, 2024

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్‌ఐఎ సోదాలు

- Advertisement -
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్‌ఐఎ సోదాలు
64 మందిపై ఉపా కేసు నమోదు
ఆరుగురు అరెస్ట్…నలుగురికి నోటీసులు
రూ.10లక్షల నగదు, విప్లవసాహిత్యం స్వాధీనం

NIA Raids in Telugu States TS and AP

మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో 31 ప్రాంతాల్లోని 64 మంది పౌరహక్కులు, ప్రజా సంఘాల నేతల ఇళ్లల్లో జాతీయ దర్యాప్తు సంస్థ రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించింది. ఈక్రమంలో నిషేధిత మావోయిస్టు పార్టీతో వారికి సంబంధాలు ఉన్నాయని 64 మంది ప్రజా సంఘాల నేతలపై ఎన్‌ఐఏ హైదరాబాద్ విభాగం ఉపా కేసు నమోదు చేసింది. ఎపిలోని శ్రీకాకుళం, విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, తూర్పు, పశ్చిమ గోదావరి, కడప, రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. మావోయిస్టులకు సమాచారం ఇస్తున్నారనే ఆరోపణలపై సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ అధికారులు ఆరుగురిని అరెస్ట్ చేయడంతో పాటు మరో నలుగురికి ఎన్‌ఐఎ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. ఎన్‌ఐఎ అరెస్ట్ చేసిన వారిలో పంగి నాగన్న, అందులూరి అన్నపూర్ణ, జంగిరాల కోటేశ్వరరావు, మణికొండ శ్రీనివాసరావు, రేల రాజేశ్వరి, బొప్పిడి అంజమ్మలున్నారు. కాగా నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లోని నివాసముంటున్న న్యాయవాది రఘునాథ్, డప్పు రమేశ్, జాన్, మహిళా సంఘం కార్యకర్త శిల్ప ఇళ్లల్లో తెల్లవారుజాము వరకు సోదాలు నిర్వహించి ఎన్‌ఐఎ 40 సెల్‌ఫోన్లు, 44 సిమ్‌కార్డులు,70 హార్డిస్క్‌లను సీజ్ చేసింది. హైకోర్టులో కేసులున్నాయని, తాను శనివారం హాజరవుతానని న్యాయవాది రఘునాథ్ ఎన్‌ఐఏ అధికారులకు చెప్పగా వాళ్లు అందుకు అంగీకరించారు. డప్పు రమేశ్, జాన్, శిల్ప ఎన్‌ఐఏ కార్యాలయంలో హాజరు కానున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఎన్‌ఐఎ సోదాలలో ఒక మైక్రో ఎస్‌డి, 180 సీడీలు, 19 పెన్‌డ్రైవ్‌లు, ఆడియో, వీడియో టేప్స్, రూ.10 లక్షలు, పెద్దఎత్తున విప్లవ సాహిత్య పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు.
అర్బన్ నక్సలైట్లుగా ఆరోపణలు ః
ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపి, ప్రజలను చైతన్యం చేస్తున్న వాళ్లను లక్ష్యంగా చేసుకొని ఎన్‌ఐఏ దాడులు చేస్తోందని పౌరహక్కుల సంఘం తెలంగాణ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. రాజ్యాంగ హక్కుల సాధన కోసం పోరాడుతున్న వాళ్లను మావోయిస్టులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్లను అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేస్తున్నారని లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది నవంబర్‌లో ఆదివాసీల గ్రామాలపై విరుచుకుపడుతున్న గ్రేహౌండ్స్ దళాల దృశ్యాలను చిత్రీకరించినందుకు పొంగి నాగన్నపై మావోయిస్టు కొరియర్‌గా కేసు నమోదు చేశారని, ఆ కేసులు మావోయిస్టు నేతలతో పాటు ప్రజా సంఘాలకు చెందిన 64 మందిని నిందితులుగా చేర్చడం ఎంతవరకు సమంజసమని లక్ష్మణ్ అన్నారు.తెలుగు రాష్ట్రాల్లో ఏక కాలంలో 27 మంది ఇళ్లల్లో సోదాల పేరుతో అలజడి సృష్టించారని పౌర హక్కుల సంఘం నేతలు అన్నారు. ఎన్‌ఐఏ నమోదు చేసిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని పౌరహక్కుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అర్బన్ నక్షలైట్లుగా ముద్ర వేస్తున్నారని తప్పుబట్టారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎన్‌ఐఏను ఏర్పాటు చేశారని, ఎన్‌ఐఏను ఉపసంహరించుకోవాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. చట్ట వ్యతిరేక కార్యకాపాల నిరోధక చట్టం(ఉపా చట్టం)ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేసి, వారు తెచ్చిన మెటీరియల్ ఇంట్లో పెట్టి మావోలతో సంబంధాలు ఉన్నాయని కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మంచంగిపుట్ట, పిడుగురాళ్ల కేసులను కొట్టివేయాలంటూ ప్రజాసంఘాల తరఫున అడ్వకేట్ రఘునాథ్ వాదిస్తున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించి వేస్తున్నారని ప్రజసంఘాలు, పౌరహక్కుల సంఘం నేతలు తీవ్రంగా ఖండించారు.

NIA Raids end in Telugu States

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News