Saturday, April 27, 2024

బియ్యం కయ్యం

- Advertisement -
- Advertisement -
Niranjan Reddy challenge to BJP leaders
రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలుపై టిఆర్‌ఎస్, బిజెపిల మధ్య వాగ్యుద్ధం
ధాన్యాన్ని కొనబోమని కేంద్రం చెప్పినట్టు వ్యవసాయ మంత్రి
నిరంజన్ రెడ్డి దుష్ప్రచారం, నాంపల్లి బిజెపి ఆఫీసు వద్ద దీక్ష
చేపట్టిన బండి సంజయ్ ఆరోపణ
దమ్ముంటే కేంద్రం నుంచి ఉత్తర్వులు తీసుకురావాలి
బండికి మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్
బిజెపివి అన్ని డ్రామాలు : మంత్రి జగదీష్‌రెడ్డి
ఉప్పుడు బియ్యం కొనబోం : కేంద్రం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలుపై అధికార టిఆర్‌ఎస్, ప్రతిపక్ష పార్టీ బిజెపిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరుపార్టీల నేతలు సవాళ్లు…ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తీవ్ర స్థాయి లో విమర్శలు… ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. కేంద్రం చేతకాని తన కారణంగానే రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని టిఆర్‌ఎస్ మంత్రులు…. సిఎం కెసిఆర్ అసమర్ధత కారణంగానే ఈ పరిస్థితి ఎదురవుతోందని బిజెపి ఎదురు దాడి చేయడంతో ధాన్యంపై ఇరుపార్టీలు ఛాలెంజ్‌లు…ప్రతి ఛాలెంజ్‌లు చేసుకుంటూ రాష్ట్రంలో రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉపఎన్నికకు పోలింగ్ మరో 24 గంటల వ్యవధి ఉండడంతో రెండు పార్టీల మధ్య ప్రచ్చన్న యుద్ధం సాగుతోంది.

దమ్ముంటే కేంద్రం నుంచి ఉత్తర్వులు తీసుకరావాలి

తెలంగాణలో వేసే ప్రతి పంటా, మొత్తం వరి ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం నుండి ఉత్తర్వులు తీసుకురావాలని బిజెపి నేతలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఇది మీకు చేతకాకపోతే ఎంపి పదవికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజీనానా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కిషన్‌రెడ్డి కూడా తన కేంద్ర మంత్రికి పదవి రాజీనామా చేసే ధైర్యం ఉందా? మంత్రి సింగిరెడ్డి ప్రశ్నించారు. ఈ వాదనలో తప్పుంటే మంత్రి పదవికి రాజీనామా చేయడానికి తాను కూడా సిద్దమేనని మంత్రి సింగిరెడ్డి సవాల్ విసరారు. రైతుల విషయంలో కేంద్రానిది రెండు నాల్కల ధోరణిని అవలభిస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వారి జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. వానాకాలం మొదలవడానికి ముందు నుండి నాలుగు నెలలుగా తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నదన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. దీనిపై సిఎం కెసిఆర్ స్వయంగా ఢిల్లీ వెళ్లి కోరినా కేంద్రంలో చలనం లేదని మంత్రి తీవ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధాన్యం కొనుగోళ్లపై బండి సంజయ్ దొంగ దీక్షలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన ఒర రోజు దీక్షకాకుండా కేంద్రం ధాన్యం కొంటామనేదాకా దీక్షలు చేయాలి మంత్రి సింగిరెడ్డి సూచించారు. ఎవరిని మభ్య పెట్టడానికి ఈ దీక్ష అని ప్రశ్నించారు. థర్డ్ క్లాస్ రాజకీయాలు వెంటనే మానుకోవాలన్నారు.హుజూరాబాద్ ఎన్నికల కోసం బిజెపి చిల్లర రాజకీయాలు చేస్తుందని మంత్రి సింగిరెడ్డి మండిపడ్డారు. పదవిచ్చి , బాధ్యతనిచ్చి అందలమెక్కించిన కెసిఆర్‌ను బొంద పెడతానన్నప్పుడే ఈటెల రాజేందర్ సంస్కారం బయటపడిందన్నారు. దేశంలో ఊరూరా కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో 63 లక్షల ఎకరాలలో వరి సాగయిందని…వంద శాతం పంటల నమోదు చేసిన ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణే అన్నారు. ఈ విషయం కేంద్రానికి చెబితే అంత వేశారా? తమకు శాటిలైట్ లో కనిపించడం లేదు…తాము క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం అని ఇంతవరకు పరిశీలన లేదన్నారు.

దీనిపై కేంద్రంలోని అధికారులు 3 నెలలుగా సాగదీస్తున్నారన్నారు. ఈ విషయంపై మాట్లాడేందుకు రాష్ట్రాని చెందిన అధికారులు గురువారం కూడా ఢిల్లీలోనే ఉన్నారన్నారు. కేంద్రానికి నచ్చిన గ్రామాలలో రహస్యంగా సర్వే చేసి వరి సాగును నిర్దారించుకోమని చెప్పామన్నారు. అయినా కేంద్రం పట్టించుకోలేదని మంత్రి సింగిరెడ్డి విమర్శించారు. పార్ బాయిల్ రైస్ కొనబోమని రాష్ట్ర పౌరసరఫరాల కమీషనర్‌కు లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వం కాదా? అని నిలదీశారు. తన సవాల్‌కు బిజెపి తొకముడిచిందన్నారు.2022కు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పిన మోడీ…ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 11 గంటల నుండి 2 గంటల వరకు చేసే దాన్ని దీక్ష అంటారా? అని మంత్రి సింగిరెడ్డి ప్రశ్నించారు.

బిజెపివి అన్ని డ్రామాలు

ధాన్యం కొనుగోళ్ల పై బిజెపి ఆడుతున్న డ్రామాలు కట్టి పెట్టాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి హెచ్చరించారు. ఎఫ్‌సిఐ రాసిన లేఖ రాష్ట్ర ప్రభుత్వం వద్ద భద్రంగానే ఉందన్నారు. వానాకాలమే కేంద్రం మోసం చేసే ప్రయత్నం చేసిందన్నారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా పని చేస్తున్నందున రాజకీయాలు చేయడంలేదన్నారు. యాసంగిలో పండిన పంట కొంటామనే ధైర్యం బిజెపి నేతలకు ఉందా?అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కొనుగోలు చేస్తే ఎన్ని లక్షల టన్నుల ధాన్యం కొంటారో తేల్చిచెప్పాలని మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.ఆ మాట చెప్పకుండా డ్రామాలు వేయడం సరికాదని ఆయన బిజెపి నేతలపై మండిపడ్డారు.

రైతుబంధు ఇస్తున్నందుకు దీక్ష చేస్తారా?

గుజరాత్‌లో కూడా ఇవ్వని విధంగా వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరంటు ఇస్తున్నందుకు దీక్షలు చేస్తారా? అని ఎంఎల్‌సి, రైతు బంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. దొడ్డు వడ్లు కొనమని కేంద్రం… తెలంగాణకు రాసిన లేఖ చూపించినా బండి సంజయ్ మళ్లీ అడగడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంగ్లీషు తెలియకుంటే తెలిసిన వారిని అడిగి తెలుసుకోవాలని పల్లా సూచించారు.

పంజాబ్‌లో వరి ధాన్యం సేకరించిన విధంగా కేంద్రం తెలంగాణలో వరి ధాన్యం ఎందుకు సేకరించదు?అని ప్రశ్నించారు. అక్కడ ఎంత పెట్టుబడి, కష్టం ఉంటుందో ఇక్కడా అంతే కష్టం ఉంటుందన్నారు. కానీ అత్యధిక ఉత్పత్తి సాధిస్తున్న తెలంగాణ రైతాంగాన్ని ఎందుకు ప్రోత్సహించరు? అని ఆయన నిలదీశారు. యుపిలో రైతుల పంటలు కొనడం లేదని పంటలు తగలబెట్టుకుంటున్నారని బిజెపి ఎంపి వరుణ్ గాంధీ స్వయంగా ట్వీట్ చేశారన్నారు. నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల మీదకు బిజెపి మంత్రి కొడుకు వాహనం ఎక్కించి చంపేశాడన్నారు. మీకు చేతనైతే నల్లచట్టాలకు వ్యతిరేకంగా, కరెంటు చట్టాలకు వ్యతిరేకంగా దీక్షలు చేసి రద్దు చేయించాలని పల్లా సవాల్ విసిరారు.

దీక్షపై నిప్పులు

ధాన్యం కొనుగోళ్లపై బండి సంజయ్ దీక్షలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నిప్పులు చెరిగారు. ప్రజలను మభ్య పెట్టడానికి బండి దొంగ దీక్ష చేశారన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. ధాన్యం కొనబోమని చెప్పింది కేంద్రం కాదా? అని ప్రశ్నించారు. కేవలం హుజురాబాద్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే బండి సంజయ్ చిల్లర రాజకీయాలకు తెరతీశారని ఆయన మండిపడ్డారు. హుజూరాబాద్ రైతాంగం బిజెపి బజారు రాజకీయాలు గమనించి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

రైతుల పాలిట రాబందు

రైతుల పాలిట సిఎం కెసిఆర్ రాబందుగా మారాడని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. నాంపల్లోని పార్టీ కార్యాలయంలో దీక్ష చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడూతూ, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా సిఎం లేఖ రాస్తే కేంద్రాన్ని ఒప్పిస్తామన్నారు. రైతు పండించిన ధాన్యాన్ని మొత్తం కనిపించే బాధ్యత మేం తీసుకుంటామన్నారు. తాము ధాన్యాన్ని కొనబోమని కేంద్రం చెప్పినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని బండి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారం ముగిసిన తరువాత కూడా హుజూరాబాద్ ఓటర్లను ప్రభావితం చేసేలా మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన మంత్రులపై సుమోటోగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఆ మంత్రిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు కోర్టులను దిక్కరించే వ్యాఖ్యలు చేసిన కలెక్టర్‌పై కూడా చట్ట, న్యాయపరమైన పోరాటం చేస్తామన్నారు. తెలంగాణలో పండిన ప్రతి పంటను కేంద్రమే కొనుగోలు చేస్తోందన్నారు. అన్ని కేంద్రమే చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? అని ప్రశ్నించారు. పండించిన ప్రతి పంటను తామే కొంటామన్న కెసిఆర్ ఇప్పుడు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. వరి కాకుండా ఏ పంట పండించాలో ప్రభుత్వం దగ్గర ప్రణాళిక లేకపోవడం సిగ్గుచేటని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. వరి పంట వేయకుంటే లక్షల కోట్ల పెట్టి కాళేశ్వరం ప్రాజక్ట్ ఎందుకు కట్టినట్లు అని నిలదీశారు. ఈ దీక్ష ఆరంభం మాత్రమేనని… రైతులను ఇబ్బంది పెడితే పెద్దఎత్తున ఉద్యమిస్తామన్నారు. శుక్రవారం నుంచి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్టమంతటా ఆందోళనలు చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News