Sunday, April 28, 2024

మోడీపై అవిశ్వాసానికి అనుమతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష కూటమి ఇండియా తరఫున కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతిని ఇచ్చారు. రగులుతున్న మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ సభకు సమాధానానికి ఒత్తిడి తెచ్చేలా ప్రతిపక్షాలు ఈ అవిశ్వాస తీర్మానానికి నోటీసు వచ్చాయి. ఈ తీర్మానానికి తాము అనుమతిని ఇస్తున్నట్లు బుధవారం తెలిపిన స్పీకర్ అన్ని పార్టీలతో చర్చించిన తరువాత సభలో దీనిపై చర్చకు తేదీని ఖరారు చేస్తామని తెలిపారు. మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో అనూహ్య అసాధారణ పరిణామం అయింది. అసోంకు చెందిన కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగోయ్ సభలో ఈ తీర్మానం ప్రతిపాదించారు.

దీనితో నిబంధనలకు అనుగుణంగా దీనికి అవసరం అయిన 50 మంది సభ్యుల మద్దతును స్పీకర్ ఒక్కొక్కరిగా లెక్కించి తీర్మానానికి అనుమతిని ఇస్తున్నట్లు తెలిపారు. చర్చకు తేదీని ఖరారు చేయాల్సి ఉందని వివరించారు. బుధవారం మధ్యాహ్నం సభ ఆరంభం కాగానే స్పీకర్ తమకు కాంగ్రెస్ ఎంపి గొగోయ్ నుంచి నోటీసు అందిన విషయం తెలిపారు. కేంద్ర మంత్రి మండలిపై రూల్ నెంబరు 198 పరిధిలో అవిశ్వాసం కోరుకుంటున్నామని సభ్యులు తెలిపారని, దీనికి సభ అనుమతి నిబంధనల మేరకు అవసరం అని తాను తెలిపి తదనుగుణంగా అనుమతిని ఇచ్చినట్లు స్పీకర్ వివరించారు. 50 మంది సభ్యుల లెక్కింపు దశలో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా ,

డిఎంకు ఎంపి టిఆర్ బాలు, ఎన్‌సిపి నేత సుప్రియా సూలేతో పాటు ఇండియా కూటమికి చెందిన ఎంపిలు లేచి నిలబడ్డారు. తీర్మానం వీగిపోతుందని తెలుసునని, బలపరీక్షలో ఇది నెగ్గబోదని తమకు అవగావహన ఉందని అయితే అవిశ్వాస తీర్మానం ద్వారా దేశ ప్రజలకు ఈ ప్రభుత్వ మొండివైఖరిని తెలియచేయడం జరుగుతుందని ప్రతిపక్ష కూటమి ఇండియన్ డెవలప్‌మెంటల్ ఇనిక్లూజివ్ అలయెన్స్ (ఇండియా) నేతలు స్పష్టం చేస్తున్నారు. మణిపూర్ మండిపోతూ ఉంటే , ప్రధాని మోడీ దీనిపై పార్లమెంట్‌లో స్పందించడం లేదని, ఏదో విధంగా ఆయనను మాట్లాడించేలా చేసేందుకు ఈ మార్గం వెతుక్కున్నామని నేతలు తెలిపారు.
మోడీ సర్కారుపై ఇది రెండో అవిశ్వాస తీర్మానం
2014 నుంచి ఇప్పటివరకూ చూస్తే మోడీ ప్రభుత్వంపై ఇది రెండో అవిశ్వాస ప్రతిపాదన. తొలిసారి 2018లో జులై 20వ తేదీన అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చారు. అయితే విశ్వాస పరీక్షలో ఎన్‌డిఎకు 325 ఓట్లు రాగా, తీర్మానానికి మద్దతుగా కేవలం 126 ఓట్లు దక్కాయి. దీనితో తీర్మానం వీగిపోయింది. ఇప్పుడు ఐదేళ్లకు తిరిగి ఈ పరిస్థితి ఏర్పడింది. లోక్‌సభలో మొత్తం సభ్యుల సంఖ్య 543. కాగా ఖాళీల సంఖ్య ఐదు. సభలో బిజెపి నాయకత్వపు ఎన్‌డిఎకు 330 స్థానాలు ఉన్నాయి. ప్రతిపక్ష కూటమికి 140 మంది సభ్యుల బలం ఉంది. కాగా ఎన్‌డిఎకు ఇప్పటి ఇండియా కూటమికి అనుబంధం కాని పార్టీల సభ్యుల సంఖ్య దాదాపుగా 60 వరకూ ఉంది.

దీనితో అవిశ్వాసంపై బలాబలాల పరిస్థితి స్పష్టం అయింది. అయితే దీనిపై చర్చ దశలో పలు కీలక అంశాలు ప్రత్యేకించి మణిపూర్ విషయంపై మోడీ వైఖరిని ప్రతిపక్షాలు విమర్శించేందుకు వీలేర్పడుతుంది. ప్రతిపక్షాల మాటవినని మోడీకి, మణిపూర్ విషయంపై మాట్లాడకుండా ఉంటున్న మోడీకి ప్రతిపక్ష కూటమి ఈ తీర్మానంతో సంఘటితంగా చురకకు దిగిందని కాంగ్రెస్ ఎంపి మాణిక్కం ఠాగూర్ తెలిపారు. అధికార పక్ష అహంకార ధోరణిని దెబ్బతీసేందుకు తాము ఈ విధంగా ఈ ఆఖరి ఆయుధం వాడామని చెప్పారు.
ఇంతకు ముందు లాగానే ఇప్పుడూ గుణపాఠం
ప్రతిపక్షాల అవిశ్వాసంపై మంత్రి జోషి
ప్రధాని మోడీ పట్ల, బిజెపి పట్ల ప్రజల విశ్వాసం చెక్కుచెదరనిదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. ప్రతిపక్ష అవిశ్వాసంపై ఆయన స్పందించారు. గత సభల దశలోనూ ఈ విధంగా చేశారు. దెబ్బతిన్నారు. ఇప్పుడు కూడా ఇదే విధంగా ప్రజలు వారికి గుణపాఠం చెపుతారని వ్యాఖ్యానించారు. అవిశ్వాసం వస్తే తగు విధంగా ఎదుర్కొవడానికి తాము సిద్ధంగా ఉన్నామని మరో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మెఘావల్ తెలిపారు.
బిఆర్‌ఎస్ నుంచి కూడా అవిశ్వాస తీర్మానం
ఎన్‌డిఎలో కానీ ఇండియా కూటమిలో కానీ లేని కే చంద్రశేఖర రావు నాయకత్వపు బిఆర్‌ఎస్ కూడా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు వెలువరించింది. బిఆర్‌ఎస్ ఎంపి నామా నాగేశ్వర రావు ద్వారా దీనిని ప్రతిపాదించారు. బిఆర్‌ఎస్‌కు తొమ్మండుగురు ఎంపిలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News