Home ఎడిటోరియల్ అబద్ధాలకు ఆక్సిజన్

అబద్ధాలకు ఆక్సిజన్

No Data On Deaths Due To Oxygen Shortage:Central Health ministry

 

అబద్ధం అతికినట్టుండాలి గాని, తాను పచ్చి బూటకాన్ని అని నెత్తిన రాసుకున్నట్టు ఉండకూడదు. అధికారంలో ఉన్న వారు ఏది చెబితే దానినే ప్రజలు నమ్ముతారనే ఆత్మవంచన, పరవంచనతో కూడినది అసలే కాకూడదు. దేశంలో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య దాదాపు 50 లక్షలు ఉండవచ్చని పలు సర్వేలు చెబుతుండగా, రెండో వేవ్‌లో ఆక్సిజన్ కొరత కారణంగా ఎవరైనా చనిపోయినట్టు సమాచారం తమ వద్ద లేదని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ మంగళవారం నాడు రాజ్యసభకు తెలియజేయడం అత్యంత హాస్యాస్పదంగా ఉంది. కొవిడ్ రెండో దశలో ఆక్సిజన్ అందక మరణించిన వారి సమాచారాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రత్యేకించి ఇవ్వలేదని మంత్రి తెలియజేశారు. కర్ర విరగకుండా పాము చావకుండా ఆమె అతి జాగ్రత్తగా ఇచ్చిన సమాచారం దేశ ప్రజలకు వాస్తవాలను తెలియజేయవలసిన బాధ్యత నుంచి ఉద్దేశపూర్వకంగా తప్పించుకోడంగానే పరిగణించాలి. రాష్ట్రాలు గాని, కేంద్ర పాలిత ప్రాంతాలు గాని తమకు అలవాటైన పద్ధతిలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అన్ని రకాల కొవిడ్ మరణాల సంఖ్యను ముద్దగా ఒక చోట చేర్చి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి ఉండవచ్చు.

అంత మాత్రాన ఆక్సిజన్ మరణాలు లేనేలేవనే రీతిలో బాధ్యత గల మంత్రి సభకు చెప్పడం ముమ్మాటికీ ఆక్షేపించవలసిన విషయం. ఒకవైపు రెండో వేవ్ గురించి బాగా ముందుగానే హెచ్చరించినప్పటికీ భారత ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోలేదని నిపుణ శాస్త్రజ్ఞుల సహా పలువురు ప్రముఖులు, సంస్థల నివేదికలు బల్లగుద్ది చెబుతున్నాయి. మరో వైపు ఆక్సిజన్ అందక బెడ్ల కోసం ఆసుపత్రుల బయట పడిగాపులు కాస్తూ చనిపోయిన వైరస్ బాధితులు, లోపల చికిత్స పొందుతూ ఊపిరాగిపోయిన వారి గురించి మీడియాలో, దృశ్యమాధ్యమాల్లో ఫోటోలు, వీడియోలతో సహా వచ్చిన సమాచారం దేశ ప్రజల కళ్లముందు ఇంకా కదలాడుతూనే ఉంది. కేంద్రమే శ్రద్ధ వహించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి సరైన సమాచారాన్ని తెప్పించి సభకు వాస్తవాలు తెలియజేయాలి. అందుకు బదులు అస్పష్ట సమాచారాన్ని వండి వార్చి అందించడం అభ్యంతరకరం. దేశ రాజధానిలోనే గల బాత్రా ఆసుపత్రిలో ఆక్సిజన్ సంబంధమైన సమస్యలతో మే 1వ తేదీన 12 మంది చనిపోయినట్టు ఆ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ స్వయంగా వెల్లడించారు.

ఐసియులో ఆరుగురు కొవిడ్ బాధితులు, వార్డుల్లోని మరి ఇద్దరు ఆక్సిజన్ అందక మరణించారని, మరి నలుగురిని అతి కష్టం మీద కాపాడగా ఆ తర్వాత కొద్ది సేపటికే ప్రాణ వాయువు కొరతతో వారు చనిపోయారని ఆయన తెలియజేశారు. గోవాలోనైతే మే 1115 తేదీల మధ్య ఆక్సిజన్ కొరత వల్ల 83 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్నాటకలో 24 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 45 మంది, హర్యానాలో కనీసం 19 మంది ప్రాణవాయువు అందక కన్నుమూశారు. ఇవన్నీ పైపై గణాంకాలే. లోతులకు పోయి రికార్డయిన మరణ కారణాలను తరచి చూస్తే ఆక్సిజన్ అందుబాటులో లేక ఊపిరాగిపోయిన వారి సంఖ్య కొన్ని వందలకు చేరే అవకాశముంది. కరోనా రెండో దశలో ఆసుపత్రుల్లో వినియోగించే ప్రాణ వాయువుకు డిమాండ్ బాగా పెరిగిన సంగతిని మంత్రి అంగీకరించారు. కరోనా మొదటి దశలో ఈ డిమాండ్ 3095 మెట్రిక్ టన్నులు మాత్రమే కాగా, రెండో వేవ్ నాటికి అది 9000 టన్నులకు పెరిగిందని మంత్రి స్వయంగా చెప్పారు. ఇక్కడే ప్రస్తావించుకోవల్సిన మరో దారుణం ఏమిటంటే మొదటి దశ కరోనా ప్రాణాలను కబళిస్తున్న సమయంలోనే 2020 ఏప్రిల్ 2021 జనవరి మధ్య దేశం నుంచి 9301 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఎగుమతి అయింది.

ఇది అంతకు ముందు సంవత్సరంలో జరిగిన ఎగుమతికి రెట్టింపు పైనే ఉంది. దీనిని బట్టి రెండో దశ కరోనాను ఎదుర్కోడానికి కేంద్ర పాలకులు తీసుకున్న ముందు జాగ్రత్తలు శూన్యమని రూఢి అవుతున్నది. కరోనా మరణాలపై తాము గతంలో ఇచ్చిన సమాచారం సరైనది కాదని చెబుతూ అదనపు లెక్కలను పలు రాష్ట్రాలు ఇప్పుడు బయట పెడుతున్నాయి. సీరో అధ్యయనాలు, గృహ సరేలు, రాష్ట్ర స్థాయి పౌర సంస్థల నుంచి అధికారికంగా సేకరించిన సమాచారం, అంతర్జాతీయ అంచనాలు వీటన్నింటినీ కలిపి అధ్యయనం జరిపిన వాషింగ్టన్‌లోని సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ సంస్థ నిగ్గు తేల్చిన దాని ప్రకారం దేశంలో మొత్తం కరోనా మరణాలు ప్రభుత్వం చెబుతున్న 4 లక్షల కంటే అనేక రెట్లు ఎక్కువ ఉండవచ్చునని తాజాగా వెల్లడైంది. మూడు రకాల అధ్యయనాల ఆధారంగా ఈ సంస్థ ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. 2020 జనవరి 2021 జూన్ మధ్య 49 లక్షల మంది కరోనా వల్ల చనిపోయి ఉంటారని వెల్లడించింది. ఈ నివేదికను తయారు చేసిన వారిలో భారత ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ కూడా ఉన్నారు. కరోనాను ఎదుర్కోడంలో కేంద్ర పాలకుల నిర్వాకం ఇంత వికృతంగా వెల్లడవుతుంటే అతకని అబద్ధాలతో దానిని కప్పిపుచ్చే యత్నం చేయడం దారుణం.