Monday, April 29, 2024

సిబిఐకి నో ఎంట్రీ..

- Advertisement -
- Advertisement -

No Entry for CBI in Telangana

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశం రాజకీయాలను కుదిపేస్తున్న తరుణంలో.. ఆగస్టులోనే సిబిఐకి ఇచ్చిన అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేలా గతంలో సిబిఐకి అనుమతి ఉండేది. గతంలో సిబిఐకి ఇచ్చిన అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇందుకు సంబంధించి ఆగస్టు 30న జీవో 51ను ప్రభుత్వం జారీ చేసింది. ఇక రాష్ట్రంలో ఏ కేసునైనా సిబిఐ దర్యాప్తు చేయాలంటే.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఉత్తర్వులలో పేర్కొంది. రాష్ట్రంలో సిబిఐ దర్యాప్తునకు అనుమతిని ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ తాజాగా హైకోర్టుకు ఈ విషయాన్ని తెలపడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బేరసారాలకు సంబంధించి సిబిఐ విచారణకు ఆదేశించాలని ఇటీవల హైకోర్టును బిజెపి సంప్రదించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బిజెపి జాతీయ కార్యదర్శి బిఎల్ సంతోష్ పేర్లు లీకైన అడియో కాల్స్‌లో వినిపించడంతో దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం హట్ టాపిక్‌గా మారింది.

రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేలా గతంలో సిబిఐకి అనుమతి ఇవ్వగా.. తాజాగా ఆ ఆదేశాలను రద్దు చేసింది. అయితే సిఎం కేసీఆర్ ఈ విషయంలో గతంలోనే పలు ఆలోచనలు చేశారు. సలహాలు, సూచనలు తీసుకున్నారు. తెలంగాణలో సిబిఐ విరుచుకుపడే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతున్న సమయంలో సిబిఐకి అనుమతి రద్దు చేయాలన్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ అవినీతి నిరోధక చట్టం 1988, ఐపిసిలోని పలు సెక్షన్లతో ఢిల్లీలో తప్ప దేశంలోని ఏ రాష్ట్రంలోనూ సిబిఐ నేరుగా వెళ్లి దర్యాప్తు చేసేందుకు వీలు లేదు.

ఇందుకోసం రాష్ట్రాలు సాధారణ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలో సాధారణ సమ్మతి ఇచ్చి, తర్వాత కాలంలో వాటికి రద్దు చేసిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. 2018లో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ సిబిఐకు ఇచ్చిన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంది. దాంతో రాష్ట్రంలో సిబిఐ కేసులు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఇబ్బందులకు గురి చేస్తోందంటూ విమర్శలు వచ్చాయి. రాష్ట్రాలు తమ సమ్మతి ఉపసంహరించుకున్నంత మాత్రాన సిబిఐ ఆ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా ఊరుకోదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. దాణా కుంభకోణంలో విచారణ నుంచి తప్పించుకునేందుకు లాలూ ప్రసాద్ యాదవ్ సిబిఐని తమ రాష్ట్రాలోకి రాకుండా ఉత్తర్వులు జారీ చేశారు. సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించి, ఆ ఉత్తర్వులను కొట్టివేయించింది. దీంతో సిబిఐ దర్యాప్తుతో లాలూ ప్రసాద్ జైలుకు వెళ్లారు. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో సిబిఐ కేసులు పెట్టే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ప్రభుత్వం రెండు నెలల క్రితమే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

No Entry for CBI in Telangana

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News