Wednesday, May 8, 2024

టైటిల్ గ్యారంటీ లేనట్టే!

- Advertisement -
- Advertisement -

 Title Guarantee

 

హైదరాబాద్ : కొత్త రెవెన్యూ చట్టంలో ‘టైటిల్ గ్యారంటీ’ అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో వివాదాస్పద భూములను ప్రభుత్వం పార్ట్ బిలో చేర్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘టైటిల్ గ్యారంటీ చట్టం’ వల్ల కొత్తగా ఒనగూరే ప్రయోజనం లేదని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. దీనిస్థానంలో ఆర్‌ఓఆర్, రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్టుగా సమాచారం. గతంలో భూములకు కచ్చితమైన ఓనర్‌షిప్‌ను నిర్ధారించే టైటిల్ గ్యారంటీని ఇవ్వాలని నల్సార్ యూనివర్శిటీ నిపుణులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పొందుపరిచారు. టైటిల్‌పై వివాదం తలెత్తితే ‘టైటిల్ గ్యారంటీ చట్టంలో’ బాధితులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

రెవెన్యూ పరిపాలన, సంస్కరణలు, చట్టాల మార్పుల ఆవశ్యకతపై చర్చ
రైతులకు మేలు జరగాలంటే భూమి -సేవల్లో, చట్టాల్లో, పరిపాలనలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సిఎం పలుమార్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో సైతం ఈ అంశంపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే కొత్త చట్టం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గత సంవత్సర కాలంగా రెవెన్యూ పరిపాలన, సంస్కరణలు, చట్టాల మార్పుల ఆవశ్యకతపై రాష్ట్రంలో చర్చ నడుస్తోంది. చాలారోజులుగా టైటిల్‌యాక్ట్‌ను కొత్త రెవెన్యూ చట్టంలో పొందుపరచనున్నట్టు అధికారులు పేర్కొట్టున్నా ప్రస్తుతం రాష్ట్రంలో దాని అవసరం ఉండకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

టైటిల్ గారంటీ చట్టం వ్యవస్థ వస్తే భూయజమానికి భద్రమైన భూమి హక్కు దక్కుతుందని, హక్కుల చిక్కులు తీరుతాయని, భూ సమస్యలు తగ్గుతాయని, దీంతోపాటు భూ వివాదాలు, భూ సంబంధిత నేరాలు గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే నిపుణులు భావిస్తున్నట్టుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనరాష్ట్రంలో దాని అవసరం లేకపోవచ్చని ప్రభుత్వం ఓ అభిప్రాయానికి వచ్చినట్టుగా సమాచారం.

ముప్పై ఏళ్లుగా దేశంలో ‘టైటిల్ గ్యారంటీ చట్టం’ కోసం ప్రయత్నాలు
ముప్పై ఏళ్లుగా దేశంలో టైటిల్ గ్యారంటీ చట్టం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్లానింగ్ కమిషన్ ప్రొఫెసర్ డి.సి. వాద్వా ఆధ్వర్యంలో నియమించిన ఏక సభ్య కమిషన్ 1989 లోనే టైటిల్ గారంటీ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం 2011 లో ఒక ముసాయిదా చట్టాన్ని సైతం రూపొందించింది. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ టైటిల్ గ్యారంటీ చట్టాలు చేశాయి. గోవా, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలు ఇలాంటి చట్టం తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే మన రాష్ట్రంలో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనతో భూ వివాదాలు చాలా వరకు పరిష్కారమయ్యాయని, ఈ నేపథ్యంలో టైటిల్‌యాక్ట్ అవసరం ఉండకపోవచ్చని ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు పేర్కొంటున్నారు.

5 అంశాలపై ఇప్పటికే దృష్టి
అయితే కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చేముందు ప్రభుత్వం ఇప్పటికే పలు అంశాలపై దృష్టి సారించింది. అందులో భాగంగానే 1. భూ రికార్డుల ప్రక్షాళన- ఎల్‌ఆర్‌యూపి (LRUP) – రైతులకు కొత్త పాసుపుస్తకాల జారీ చేయడం, 2. భూముల రీ సర్వేకి ప్రయత్నాలు చేయడం, 3. భూ చట్టాల సమీక్షతో పాటు నల్సార్ విశ్వవిద్యాలయం నివేదికపై దృష్టి సారించడం, 4.ఆర్‌ఓఆర్, పిఓటి, నాలా చట్టాల్లో మార్పులకు శ్రీకారం చుట్టడం, 5. సాదాబైనామాలను క్రమబద్ధీకరించి కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం లాంటి చర్యలకు ప్రభుత్వం ఇప్పటికే శ్రీకారం చుట్టింది.

రానున్న రోజుల్లో మరిన్ని మార్పులకు శ్రీకారం
వీటితో పాటు రానున్న రోజుల్లో మరిన్ని మార్పులకు ప్రభుత్వ శ్రీకారం చుట్టాలని భావిస్తున్నట్టుగా తెలిసింది. అందులో భాగంగానే సమగ్ర భూ సర్వే జరపాలని భావిస్తున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న భూ చట్టాలను కలిపి ఒక సమగ్ర భూ చట్టంగా రూపొందించనున్నట్టు సమాచారం. దీనివలన అధికారులకు, రైతులకు చాలా ఉపయుక్తంగా ఉంటుందని మిగతా రాష్ట్రాల్లో సైతం రుజువయ్యింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా 1999 లో ఇలాంటి ప్రయత్నం జరిగినా దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడలేదు.

జిల్లా, రాష్ట్ర స్థాయిలో భూ వివాద పరిష్కారానికి ట్రిబునళ్ల ఏర్పాటు !
జిల్లా, రాష్ట్ర స్థాయిలో భూ వివాద పరిష్కారానికి ట్రిబునళ్లను ఏర్పాటు చేయ్యాలని ప్రభుత్వం భావిస్తోంది. బీహార్ రాష్ట్రం భూవివాద పరిష్కారాల చట్టం, భూ ట్రిబ్యునల్ చట్టం రూపొందించి మంచి ఫలితాలు సాధించడంతో తెలంగాణ కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ప్రతి రాష్ట్రంలో పారాలీగల్ వ్యవస్థను అమలు చేయాలని కేంద్రం గతంలో అన్ని రాష్ట్రాలకు సూచించిన విషయం తెలిసిందే. కేంద్రం ప్రతిపాదించిన విధంగా ప్రతి మండలాలనికి ఒక పారాలీగల్, కమ్యూనిటీ సర్వేయర్‌ను నియమించి, ప్రతి డివిజన్ కేంద్రంలో ఒక భూ న్యాయ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు సమాచారం. దీంతోపాటు అన్ని శాఖలను ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చి భూ పరిపాలనా అకాడమీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది.

No Title Guarantee in new Revenue Act
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News