Monday, April 29, 2024

ఉత్తరాది-దక్షిణాది మధ్య చీలికలు తెస్తున్న బిజెపి

- Advertisement -
- Advertisement -

ఉత్తరాది-దక్షిణాది మధ్య చీలికలు తెస్తున్న బిజెపి
కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు

న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపు ఇచ్చారని, రాహుల్ గాంధీ ఉత్తరాది-దక్షిణాది మధ్య చీలిక తీసుకువస్తున్నారంటూ బిజెపి టూల్‌కిట్ అందచేస్తోందని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టింది. కాంగ్రెస్ ప్రధాన అధికారప్రతినిధి రణదీప్ సూర్జీవాలా బుధవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి దేశం దృష్టిని మరల్చడానికి బిజెపి ప్రతిరోజు ఏదో ఒక కృత్రిమ సమస్యను సృష్టిస్తోందని ఆరోపించారు. ఇటీవల కేరళలోని తిరువనంతపురంలో ఒక బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ తాను తొలుత 15 సంవత్సరాలు ఉత్తరాదిలో ఎంపీగా ఉన్నానని, తాను భిన్నమైన రాజకీయాలను అక్కడ చూశానని చెప్పారు. కాని కేరళకు వచ్చిన తర్వాత ప్రజలు అసలు సమస్యల పట్ల చాలా ఆసక్తిగా ఉండడం తనకు ఆనందాన్ని కలుగచేసిందని, సమస్యలను పైపైన కాకుండా లోతుగా పరిశీలించడం తాను కేరళ ప్రజలలో చూశానని ఆయన తెలిపారు. కాగా..రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై బిజెపి నాయకులు, కేంద్ర మంత్రుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. రాహుల్ గాంధీని అవకాశవాదిగా అభివర్ణిస్తూ ఆయన ఉత్తరాది ప్రజలను కించపరిచారని వారు ఆరోపించారు.

దీనిపై సూర్జీవాలా వివరణ ఇస్తూ ఉత్తరాది-దక్షిణాది అంటూ విభజిస్తూ బిజెపి వార్తా చానళ్లకు, ప్రజలకు టూల్‌కిట్‌ను అమ్ముతోందని విమర్శించారు. అసలైన సమస్యలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానమివ్వాలని, అంతే తప్ప ప్రజల దృష్టిని మరల్చడానికి కృత్రిమ వివాదాలను తెరపైకి తీసుకురావడం తగదని ఆయన చెప్పారు. జిడిపి పతనం, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ధ్వంసం, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, బిజెపి పాలిత రాష్ట్రాలలో రాజ్యాంగంపై జరుగుతున్న దాడులు, ఢిల్లీ సరిహద్దుల్లో వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు, పౌర హక్కులతోపాటు ప్రజాస్వామ్యానికి చెందిని అన్ని సంస్థలపై జరుగుతున్న దాడులు వంటి అనేక ప్రధాన సమస్యలు దేశాన్ని పట్టిపీడిస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రజాతీర్పును బిజెపి కొనుగోలు చేస్తోందని, నిత్య ప్రజాతీర్పును అపహాస్యం చేస్తోందని ఆయన ఆరోపించారు.

North-South divide toolkit adopted by BJP: Congress

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News