Monday, April 29, 2024

కరోనా- ‘నరేగా’

- Advertisement -
- Advertisement -

Nrega deeds during the corona period

 

దేశంలో నిరుద్యోగం పెరుగుదల రేటు విశేషంగా పడిపోయి తిరిగి కరోనా ముందరి స్థాయికి చేరుకున్నదంటే ఎవరూ నమ్మలేకపోవచ్చు. ఇది ముమ్మాటికీ నిజమని భారత ఆర్థిక స్థితిగతుల పర్యవేక్షక కేంద్రం (సిఎంఐఇ) వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవహారాలపై పలు కోణాలలో పరిశీలించి వాస్తవాలను నిగ్గు తేల్చే ఈ సంస్థ కరోనా కాలంలో 27.1 శాతానికి దూసుకుపోయి పరాకాష్ఠకు చేరిన నిరుద్యోగ రేటు ప్రస్తుతం 8.5 శాతం వద్ద ఉన్నదని వివరించింది. ఇంత భారీ తగ్గుదలకు కారణాలను కూడా విపులీకరించింది.

ఈ తగ్గుదల పట్టణ ప్రాంతాలలో కంటే గ్రామీణ భారతంలోనే అధికంగా ఉన్నదని ప్రకటించింది. పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుత నిరుద్యోగ రేటు 11.2 శాతంగా, గ్రామాల్లో 7.3 శాతంగా ఉండడం విశేషం. దీనికి ప్రధాన కారణం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమే(నరేగా) నని కూడా సిఎంఐఇ విశ్లేషించి చెప్పింది. ఈ పథకం ద్వారా అత్యధికంగా 80 శాతం పని దినాలను కల్పించిన ఖ్యాతి తెలంగాణకు దక్కిందని మరో విశ్వసనీయ సమాచారం.

తెలంగాణ ప్రభుత్వం గత మూడు మాసాలలో దీని కింద 10.42 కోట్ల వ్యక్తి పని దినాలను కల్పించింది. కరోనా సమయంలో హైదరాబాద్ నుంచి చుట్టు పక్కల గల సొంత జిల్లాలకు చేరుకున్న వారికి ఇది పనులు ఏర్పాటు చేసి ఆదుకున్నది. నగరంలో చదువుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ ఉండిన చాలా మంది విద్యావంతులైన యువత కూడా స్వస్థలాలకు వెళ్లిపోయి నరేగా జాబ్ కార్డులు పొంది పనులు చేయడం గమనించవలసిన విషయం. దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలను ఈ పథకం ఆదుకోడం వల్లనే అక్కడ నిరుద్యోగ రేటు భారీగా తగ్గింది.

యుపిఎ ప్రభుత్వ హయాంలో తీసుకు వచ్చిన నరేగా చట్టం కేవలం శారీరక శ్రమ చేసి పొట్ట పోషించుకునే ప్రజలు అత్యధికంగా ఉన్న మన దేశంలో ఉపాధి, ఉద్యోగాల కల్ప తరువుగా ఉపయోగపడుతున్నది. దీని కింద దిన వేతనం గరిష్ఠంగా రూ. 237, కనిష్ఠంగా రూ. 50 చెల్లిస్తారు. వ్యవసాయ రంగంలో ప్రైవేటు పనులు కరవైన రోజుల్లో ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన మార్గంగా ఇది ఉపయోగపడుతున్నది.

కరోనా కష్టాల నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం ఈ పథకానికి అదనంగా రూ. 40,000 కోట్లు కేటాయించింది. అయితే 202021 కేంద్ర బడ్జెట్‌లో దీనికి కేటాయింపును 13 శాతం తగ్గించి వేశారు. 2019 20 బడ్జెట్ కేటాయింపు రూ. 71,001.81 కోట్లు కాగా వర్తమాన సంవత్సరంలో రూ. 61,500 కోట్లకే పరిమితం చేశారు. కఠోర కరోనా నేపథ్యంలో భారీగా అదనపు నిధులిచ్చి ఆ లోటును మరిపించారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఈ పథకానికి శాశ్వతంగా తెర దించాలని గట్టిగా యోచించింది. కాని కఠోరమైన గ్రామీణ వాస్తవిక స్థితిని అవగాహన చేసుకున్న తర్వాత, సొంత పార్టీ ఎంపి, ఎంఎల్‌ఎల ఒత్తిడితో దీనిని వదులుకునే ఆలోచనకు స్వస్తి చెప్పింది. నరేగా యుపిఎ ప్రభుత్వ వైఫల్యాలకు సజీవ చిహ్నమని వ్యాఖ్యానించిన ప్రధాని నరేంద్ర మోడీయే మనసు మార్చుకోక తప్పలేదు. ఈ పథకం వల్ల ప్రభుత్వానికి కలుగుతున్న అదనపు ఆస్తులు లేవన్న వారే దీనిని వ్యతిరేకించడం మానుకున్నారు.

పై నుంచి కిందికి బొట్లు బొట్లుగా జారే అవకాశాలను అందుకొని బాగుపడడమే ప్రజలకు ఏకైక తరుణోపాయమని నమ్మే మితవాద రాజకీయ పక్షం బిజెపి. నిరంతరం పెట్టుబడిదార్లకు మేలు చేస్తూ తరించే తత్వం దానిది. అయినా శతాబ్దాలుగా దారిద్య్రంలో మగ్గుతున్న నిరక్షరాస్య గ్రామీణ జన బాహుళ్యం బతుకులను మార్చడానికి తగిన వ్యూహం కరవైన బిజెపి పెద్దలు చివరికి ఈ పథకాన్నే తలదాల్చక తప్పలేదు. నరేగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అమలైన అత్యుత్తమ పథకమని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక దశలో మెచ్చుకున్నారు. శ్రమకు తగిన ఫలితమందక రైతులు పడరాని కష్టాలు పడుతూ ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్న పరిస్థితుల్లో వారికి కనీస ఉపాధికి ఢోకా లేకుండా చేసిన ఈ పథకం ఆవశ్యకతను గ్రామీణ మూలాలున్న కమలనాథులు గ్రహించారు. దేశంలోని కార్మికుల్లో సాధారణ స్థాయి నైపుణ్యాలున్న వారు కూడా కేవలం 4.69 శాతమే.

సంప్రదాయ కుల వృత్తులు కూలిపోయి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వేళ్లూనుకున్న ఈ రోజుల్లో గ్రామాల్లో అన్ని రకాల వృత్తుల వారికి నరేగా ఆపద్బంధువైంది. కరోనా కష్ట కాలంలో అది మరింత ఉపయోగపడడం సంతోషించవలసి విషయం. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ గ్రామీణ కార్మికులు, విద్యావంతులైన యువత మరింత మెరుగైన ఉపాధులు, ఉద్యోగాల కోసం మళ్లీ పట్టణాలు, నగరాల వైపు చూస్తారు, తిరిగి వలసలు కడతారు. అయితే కరోనా కల్పించిన నూతన పరిస్థితుల్లో పట్టణ భారతంలో వ్యాపారాలు చాలా వరకు దెబ్బ తిన్నాయి. అందువల్ల అవి తిరిగి కోలుకునేలా చేయాల్సిన బాధ్యత దేశ ఆర్థిక సారథులపై ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News