Sunday, April 28, 2024

చైనాకు బుద్ధి చెప్పడం ఎలా?

- Advertisement -
- Advertisement -

China attacked on Indian soldiers barbaric

 

జూన్ 15, 2020 తేదీ భారతీయులు చైనాను క్షమించరాని తేదీ. గాల్వాన్ లోయలో భారత సైనికులపై చైనా దాడి చేసి అత్యంత అనాగరికంగా 20 మంది సైనికులను హతమార్చింది. యావత్తు దేశం నిర్ఘాంతపోయింది. ఆగ్రహం, ఆవేదన, ఆవేశం అందరిలోనూ కనిపించాయి. చైనా పాల్పడిన ఘోరానికి తగిన జవాబు చెప్పాలి. ఆచరణాత్మకంగా జవాబు ఉండాలి. కేవలం మాటల వల్ల లాభం లేదు. ఆ జవాబు ఎలా ఉండాలనేది ఆలోచించవలసిన విషయం. చైనా పట్ల ఈ ఆగ్రహావేశాలను నిర్మాణాత్మక కార్యకలాపాల వైపు మళ్ళించాలి.

భారత ఆర్ధిక వ్యవస్థను అత్యంత బలమైనదిగా మార్చడానికి ప్రయత్నించాలి. ఒక్కసారి చైనా గురించి ఆలోచిద్దాం. డెన్ జియావోపింగ్ చైనాలో అధికారంలోకి రాకముందు చైనా ఇంత పెద్ద ఆర్థికశక్తి కాదు. కాని డెన్ జియావోపింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత చైనాను ఆర్ధికంగా సూపర్ పవర్‌గా మార్చేశాడు. దాదాపు వందకోట్ల జనాభాను పేదరికం నుంచి బయటపడేలా చేశాడు. వెనుకబడిన దేశాన్ని ప్రపంచంలో సూపర్ పవర్ స్థాయికి తీసుకెళ్ళాడు. కాస్త ఆలోచించండి. ఇదంతా ఎలా జరిగింది.

1991లో భారతదేశం, చైనా రెండు ఒకేస్థాయిలో ఉండేవి. రెండు దేశాల్లోనూ తలసరి ఆదాయం సమానంగానే ఉండేది. కాని డెంగ్ జియావో పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు చైనా తలసరి ఆధాయం మన కన్నా ఐదు రెట్లు ఎక్కువ. చైనా జిడిపి 15 ట్రిలియన్ డాలర్లు. మన జిడిపి 2.5 ట్రిలియన్ డాలర్లు. ఈ ఆర్ధికబలం వారి సైన్యానికి కూడా కొండంత బలంగా మారింది. మనం కూడా దేశ ఆర్ధిక వ్యవస్థను శరవేగంగా దూసుకుపోయే బాటన నడపాలి. అప్పుడే చైనాతో సమానంగా పోటీ పడగలం.

చైనా ఆర్ధిక వ్యవస్థను డెంగ్ జియావో పింగ్ ఎలా ఈ స్థాయికి చేర్చాడు. ఈ విషయమై టోమ్స్ రాశారు. నేను రాసిన పుస్తకంలోను ఈ ప్రగతి మంత్రం గురించి ప్రస్తావించాను. సోవియట్ యూనియన్, జపాన్‌ల నుంచి గ్రహించిన రెండు అంశాలను చైనా అమలు చేసింది. అదెలా జరిగిందన్నది వివరిస్తాను. చైనా 1970 నుంచి 1990 మధ్యకాలంలో భారీగా మిగులును కూడబెట్టింది. దీనికి అవలంబించిన పద్ధతి నిరంకుశంగా వసూ ళ్ళు చేయడం. రైతుల భూములను చవగ్గా కొనేయడం ద్వారా సంపదను కూడబెట్టింది. కార్మికులకు అతి తక్కువ జీతభత్యాలతో పని చేయించడం ద్వారా దోపిడీ కొనసాగించింది.

యువాన్ విలువను కృత్రిమ పద్ధతుల ద్వారా చాలా తక్కువగా ఉండేలా చేసి వినియోగదారులను దోచుకుంది. నిజానికి ఇదే పద్ధతి రష్యాలో స్టాలిన్ కూడా అవలంబించాడు. ఖజానాలో మిగులును భారీగా కూడబెట్టారు. అయితే డెంగ్ జియావోపింగ్ కేవలం రష్యా పద్ధతి మాత్రమే అవలంబించలేదు. రష్యా పద్ధతితో పాటు జపాన్ ఆర్ధిక విప్లవం నుంచి కూడా కొన్ని అంశాలు స్వీకరించాడు. అదేమంటే, విదేశీ పెట్టుబడులు, వాణిజ్యానికి చైనా తలుపులు బార్లా తెరిచారు. డెంగ్ జియావో పింగ్ తాను కూడబెట్టిన మిగులు సంపద అంతా భౌతిక సదుపాయాలు, ఇన్‌ఫ్రాస్టక్చర్ నిర్మాణాలకు ఉపయోగించాడు.

జిడిపిలో 50 శాతం వరకు ఇన్‌ఫ్రాస్టక్చర్‌కు ఖర్చుపెట్టడం కూడా జరిగింది. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి పూర్తి ప్రయత్నాలు చేశారు. చవుకగా భూమి, కార్మికులు, నగదు అన్నీ అందుబాటులో ఉంచారు. ఫలితంగా చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా మారిపోయింది. పాశ్చాత్య పెట్టుబడిదారులు చైనా నుంచి ఎంత ఎక్కువగా ఎగుమతులు చేస్తే చైనాలో అంత ఎక్కువగా సంపద పోగుపడింది. ఎందుకంటే యువాన్ విలువను కృత్రిమ పద్ధతులతో చాలా తక్కువ ఉండేలా చేశారు.

డెంగ జియావోపింగ్ చైనా ఆర్ధిక వ్యవస్థకు ఊపు ఇవ్వడానికి తీసుకున్న చర్యలివి. సోవియట్, జపాన్ ఈ రెండు దేశల పద్ధతులను కలిపి ప్రయోగించాడు. భారతదేశం ఈ స్థాయిలో చైనాకు పోటీ ఇవ్వగలదా? భారతదేశం కూడా చేయగలదు. కాని భారతదేశం చైనా మాదిరి నిరంకుశ దేశం కాదు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది. కాబట్టి రైతులను, కార్మికులను, వినిమయదారులను చైనా మాదిరిగా దోచుకోవడం సాధ్యపడదు. కాని మన వద్ద కూడా భారీ మొత్తంలో సంపద ఉంది. శిస్తుల రూపంలో వసూలయ్యే సంపద, బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నాయి.

ప్రభుత్వరంగ బ్యాంకులు, కార్పొరేషన్లలో భారీ మొత్తాలున్నాయి. కాని నిరర్థక ఆస్తుల్లో పడిఉన్నాయి. మారుతి ఉదాహరణ తీసుకుందాం. మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ ఒక విఫలమైన కార్ల కంపెనీగా ఉండేది. కాని జపాన్ అందులో కొంత పెట్టుబడి పెట్టిన తర్వాత పరిస్థితులు మారాయి. జపాన్‌లోని సుజుకి మోటార్స్ పెట్టిన పెట్టుబడి తక్కువే. సుజుకి మోటార్స్ కేవలం 26 శాతం వాటా కొనుక్కున్నప్పటికీ మారుతీ నిర్వహణ అధికారాలు మొత్తం తీసుకుంది. 1982 నుంచి 1992 వరకు సుజుకి వాటా 50 శాతానికి చేరుకుంది. సుజుకి మోటార్స్‌తో ఈ జాయింట్ వెంచర్ జయప్రదంగా లాభాలు గడించింది. మారుతిలో నిర్వహణ అధికారాలు సుజుకికి అప్పగించడం ద్వారా అద్భుతమైన విజయాలు సాధించడానికి అవకాశం కల్పించడం తెలివైన నిర్ణయంగా రుజువైంది.

మారుతి మోడల్ ఒక్కటే కాదు, బాల్కో, వియస్‌ఎన్‌ఎల్ సంస్థల్లోను ఇదే మోడల్ అవలంబించారు. ఈ సంస్థల్లోనూ ప్రభుత్వం నిర్వహణ బాధ్యతలు వదులుకుంది, కాని ఆర్ధిక యాజమాన్యం తనవద్దనే ఉంచుకుంది. ఈ ప్రయివేటైజేషన్ మోడల్ మంచి ఫలితాలు సాధించింది. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడమూ లేదు, ఆయా సంస్థల యాజమాన్యం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. కాని నిర్వహణ అధికారాలు మాత్రం ప్రయివేటు ప్లేయర్ల చేతుల్లోకి బదలాయిస్తున్నారు.

ఈ పద్ధతి ద్వారా ఆర్థిక మిగులను సాధించవచ్చు. దీంతో పాటు ప్రభుత్వం వాణిజ్య కార్యకలాపాలన్నింటి నుంచి వెనక్కు తొలగాలి. ప్రయివేటు ప్లేయర్ల చేతుల్లో పెట్టాలి. ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, గ్రామీణ వ్యవసాయ రంగం, పట్టణ ఇన్‌ఫ్రాస్టక్చర్ వంటి విషయాలపై పూర్తి శ్రద్ధ చూపించాలి. ఈ చర్యలు మన ఆర్ధిక వ్యవస్థకు కొత్త ఊపు లభించేలా చేస్తాయి. బలమైన ఆర్ధిక వ్యవస్థను సాధించడం ద్వారా మాత్రమే మనం చైనాకు దీటైన జవాబు చెప్పగలం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News