Saturday, April 27, 2024

రాష్ట్రానికి ఒమిక్రాన్ రాలేదు

- Advertisement -
- Advertisement -

Omicron has not entered Telangana: Dr. Srinivasa Rao

అసత్య ప్రచారాలు నమ్మొద్దు

దీనికి వేగంగా వ్యాపించే గుణముంది విమానాశ్రయాల్లో నిఘా పెంచాం అక్కడే ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు పాజిటివ్ వస్తే టిమ్స్‌లో చికిత్స వైరస్ సోకినవారిలో తలనొప్పి, అధిక నీరసం ఇప్పటివరకు వచ్చిన కేసుల్లో ఈ లక్షణాలు స్వల్పమే మాస్క్ ధరించాలి, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డా.శ్రీనివాసరావు

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో, రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రవేశించలేదని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రజలు ఒమిక్రాన్‌పై వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని కోరారు. విమానాశ్రయాల్లో నిఘాను బలోపేతం చేశామని, ఎయిర్‌పోర్టుల్లోనే ఆర్టిపిసిఆర్ పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండేలా చర్యలు తీసుకొని వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని వివరించారు. దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా వంటి దేశాల్లో ఒమిక్రాన్ ఉందని, ఈ నేపథ్యంలో 12 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించామని చెప్పారు. కోఠిలోని ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో మంగళవారం డీహెచ్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 12 దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే విదేశీ ప్రయాణికులందరికీ మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రతి ఒక్కరికీ ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు చేస్తామని తెలిపారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులను గచ్చిబౌలిలోని టిమ్స్ ఐసోలేషన్ సెంటర్‌కు తరలించి, చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

ఇప్పటి వరకు 12 రిస్క్ దేశాల నుంచి 41 మంది ప్రయాణికులు వచ్చారని పేర్కొన్నారు. అందులో యూరప్ 22 మంది, యూకే నుంచి 17 మంది, సింగపూర్ నుంచి ఇద్దరు రాగా.. వీరందరికీ ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు చేశామని, ఇందులో ఎవరికీ పాజిటివ్ రాలేదన్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకు వారిని హోం క్వారంటైన్‌కు తరలించామని చెప్పారు. రాబోయే 14 రోజులు వారి ఆరోగ్యాన్ని హెల్త్ కేర్ సిబ్బంది పరిశీలిస్తారని, ఎవరికైనా లక్షణాలు ఉంటే వారితో పాటు కాంటాక్టులకు పరీక్షలు చేస్తామని తెలిపారు. ఆయా దేశాల నుంచి వచ్చిన వారిలో ఎవరికైనా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయితే వారి నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపుతామని అన్నారు. అలాగే విదేశీ ప్రయాణికుల నుంచి ర్యాండమ్‌గా నమూనాలు సేకరించి, 5 శాతం నమూనాలు తీసుకుని జీనోమ్ సీక్వెన్స్‌కు పంపుతాతామని అన్నారు.

ఒమిక్రాన్‌కు అత్యంత వేగంగా వ్యాపించే గుణం ఉన్నది

ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించి పూర్తిగా సమాచారం లేదని, ప్రాథమికంగా చాలా అత్యంత వేగంగా వ్యాపించే గుణం ఉన్నదని డీహెచ్ తెలిపారు. ఈ కొత్త వేరియంట్‌కు తీవ్రత తక్కువగా ఉందని అన్నారు. ఈ వైరస్ సోకిన బాధితుల్లో తలనొప్పి, అధిక నీరసం లాంటి లక్షణాలుంటున్నట్టు గమనించారని పేర్కొన్నారు. ఒమిక్రాన్‌కు డెల్టా వేరియంట్ కంటే సుమారు ఆరు రెట్లు ఉధృతంగా వ్యాపించే గుణం సమాచారం ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో స్వల్ప లక్షణాలతో కేసులు నమోదయ్యాయని, హాస్పిటల్‌లో చేరే కేసులు తక్కువగా ఉన్నాయన్నారు. కరోనా నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో ఎన్నో వేరియంట్లు అల్ఫా, బీటా, గామా వేరియంట్, డెల్టా వేరియంట్లు చూశామని అన్నారు. ఇందులో ప్రపంచాన్ని వణికించింది డెల్టా వేరియంటేనని తెలిపారు. వైరస్‌లో మ్యుటేషన్లు జరుగుతుంటాయని, ఇప్పటి వరకు మూడు లక్షలకుపైగా మ్యుటేషన్లు కరోనా వైరస్‌లో జరిగాయన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తే ఎన్ని మ్యుటేషన్లనైనా ఎదుర్కొవచ్చని చెప్పారు. కొత్త వేరియంట్‌పై సిఎం కెసిఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారని, సీఎం ఛైర్మన్‌గా కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటైందని వెల్లడించారు. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారిలో ఎవరికి కొవిడ్ నిర్ధరణ కాలేదు.

జాగ్రత్తలు పాటిస్తే ఏ వేరియంట్‌నైనా ఎదుర్కోవచ్చు

ఒమిక్రాన్ హెచ్చరికల నేపథ్యంలో కొత్త వేరియంట్లను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని .. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శ్రీనివాసరావు తెలిపారు. కరోనా పట్ల ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించి, చేతులు శుభ్రంగా ఉంచుకుంటూ కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తే ఏ వేరియంట్‌నైనా ఎదుర్కోవచ్చని అన్నారు. కొవిడ్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడంతోపాటు అన్ని పడకలను ఆక్సిజన్ బెడ్లుగా మార్చామని తెలిపారు. ఆక్సిజన్ రవాణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేశామని అన్నారు. అలాగే పిల్లల కోసం ప్రత్యేకంగా 5 వేల బెడ్లను సిద్ధం చేశామని చెప్పారు.

అలాగే అత్యవసర మందులను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజూ సుమారు 30 వేల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనా కేసులు తగ్గడంతో వ్యాక్సిన్ పట్ల, కరోనా నిబంధనలు పాటించడంలో కొంత నిర్లక్ష్యం ఉన్నట్లు గమనించామని పేర్కొన్నారు. ఏ వేరియంట్ అయినా ఎదుర్కోవడం మన చేతుల్లోనే ఉందని, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం లాంటివి మర్చిపోవద్దని తెలిపారు. కరోనాకు సంబంధించిన సమాచారం కోసం 104 టోల్ ఫ్రీ నెంబర్ లేదా 91541 70960 నెంబర్‌కు వాట్సాప్‌లో సంప్రదించాలని అన్నారు.

ప్రతి ఒక్కరూ విధిగా తీసుకోవాలి

కరోనా మహమ్మారి కట్టడి కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ విధిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని డీహెచ్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత గడువులోగా రెండో డోసు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం తొలిడోస్ తీసుకుని గడువు ముగిసినా రెండో డోస్ తీసుకోని వారు సుమారు 25 లక్షలు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో 90 శాతం మంది మొదటి డోసు టీకా తీసుకోగా, ఇంకా 45 శాతం మంది రెండో డోసు తీసుకున్నారని అన్నారు. డిసెంబర్ 31లోగా రాష్ట్రంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని లక్షంగా పెట్టుకుని, ఆ దిశగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కొవిడ్ పూర్తిగా తగ్గిపోయిందని అశ్రద్ధ చేయడం వల్ల చాలా మంది రెండో డోసు వేయించుకోవడంలో నిర్లక్ష్యం వహించడం మంచిది కాదని హెచ్చరించారు. కరోనా పూర్తిగా పోలేదని, ప్రజలు మరో రెండు మూడు నెలల పాటు అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రస్తుతం పండుగలు, పెళ్లిళ్లు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ తీసుకుని, మాస్క్ ధరించాలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News