Saturday, April 27, 2024

విముక్తి జాతుల విమోచన ఎప్పుడు?

- Advertisement -
- Advertisement -

Over 110 million Denotified tribes living in India

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా నేటికీ అనేక కోట్ల మంది ప్రజలు అనేక కులాలు, జాతులకు చెందినవారు సమాజానికి దూరంగా నివసిస్తున్నారు అని పలు నివేదికలు చెబుతున్నాయి. వీటిలో ‘డీ నోటిఫైడ్ ట్రైబ్స్’ ప్రధానమైనవి. వీరిని ‘డీ-నోటిఫైడ్, నోమేడిక్ ట్రైబ్స్, సెమీ -నోమేడిక్ ట్రైబ్స్’ అని తెలుపుతారు. వీరందరూ కలిపితే మొత్తం 15 కోట్ల మంది వరకూ ఉన్నారు. ప్రస్తుత దేశ జనాభాలో డీ నోటిఫైడ్ ప్రజలు సుమారు 110 మిలియన్ల పైబడి ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం హయాంలోనే వీరి వృత్తులు, చేసే పనులు ముఖ్యంగా నేర ప్రవృత్తి ఆధారంగా చేసుకుని ‘క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్-1871’లో రూపొందించారు. ఈ చట్టం ఆధారంగా ఏ రకమైన అసాంఘిక కార్యకలాపాలు సమాజంలో జరిగినా తరచూ వీరిని వేధించటం, అవమానించడం, అమానుషంగా చితక బాదటం, తరచూ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయమనడం వంటి ఆదేశాలతో వీరి బ్రతుకులు బిక్కుబిక్కు మంటూ గడిపేవారు. ముఖ్యంగా ఈ సమూహాల్లో మహిళలపై హింస, అఘాయిత్యాలు నిత్యకృత్యంగా ఉండేది. దీనికి తోడు వీరికి సరైన ఉపాధి లేకపోవడం వల్ల తరచూ సంచార జీవులుగా జీవితాన్ని కొనసాగించటం పరిపాటిగా ఉంటుంది.
నేటికీ మన సమాజంలో రోడ్ల మీద పాములు ఆడిస్తూ, రకరకాల తమాషాలు, మేజిక్‌లు చేస్తూ, పల్టీ మొగ్గలు, ఏ ఆధారం లేకుండా త్రాడు మీద నడవడం, ఊరు చివర పాత సామాన్లు బాగుచేస్తూ కనపడుతూ ఉంటారు. ఏ కారణం చేతనైనా కొన్ని రోజులు ఏదైనా గ్రామంలో తాత్కాలిక ఇల్లు (లేదా) గుడిసెలు వేసుకొని నివాసం ఉంటే, కొన్ని సందర్భాల్లో ఆ ఊళ్ళోవాళ్ళేపై అధికారులకు ఫిర్యాదు చేయటం నేటికీ కనపడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ విముక్తి జాతుల జీవితాలు చీకటి కమ్ముకుని, కనీస అవసరాలు అయిన కూడు, గుడ్డ, గూడు లేకుండా, కనీసం రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వం లేని పరిస్థితి ఏర్పడింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, బ్రిటిష్ వారి చేసిన 1871 చట్టాన్ని రద్దు చేసి, భారత ప్రభుత్వం ‘డీ నోటిఫైడ్’ ట్రైబ్స్‌గా (హేబిచ్చువల్ అఫెండర్స్ యాక్ట్) మార్పు చేసి, 1952 ఆగస్టు 31 నూతన అధ్యాయాన్ని వీరికి ప్రకటించారు. ఈ రోజు ఈ జాతుల సమూహాలు అన్నియు ‘విముక్తి దివాస్ (లిబరేషన్ డే)’గా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఈ అటవీ జాతుల సమూహాలు, ప్రజలకు రాజ్యాంగం ప్రకారం అన్ని వసతులు కల్పించాలి అని, ముఖ్యం గా విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, స్వేచ్ఛ, సమానత్వంతో జీవించే విధంగా పలు కార్యక్రమాలు ప్రభుత్వాలు, సామాజిక స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తారు. అయినప్పటికీ నేటికీ వీరి పరిస్థితిల్లో అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి చేయబడలేదు.
బ్రిటిష్ చట్టం మారినా 1952లో భారత ప్రభుత్వం చేసిన చట్టంలోనూ అవే పాత వాసనలు కనపడుతూ, సమాజంలో ఎక్కడైనా అవాంఛనీయమైన సంఘటనలు జరిగితే, ముందుగా అభియోగాలు, అరెస్టులు, కేసులు ఈ సమూహల ప్రజల మీదనే ముఖ్యంగా పురుషులపై నమోదు చేయుట అలవాటుగా మారింది. మన దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ విముక్తి జాతులు వారు ఉన్నారు. అయితే వీరి అభివృద్ధికి, కనీస అవసరాలు తీర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నిధులు మంజూరు చేయుట లేదు. ముఖ్యంగా విద్య, ఉపాధి కల్పించక పోవడం శోచనీయం. సుమారు 200 జాతులు ఈ కనీస అవసరాలు లేక అలమటిస్తున్న పరిస్థితి. సరైన నివాసాలు లేకపోవడం వల్ల సంచార జీవులుగా మారటంతో, కనీసం ‘ఆధార్‌కార్డు’, ఓటర్ గుర్తింపు కార్డు, బ్యాంకు అకౌంట్ బుక్ లేకపోవడం వల్ల ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు అందుటలేదు. కనీసం ఆహార ధాన్యాలు కూడా దరిచేరడం లేదు అని ఈ ప్రజలు, వీరి నాయకులు తరచూ తెలుపుతూ ఉన్నారు. ఈ విధంగా సమాజంలో ఆర్థిక, సామాజిక అంతరాలతో, అనుమానాలతో నేటి ఆధునిక భారతదేశంలో ఒక ‘సామాజిక కళంకం’గా వీరు ఉండుట అత్యంత బాధాకరమైన విషయం. ఈ ‘స్టిగ్మా’ను వెంటనే పారద్రోలాలి. వీరిలో ఆత్మవిశ్వాసం కల్పించాలి. ఒకప్రక్క ప్రపంచంలో నాలుగో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అని, బిలియనీర్లలో ముందు వరుసలో, జిడిపి, జి.యస్.టి రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నది చెప్పుకుంటున్న పాలకులకు ఈ విముక్తి జాతుల అభివృద్ధి పట్టదా..? అనే ప్రశ్న పలువురు నుంచి వస్తుంది.
అందుకే మనదేశ అభివృద్ధి, సూచికలు మేడి పండు చూడ మేలిమై ఉండు అన్నట్లు, ‘పైన పొటారం లోన లొటారం’ అన్నట్లు కనపడుతుంది. ఈ వాస్తవాన్ని బహిర్గతం చేస్తూ, ఇటీవల ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యుయన్‌డిపి ప్రకటించిన 2021 ‘మానవ అభివృద్ధి సూచిక (హెచ్‌డిఐ)’లో మన భారతదేశం 132వ స్థానంలో ఉండుట మన అభివృద్ధి స్థాయిని, అసలు రంగును బయటపెట్టింది. అందుకే మన దేశ పాలకులు ఇకనైనా దేశంలో సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయో, వాస్తవ పరిస్థితిని విశ్లేషణ చేయాలి. దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలి. అంతేగానీ, అదానీ అంబానీ (అ, ఆ ద్వయం అభివృద్ధే, అంతా అభివృద్ధి) అభివృద్ధే దేశాభివృద్ధి అని, అందరి అభివృద్ధి అనే భ్రమలు నుంచి బయటపడాలి. ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన అనేక కులాలు జాతులు మతాల వారికి రాజ్యాంగం కల్పించిన అన్ని వసతులు కల్పించాలి. దోపిడీ, అవమానం, అణచివేతల నుండి విముక్తి జాతుల ప్రజలను విడిపించాలి. అప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చింది అని భావించాలి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలి. నేటికీ దేశ వ్యాప్తంగా పలు జైల్లో మగ్గుతున్న ఖైదీల్లో ఎక్కువ మంది సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారే.
ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే. ఆర్టికల్ 15 ప్రకారం జాతి, మత, కుల, ప్రాంతీయ, లింగ భేదం లేకుండా అందరికీ సమాన హక్కులు ఇవ్వటం (ఏ రకమైన వివక్ష చూడరాదు), ఆర్టికల్ 21 ప్రకారం స్వేచ్ఛ ఈ విముక్తి జాతుల ప్రజలందరికీ కల్పించాలి. 2019లో ఆచరణలో పెట్టబోయిన యన్‌పిఆర్, ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ పాపులేషన్ (యన్‌ఆర్‌సి), సిటిజెన్ షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (సిఎఎ) నిజంగా అమలు జరిగితే, ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చిన జనాభా లెక్కలు ఎలా ఉన్నా, మన దేశంలో పుట్టి పెరిగిన ఈ డీ నోటిఫైడ్ ప్రజలు జీవితాలు మాత్రం గందరగోళంగా మారేది అని అనుటలో సందేహం లేదు. వీరిలో చాలా మందికి స్థిర నివాసం ఉండదు. ప్రత్యేకమైన వ్యవస్థలను అందుబాటులోకి తేవాలి. గత కమిటీ నివేదికలు పరిశీలించి అమలు చేయాలి. ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ‘గ్రామీణ వికాస్ కేంద్ర, లోక్ హిత్ సమాజిక్ వికాస్ సంస్థ, అనుభూతి ట్రస్ట్’ వంటివి ఈ డీ నోటిఫైడ్ ట్రైబ్స్ అభివృద్ధికి అనేక రకములైన సేవలు అందించుట జరుగుతున్నది. మన ప్రభుత్వాలు కూడా ఐటిడిఎ వంటి సంస్థలు ఏర్పాటు చేసి, పలు కార్యక్రమాలు చేపట్టారు. కానీ బడ్జెట్‌లో కేటాయింపులు తగినంతగా లేకపోవడం వల్ల గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, నీరు నేటికీ అందని ద్రాక్షవలే ఉండుట బాధాకరం. గిరిజన ప్రాంతాల్లో డోలీలు ద్వారా నేటికీ గర్భిణీను తీసుకుని వెళ్ళటం కళ్ళారా చూస్తూనే ఉన్నాము.
నేరప్రవృత్తి కలవారికి సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలి. ముఖ్యంగా ‘రీ హేబిలిటేషన్ (పునరావాసం)‘కు పెద్ద పీట వేయటం ద్వారా వీరి అభివృద్ధికి బంగారు బాటలు వేయవచ్చు. ముఖ్యంగా వీరికి భూములు కేటాయించి, వ్యవసాయం చేసుకోవడానికి ప్రణాళికలు తయారు చేయాలి. అటవీ సంరక్షణ చట్టం, గిరిజన సంక్షేమ పథకాలు, చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. మైదాన ప్రాంతం నుంచి అభివృద్ధి పేరుతో అటవీ భూముల ఆక్రమిస్తున్న వారిపై, నిబంధనలు అతిక్రమించి అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచడానికి, వారి సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, భాష, లిపి మత విశ్వాసాలు, చిట్కాలు, టెక్నిక్స్ సంరక్షణ చేయాలి. ‘ఆదిమ జాతుల అభివృద్ధి తోనే ఆధునిక సమాజం పురోభివృద్ధి చెందుతుంది’ అని పాలకులు గ్రహించాలి. జీవ వైవిధ్యం కాపాడుటకు, పర్యావరణ పరిరక్షణకు విముక్తి జాతుల సేవలు సదా అత్యావశ్యకం అని అందరూ గుర్తించాలి. ఈ విధంగా దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్న ‘డీ నోటిఫైడ్ ట్రైబ్స్’ అభివృద్ధికి ఇకనైనా రాజ్యాంగ ప్రకారం అన్ని వసతులు కల్పించడంతో పాటు రాజకీయంగా, పాలనలో భాగస్వామ్యం కల్పించుట ద్వారానే పరిపూర్ణ అభివృద్ధి చెందుతారు అని అందరూ గ్రహించాలి.

                                                                                   ఐ.ప్రసాదరావు, 9948272919

Over 110 million Denotified tribes living in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News