Home జాతీయ వార్తలు లష్కరే కాషాయ కంకణం

లష్కరే కాషాయ కంకణం

26/11 Mumbai attacks

 

26/11 ముంబై దాడులలో సరికొత్త కోణం
హిందూ టెర్రర్‌గా మలిచేందుకు పాక్ కుట్ర
కసబ్‌ను సమీర్ చౌదరిగా చూపాలని యత్నం
పట్టుబడ్డ ఉగ్రవాదితో కథ అడ్డం తిరిగింది
మాజీ కమిషనర్ జ్ఞాపకాల సంచలనం
పలు విషయాల ప్రస్తావన

ముంబై : 26/11 ముంబై ఉగ్ర దాడులపై కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ ఉగ్రదాడులను హిందూ ఉగ్రవాద చర్యగా చిత్రీకించాలని లష్కరే తోయిబా ఎత్తుగడలకు దిగిందని వెల్లడైంది. ఈ కీలక విషయాన్ని ముంబై మాజీ పోలీసు కమిషనర్ రాకేష్ మేరియా తమ జ్ఞాపకాల సంపుటిలో తెలిపారు. ఎవరికీ ఎటువంటి అనుమానాలు రాకుండా లష్కరే వర్గాలు దీనిని నిర్వహించాయని ఆయన తమ సంపుటి లెట్ మి సే ఇట్ నౌలో పేర్కొన్నారు. ఈ దాడులలో లష్కరే తరఫున ప్రధానంగా వ్యవహరించిన పాకిస్థానీ ఉగ్రవాది మహమ్మద్ అజ్మల్ కసబ్‌ను బెంగళూరుకు చెందిన సమీర్ చౌదరిగా చూపాలనుకుందని వెల్లడించారు. సమీర్ చౌదరి పేరిట కసబ్ ఈ దాడిలో మరణిస్తే దానిని హిందూ ఉగ్రవాద చర్యగా చూపి, దేశంలో భారీ స్థాయిలో చిచ్చు రగల్చాలని వ్యూహం పన్నారు. అప్పటి ఉగ్రదాడులపై ఆయన సారథ్యంలో దర్యాప్తు జరిగింది. దర్యాప్తు తీరు తెన్నులను, వెలుగులోకి వచ్చిన విషయాన్ని తెలిపిన ఆయన తన సమాచార సేకరణలో కీలక విషయాలు తెలిసినట్లు పేర్కొన్నారు.

పాకిస్థాన్‌కు చెందిన లష్కరే దళం ఈ దాడులకు బాధ్యులని తరువాత స్పష్టం అయింది. కసబ్‌ను జైలులోనే అంతమొందించేందుకు, పాకిస్థాన్ వర్గాలు దావూద్ ఇబ్రహీం ముఠా ద్వారా యత్నించినట్లు తెలిపారు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ, లష్కరేలో ఈ విషయంలో విశ్వ ప్రయత్నాలకు దిగాయి. ఈ దాడుల ఉదంతంలో కీలక సాక్షి అయిన కసబ్ నోరు విప్పితే అసలు రహస్యాలు తెలిసివస్తాయని పాకిస్థాన్ అనేక రకాల ఎత్తుగడలకు దిగింది. హిందూ ఉగ్రవాద చర్యగా ముంబై దాడులను నిర్వహించే క్రమంలో పాకిస్థాన్ చాలా వరకూ విజయవంతంగా ముందుకు సాగింది. చివరి ఘట్టం పూర్తయితే కసబ్ దాడుల దశలోనే అంతమొందితే చౌదరిగా చూపేందుకు అన్ని ఆధారాలను వదిలిపెట్టాలని కూడా రంగం సిద్ధం చేశారు. హిందూ ఉగ్రవాదులే ముంబైని నాశనం చేయాలని చూశారని కల్లోలం సృష్టించాలని చూశారు.

ఇక చనిపోయిన ఉగ్రవాదుల వద్ద నకిలీ గుర్తింపు కార్డులు, భారతీయ చిరునామాలతో ఉన్నట్లు, ఇదంతా కూడా భారత్‌ను ప్రపంచం దృష్టిలో విమర్శల పాలు చేయడానికే అని మాజీ పోలీసు అధికారి తెలిపారు. ఉగ్రదాడి తరువాత కసబ్‌ను పట్టుకున్న దశలో ఉన్న ఫోటోను మీడియాకు వెలువరించరాదని ముంబై పోలీసులు ఎంతగానో యత్నించారని మేరి యా వివరించారు. అయితే కేంద్రీయ దర్యాప్తు సంస్థలు అత్యుత్సాహంతో వ్యవహరించి, తమకు తెలియకుండానే వీటిని పంపించారని తెలిపారు. దాడి ఘటనలో సున్నితమైన అంశాలు ఉన్నందున వెంటనే మీడియాకు వెల్లడి చేయరాదని తాము పట్టు పట్టినట్లు వివరించారు.

కసబ్ రూపం మార్చే చర్యలు
అప్పట్లో వెలువడ్డ ఫోటోలో కసబ్ కుడి చేతి మణికట్టు వద్ద ఎర్రటి కంకణం ధరించి ఉన్నాడు. ఇది హిందువుల ఆచార వ్యవహారాల ప్రతీక. ఈ కంకణం కొట్టొచ్చే రీతిలో కనబడింది. దాడులకు కారకులు హిందువులే అని, వారే ఈ ఉగ్రదాడికి దిగారని తెలియచేయడానికే ఈ పావులు కదిపారని ఈ సంపుటిలో వెల్లడించారు. దీనిని ఆధారంగా చేసుకుని అప్పట్లో తాము మరుసటి రోజు పతాక శీర్షికలలో హిందూ ఉగ్రవాదుల దాడిగా ఘటన వార్తలు వస్తాయని, బెంగళూరు అడ్రసుతో ఉన్న చౌదరి ఇంటివారిని ఇంటర్వూలు చేయడానికి టీవీ జర్నలిస్టులు వరుస కడుతారని తాను భావించానని, అయితే ఇది జరగలేదని, చివరికి కసబ్ పాకిస్థాన్‌లోని ఫరీద్‌కోట వాడిగా ఉగ్రవాద దళంలోని వాడిగా వెల్లడయిందని వివరించారు. అన్నింటికీ మించి కసబ్‌ను సజీవంగా పట్టుకోవడంలో వీరోచితంగా వ్యవహరించి అమరుడు అయిన కానిస్టేబుల్ తుకారామ్ ఒంబ్లే త్యాగం ఎప్పుడూ నిలిచితీరుతుందని తెలిపారు.

కసబ్‌ను సజీవంగా పట్టుకోగలగడం వల్లనే ఇప్పుడు ముంబై దాడుల అసలు రూపం తెలిసిందని, లేకపోతే ఇవి చరిత్రలో హిందూ టెర్రర్‌గా నిలిచి ఉండేవని, దీని ఫలితం ఏ విధంగా ఉండేదనేది తాను చెప్పలేనని విశ్లేషించారు. కసబ్‌కు జిహాద్ గిహాద్ గురించి ఏమీ తెలియదు. అల్లరిచిల్లరిగా తిరిగే ఆయన నేరాలు చేసేందుకు, దొంగతనాలకు వీలుగా ఉంటుందని లష్కరేలో చేరారని తెలిపారు. అంతేకాకుండా భారత్‌లో ముస్లింలపై ఊచకోత జరుగుతోందని, చివరికి వారిని మసీదులలో నమాజులు కూడా చేసుకోనివ్వడం లేదని అక్కడ నూరిపోశారని వివరించారు. దాడుల కోసం ముంబైకి వచ్చిన దశలో మెట్రో సినిమా దగ్గరి మసీదులోని వాతావరణం ఆయనను కంగుతిన్పించిందని, తనకు తెలిసిందేమిటీ? ఇక్కడున్నదేమిటనే డైలమాలో పడ్డాడని తెలిపారు. లష్కరేలో చేరిన తరువాత కసబ్‌కు ఈ దాడి గురించి తెలిపి ముందు వారం రోజుల సెలవు ఇచ్చారు. లక్షా పాతిక వేల రూపాయలు అందించారు.

వీటిని ఆయన తన కుటుంబానికి ఇచ్చి, సోదరి పెళ్లికి వాడాలని తెలిపారు. 2008 నవంబర్ 26వ తేదీన ముంబైలో జరిగిన ఉగ్రదాడి దేశ చరిత్రలోనే అతి భీకర ఉగ్రచర్యగా మారింది. ఈ ఘటనలో 166 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్థాన్ నుంచి సముద్ర జలాల మీదుగా పడవలో పది మంది భారీ స్థాయి సాయుధ ఉగ్రముఠా ముంబైలో నరమేథానికి పాల్పడింది. ఈ ఘటనలో కసబ్ ఒక్కడే సజీవంగా దొరికాడు. ఆయనకు విచారణల అనంతరం 2012 నవంబర్ 21వ తేదీన ఉరిశిక్ష అమలు జరిగింది.

Pak portray 26/11 Mumbai attacks as Hindu terrorism