Saturday, April 27, 2024

పాలమూరు పథకం ఈ శతాబ్ధపు అద్భుత విజయం: మంత్రి హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈ శతాబ్ధపు అద్భుత విజయం అని రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్ రావు అన్నారు. శనివారం ముఖ్యమంత్రి కెసిఆర్ నార్లపూర్ వద్ద పాలమూరు రంగారెడ్డి పథకాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేసిన సందర్భంగా మంత్రి హరీశ్ ట్వీట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అవాంతరాలు అడ్డంకులు అధిగమిస్తూ , కుట్రలను ఛేదిస్తూ ,కేసులను గెలుస్తూ ఈ పథకం కలను సాకారం చేసుకున్నట్టు తెలిపారు. కృష్ణమ్మ నీళ్లు తెచ్చి పాలమూరు ప్రజల పాదాలు కడుగుతానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కు హృదయ పూర్వక కృతజ్ణతలు తెలిపారు.

దశబ్ధాల కల ,తరతరాల ఎదురు చూపులు ,అవన్నీ నెరవేరే సమయం ఆసన్నమైందన్నారు. నెర్రెలు బారిన పాలమూరు నేలను తడిపేందుకు కృష్ణమ్మ పైకెగసి రానుందన్నారు. ఉమ్మడి పాలనలో పాలమూరులో కరువు కాటకాలు ,ఆకలి కేకలు , వలస బతుకులు ,ఒక్కమాటలో చెప్పాలంటే జీవనం విధ్వసం అన్నారు. నాడు పాలకులు మారినా పాలమూరు బతుకులు మాత్రం మారలేదన్నారు. తాగు ,సాగు నీటికి తండ్లాట తప్పలేదన్నారు. కానీ పదేండ్ల స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో పాలమూరు దశ దిశ మారిందని వెల్లడించారు. నదీజలాలు ఎదురెక్కుతూ , చెరువులు తడలు గొడుతూ , వాగులు జాలువారుతూ ,ఎండిన చేల దాహార్తిని తీర్చుతున్నాయన్నారు. పచ్చదనాన్ని పరుస్తున్నాయని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తితో 12లక్షల ఎకరాలకు సాగునీరు అందనుండటం గొప్పవిషయం అన్నారు. ఇది తెలంగాణ సాధించిన ఈ శతాబ్ధపు అద్భుత విజయం అని ,ఇది కెసిఆర్ వల్లనే సాధ్యమైన పాలమూరు జల విజయం అని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News