Thursday, May 9, 2024

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

- Advertisement -
- Advertisement -

Pan India Star Prabhas Birthday Special

రెబల్‌స్టార్ ప్రభాస్… ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్‌లోనే కాదు దేశంలోని అన్ని సినీ ఇండస్ట్రీలో మారుమోగుతోంది. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ ఈ ప్రయాణానికి ముందు తన మార్కు ను క్రియేట్ చేసుకోవడానికి ఎంతో ఓపికగా కష్టపడ్డారు. తొలి చిత్రం ‘ఈశ్వర్’తో హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ యూనివర్సల్ స్టార్ తర్వాత రాఘవేంద్ర, వర్షం, అడవిరాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్‌నిరంజన్, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, రెబల్, మిర్చి వంటి చిత్రాలతో వైవిధ్యాన్ని చూపుతూ ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంటూ హీరో అంటే ఇలాగే ఉండాలనే విధంగా అన్నివర్గాల ప్రేక్షకుల హృదయాల్లో స్టార్‌గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.

‘బాహుబలి’తో యూనివర్సల్ స్టార్‌గా…

ప్రభాస్ కెరీర్‌ను చూస్తే బాహుబలి ముందు, బాహుబలి తర్వాత అని రెండు భాగాలుగా చూడాల్సిందే. ఎందుకంటే ఆయన రేంజ్‌ను ‘బాహుబలి’ అమాంతం పెంచేసింది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన ‘బాహుబలి’ చిత్రంలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా ప్రభాస్ నటించిన తీరు అద్వితీయం. ఆయన తప్ప మరొకరు ఆ పాత్ర చేయలేరనేంత గొప్పగా ఈ సినిమాలో ఒదిగిపోయారు ప్రభాస్. జక్కన్న శైలిని ఒడిసిపట్టుకుని ఆయనపై నమ్మకంతో ఐదేళ్ల పాటు మరో సినిమాలో నటించకుండా ఈ సినిమాకే కట్టుబడి ఉండటం ఆయనలోని అంకితభావాన్ని సూచిస్తుంది. ప్రభాస్ తపన, రాజమౌళి కృషి కలయికే ‘బాహుబలి’. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రంలో తొలి భాగం 2015లో ‘బాహుబలి ది బిగినింగ్’ పేరుతో విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగా వసూళ్ల సాధించి ఇండియన్ సినిమాను టాలీవుడ్‌వైపు తిరిగి చూసేలా చేసింది. అయితే 2017లో విడుదలైన ’బాహుబలి 2’ ఏకంగా రూ.1700 కోట్లకు పైగా వసూళ్ల సాధించి కలెక్షన్స్ సునామీని సృష్టించింది.

అరుదైన గౌరవం…

బ్యాంకాక్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు ప్రతిమను 2017లో ప్రతిష్టించారు. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ‘బాహుబలి’ చిత్రంతో అంతర్జాతీయ గుర్తింపును తెచ్చుకున్న రెబల్‌స్టార్ ఈ మైనపు ప్రతిమతో ప్రపంచస్ధాయి కళాకారుల సరసన చోటు సంపాదించారు.

‘సాహో’తో బాలీవుడ్‌లో హల్‌చల్…

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌తో సుజీత్ దర్శకత్వంలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీ ’సాహో’ని నిర్మించింది. పాన్ ఇండియా ఆర్టిస్టులు, హాలీవుడ్ టెక్నిషియన్స్‌తో రూపొందిన ఈ చిత్రం టాలీవుడ్ ప్రేక్షకులనే కాదు.. బాలీవుడ్‌లో ఆడియన్స్‌ను కూడా మైమరపించింది.

వరుసగా పాన్ ఇండియా మూవీస్…

ప్రభాస్ 20వ చిత్రంగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ పాన్ ఇండియా మూవీని రెబల్‌స్టార్ డా.కృష్ణంరాజు సమర్పణలో గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. బాలీవుడ్ ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని టి. సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ అందిస్తున్నారు. యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ పీరియాడికల్ లవ్‌స్టోరిలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. అలాగే ప్రేరణ అనే పాత్రలో నటిస్తోన్న పూజాహెగ్డే లుక్‌కు కూడా మంచి స్పందన వచ్చింది. జార్జియాలో ఇప్పటికే కీలక సన్నివేశాలకి సంబంధించిన షూటింగ్ పార్ట్‌ని ముగించారు.

తర్వాత ఇటీవల ఇటలీలో చిత్రీకరణను తిరిగి ప్రారంభించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి నిర్మాతలు వంశీ, ప్రమోద్, ప్రసీదలు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ప్రభాస్ హీరోగా ‘మహానటి’ దర్శకుడు నాగ్‌అశ్విన్‌తో ఓ సినిమాను రూపొందిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే నటించనుండగా బిగ్ బి అమితాబ్ కీలక పాత్రను పోషించనున్నారు.

బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ‘ఆదిపురుష్’ అనే ఎపిక్ విజువల్ వండర్ మూవీ చేయబోతున్నారు. రామాయణం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ప్రభాస్‌కు ధీటుగా ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటించనున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు భూషణ్‌కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాదిన ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మూడు క్రేజీ ప్రాజెక్ట్‌లే కాకుండా మరో రెండు సర్‌ప్రైజింగ్ అండ్ షాకింగ్ పాన్ ఇండియా సినిమాలు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News