Monday, April 29, 2024

మొదటిసారి కాగితరహిత బడ్జెట్

- Advertisement -
- Advertisement -

Paperless budget for the first time in Parliament

 

టాబ్లెట్ చూస్తూ నిర్మలా సీతారామన్ ప్రసంగం
సభ్యులందరికీ సాప్ట్‌కాపీలు అందచేత
నిర్మల ప్రవేశపెట్టిన మూడవ వార్షిక బడ్జెట్
బడ్జెట్ ప్రసంగంలో రవీంద్రుడు, తిరుక్కురళ్ ప్రస్తావన

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్‌లో 2021-22 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన తరుణంలో అనేక నూతన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొట్టమొదటిసారి కాగితరహిత బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ఈసారి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం ఒక విశేషమైతే, సభ్యులు భౌతిక దూరం పాటిస్తూ తమకు నిర్దేశించిన స్థానాలలో కూర్చోవడం మరో విశేషం.

లేత మీగడ రంగు అంచుగల ఎరుపు రంగు చీర ధరించిన నిర్మలా సీతారామన్ నిలబడే టాబ్లెట్ చూస్తూ 110 నిమిషాల పాటు తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు. ఆమె ధరించే ఎరుపు రంగు సంచీలో ఈసారి బడ్జెట్ ప్రతులకు బదులు టాబ్లెట్ చేరింది. సభ్యులందరికీ బడ్జెట్ ప్రసంగానికి సంబంధించిన సాఫ్ట్ కాపీలను అందచేశారు.

గతంలో అధికార పార్టీకి చెందిన స్థానాలలో మొదటి వరుసలో ఉండి బడ్జెట్ ప్రసంగం చేసిన నిర్మలా సీతారామన్ ఈసారి మాత్రం రెండవ వరుసలో నిలబడి తన ముందు టేబుల్‌పై అమర్చిన టాబ్లెట్‌ను చూస్తూ బడ్జెట్ పాఠం చదివారు. 110 నిమిషాల సేపు సాగిన ప్రసంగంలో ఆమె మంచినీరు తాగేందుకు మధ్యమధ్యలో స్వల్పంగా విరామమిచ్చారు. టాబ్లెట్‌కు సమీపంలో కొన్ని చాక్లెట్లను కూడా ఉంచారు.

నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన గత రెండు బడ్జెట్‌లతో పోలిస్తే ఈసారి బడ్జెట్ ప్రసంగం చాలా తక్కువ సేపు సాగింది. 2019 జులైలో ఆమె దాదాపు 137 నిమిషాల పాటు ఆమె బడ్జెట్ ప్రసంగం సాగగా 2020లో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నిర్మలా సీతారామన్ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో ప్రసంగాన్ని 160 నిమిషాలకు కుదించాల్సి వచ్చింది. సభ్యుల మధ్య భౌతిక దూరం ఉండేందుకు వీలుగా సీట్లను కేటాయించడంతో రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తోసహా పలువురు కేంద్ర మంత్రులు బడ్జెట్ ప్రసంగ కాలంలో రాజ్యసభలో కూర్చోవలసి వచ్చింది.

వరుసగా మూడవ పర్యాయం కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాలను, తమిళ ప్రాచీనకావ్యం తిరుక్కురళ్ పద్యాలను తన ప్రసంగంలో ఉటంకించారు. పన్నులకు సంబంధించి ప్రకటనలు చేసిన సందర్భంగా అధికార పక్షానికి చెందిన పలువురు సభ్యులు బల్లలు చరిచి తమ హర్షం తెలియచేశారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక మంత్రి వద్దకు వెళ్లి అభినందనలు తెలియచేశారు. ఇతర సభ్యులు కూడా ఆమె వద్దకు వెళ్లి అభినందనలు తెలియచేశారు.

నిర్మలా సీతారామన్ పక్కన కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ఆశీనులు కాగా అదే వరుసలో మరో మంత్రి ప్రహ్లాద్ జోషి కూర్చున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముందు వరుసలో కూర్చున్నారు.

మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇటీవల వరకు అధికార ఎన్‌డిఎలో భాగస్వాములుగా ఉన్న శిరోమణి అకాలీదళ్ సభ్యులు హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, సుఖ్‌బీర్ సింగ్ బాదల్ రైతులకు మద్దతుగా పోస్టర్లు పట్టుకుని నిలబడ్డారు. వీరితో ఆర్‌ఎల్‌పి సభ్యుడు హనుమాన్ బేనీవాల్ మద్దతునిచ్చారు. కొద్దిసేపు నినాదాలు చేసిన అనంతరం వారు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన వెంటనే సభ నుంచి నిష్క్రమించారు.

కాంగ్రెస్ సభ్యుడు రాహుల్ గాంధీ, సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూఖ్ అబ్దుల్లా, ఇతర ప్రతిపక్ష నాయకులు సభకు హాజరయ్యారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాత్రం సభకు హాజరుకాలేదు. బిజెపి సభ్యులు జువల్ ఓరమ్, ధరంబీర్ సింగ్ ప్రతిపక్ష సభ్యుల స్థానాలలో కూర్చున్నారు. బడ్జెట్ ప్రసంగం కొనసాగుతుండగా మధ్యలోనే ములాయం సింగ్ యాదవ్ సభ నుంచి వాకౌట్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News