Monday, April 29, 2024

ప్రజా సేవకుడు మండల పరశురాములు

- Advertisement -
- Advertisement -

పేదను గుర్తించగ మారబోవునదెన్నడో’ కవి ముత్తువేల్ కరుణానిధి గారు రాసిన ఈ కవిత ప్రతి ఒక్కరినీ ఆలోచింప జేస్తుంది. బిడ్డల పాల కొరకు బిచ్చమెత్తుకుంటున్న దేశంలో పసి బిడ్డలకు పాలు అందించరు కానీ.. రాళ్లనే దేవుడిగా భావించి క్షీరాభిషేకం చేస్తారు, కుబేరులున్న దేశంలో కూటికి లేనివాడికి కూడు కరువు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు నశిస్తాయో అని తన ఆవేదనను కవిత ద్వారా అందించారు. కానీ నేటికీ ఇలాంటి పరిస్థితులు కొనసాగుతుండటం బాధాకరమైన విషయం. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కాని ఉన్నన్నాళ్ళు వెతుకుతూ వుంటాడు జీవుడు. ఎవరన్నారో గాని ఆనాడు మానవ సేవయే మాధవసేవనే ఓ మహనీయుడు.సేవే మార్గం అనే సిద్ధాంతాన్ని మనసా వాచా కర్మణా అనే సిద్ధాంతాన్ని సేవా మార్గంగా ఆచరించి చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న అతికొద్ది మంది మహనీయుల్లో మదర్ థెరిసా ఒకరు. నిరుపేద కుటుంబంలో పుట్టిన పరశురాములు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ స్వయం కృషితో ఉన్నత స్థాయికి ఎదిగాడు.

చిన్నప్పటి నుంచి తనకి ఎదురైన సమస్యలు జీవితంలో ఇతరులకు రాకూడదని భావించి చిన్నతనం నుంచే మూర్తీభవించిన మానవత్వంతో సామాజిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారించారు. 8 వ తరగతి చదివే సమయంలో గురువుల స్ఫూర్తితో సమాజ సేవ పట్ల ఆసక్తితో 1981లో భారత్ స్కౌట్స్ & గైడ్స్‌లో చేరాడు. అందులో క్రమశిక్షణ, అంకితభావ నిబద్ధత అలవర్చుకున్నారు. సామాజిక సేవ చేయాలంటే విద్యయే సరైన మార్గమని తెలుసుకుని ఒకవైపు చదువు కొనసాగిస్తూనే పలు సేవ కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాకుండా ఆయన చేసిన సేవలను గుర్తించి 1985లో అప్పటి భారత రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్ చేతుల మీదుగా ప్రెసిడెంట్ స్కౌట్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత అభ్యుదయ సేవా సమితి అనే స్వచ్చంధ సంస్థను ఏర్పాటు చేసి అక్షరాస్యత, బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, బాల్య వివాహాల నివారణ, అక్రమ దత్తత నిలుపుదల, బాలల హక్కుల ఉల్లంఘన నిరోధం వంటి అంశాలలో ఎనలేని కృషి చేశారు.

బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని బాల్య వివాహాలు నిలిపివేయాలని అనేక జిల్లాలో విస్తృత ప్రచారం చేయడమేగాక మహబూబాబాద్ జిల్లా, ములుగు జిల్లా, జనగామ జిల్లా, వరంగల్ జిల్లా పరిసర ప్రాంతాలలో అనేక బాల్య వివాహాలను నిలిపి వేయించారు. అంతేకాకుండా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో 1989లో వరంగల్ జిల్లాలోని నెహ్రూ యువ కేంద్రంలో జాతీయ సేవా వలంటీర్‌గా చేరి యువజన సంఘాలను ఏర్పాటు చేసి క్రీడా కార్యక్రమాలు, చెట్లు నాటించడం కొరకు శ్రమదానం వంటి కార్యక్రమాలను నిర్వహించారు, రాత్రి బడులు నిర్వహించి నిరక్ష్యరాస్యులకు చదువు నేర్పించారు. అక్షరాస్యత కో ఆర్డినేటర్‌గా సమర్ధవంతమైన సేవలందించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యుడిగా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్‌గా పని చేశారు. అతని సేవలకు చిహ్నంగా, జాతీయ, రాష్ట్ర స్థాయి యువజన పురస్కారాలు, నిఖిల్ కొయితారా ఆంతర్జాతీయ అవార్డు, గాడ్ ప్రే ఫిలిప్స్ బాల కార్మికుల నిర్మూలన అవార్డు , ప్రపంచ శాంతి శిఖరాగ్ర పురస్కారం వంటి అనేక ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు ప్రముఖుల చేతులమీదుగా అందుకున్నారు.

నిరుపేద కుటుంబంలో పుట్టి సామాజిక సేవ కార్యక్రమాలు చేయటం అనేది గొప్ప విషయం. ఆయన సేవలు ప్రశంశనీయం, ప్రభంజనం. ఇలాంటి గొప్ప వ్యక్తులు మన రాష్ట్రంలో ఉండడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. పరశురాములు మార్చి 04, 1968న తెలంగాణ రాష్ట్రం, వరంగల్ అర్బన్ జిల్లా, రంగసాయిపేట రైల్వే గేట్ ప్రాంతంలో ఒక నిరుపేద కుటుంబంలో రాములు, ఎల్లమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి ఎజె మిల్లుల్లో దినసరి కూలీ. తల్లి ఎల్లమ్మ బీడీ కార్మికురాలు. ‘ఆత్మే పరమాత్మ’ అని ఆధ్యాత్మికత మనకు బోధిస్తుంది. భక్తితో కొలిచే స్వామిని దర్శించగలగాలి. ప్రతి వ్యక్తిలో దైవత్వాన్ని చూడాలి. పేదలకు సేవ చేయడమే మాధవ సేవ. ఇతరులకు సహాయం చేసి తమను తాము మానవత్వంతో నిరూపించుకున్నవారే గొప్పవారు అవుతారు. సమాజ శ్రేయసు కోరని ఆధ్యాత్మిక సాధన ఫలించదు. ఆహ్లాదకరమైన సత్కార్యాలు చేసేవారిని ఇష్టపడతాడు. అందుకే ‘దయగల హృదయమే భగవంతుని నిలయం’ అన్నారు పెద్దలు. సేవ అనేది సహజ లక్షణంగా ఉండాలి. భగవంతుని అనుగ్రహం కోసం పుణ్యక్షేత్రాలు, గోపురాలను దర్శించుకోవడం మంచిది.

కానీ, నిరుపేదల పట్ల కరుణ చూపకపోతే దేవుడు కూడా సంతోషించడు అనే విషయాన్నీ ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన అవసరముంది. నలుగురితో కలిసి చేసే మంచి పనిలో భాగస్వాములు కావడం గొప్ప లక్షణం. అంతేకాని ప్రచారం, ప్రశంసల కోసం చేసే కార్యక్రమాలను పుణ్యకార్యాలుగా చూడరు. ఏ చిన్నపనైనా నిస్వార్థంగా చేయడం చాలా ముఖ్యం. సమాజంలో సేవ చేసే వారిని ప్రోత్సహించడం అంటే మనం కూడా సేవ చేస్తున్నట్లే. 35 సంవత్సరాలుగా సేవలందిస్తున్న పరశురాములు ప్రతిఒక్కరికి ఆదర్శం కావాలని కోరుకున్నాను.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News