Saturday, May 4, 2024

ఉద్ధవ్ థాక్రేపై శరద్ పవార్ మండిపాటు

- Advertisement -
- Advertisement -

Uddhav-Thackeray

ముంబయి: ఎల్గార్ పరిషద్ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ)కు అప్పగించాలన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నిర్ణయం పట్ల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్గార్ పరిషద్ కేసును చేపట్టవలసిందిగా ఎన్‌ఐఎని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడమే తప్పిదమయితే దానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం ఘోరమైన తప్పిదమని పవార్ శుక్రవారం వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ కలసి మహారాష్ట్ర వికాస్ అఘాడి(ఎంవిఎ) ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే తీసుకున్న నిర్ణయాన్ని పవార్ విమర్శించడం ఇదే మొదటిసారి.

ఈ ఏడాది జనవరి 25న ఎల్గార్ పరిషద్ కేసును ఎన్‌ఐఎకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా 2018లో నమోదు చేసిన ఈ కేసును ఎన్‌ఐఎకి బదిలీ చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. కాగా, కొల్హాపూర్‌లో మీడియా సమావేశంలో పవార్ శుక్రవారం మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, రాష్ట్ర వ్యవహారాలలో కేంద్రం చొరబడడం అక్రమమని అన్నారు. కేంద్ర నిర్ణయమే తప్పయితే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం ఘోర తప్పిదమని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా ఉండగా, ఎన్‌సిపికి చెందిన రాష్ట్ర హోం మంత్రి అనీల్ దేశ్‌ముఖ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తన విచక్షణాధికారాలను ఉపయోగించి ఎన్‌ఐఎకి ఈ కేసును అప్పగించడానికి ఆమోదం తెలిపారని చెప్పారు.

Pawar criticizes Uddhav Thackeray, Elgar Parishad case should not have handedover to NIA, says Sharad Pawar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News