Saturday, May 11, 2024

పోడు భూములపై గిరిజనులకు శాశ్వత హక్కు

- Advertisement -
- Advertisement -
  • రాష్ట్రవ్యాప్తంగా 4లక్షల 4వేల ఎకరాలకు పోడు పట్టాల పంపిణీ
  • అటవీ ప్రాంత విస్తీర్ణంలో 10.71శాతం పంపిణీతో దేశంలోనే నంబర్‌వన్
  • కాంగ్రెస్, బిజెపిలు గిరిజనులను కేవలం ఓటుబ్యాంకుగానే గుర్తించారు
  • తెలంగాణలో అభివృద్ధి లేదంటున్న మోడీ కేంద్రంలో రాష్ట్రానికి అవార్డులెందుకిచ్చారంటూ ప్రశ్న
  • ఢిల్లీలో అవార్డులు… గల్లీలో తిట్లు…ఇది మోడీ నైజం
  • రాష్ట్రానికి రావాల్సిన నిధులను, పరిశ్రమలను గుజరాత్‌కు మళ్లీస్తున్నారు
  • దమ్ము, ధైర్యం ఉంటే తెలంగాణ అభివృద్ధిపై చర్చకు రమ్మని కేంద్రానికి మంత్రి సవాల్
  • ఈడి, సిబిఐ లాంటి ఏజెన్సీలతో ఎన్ని దర్యాప్తులు జరిపించిన చివరికి విజయం మాదే
  • పోడు పట్టాల పంపిణీ చేసిన మంత్రి హరీశ్‌రావు

మెదక్: ఏళ్ల తరబడి సాగు చేసుకున్నప్పటికి భూమికి హక్కుదారులు కాలేక పోయిన గిరిజనులకు శాశ్వత హక్కు కల్పిస్తూ పోడు భూములకు పట్టాలు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్‌దేనని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారంనర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని గిరిజనులకు పోడుభూముల పట్టాలు అందించే కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డిలతో కలసి మంత్రి హరీశ్‌రావు పాల్గొని పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ…. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటవీ ప్రాంత విస్తీర్ణంలో 10.71శాతం భూమికి పోడు పట్టాలను పంపిణీ చేసి దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో నిలిచిందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 4వేల ఎకరాల పోడు భూములకు తెలంగాణ ప్రభుత్వం శాశ్వత పట్టాలను అందజేస్తూ ఈ భూములపై సర్వాదికారాలు కల్పిస్తూ యజమానులుగా తీర్చిదిద్దిందన్నారు. అందులో భాగంగానే మెదక్ జిల్లాలో 517 ఎకరాలకుగాను 610 మంది గిరిజనులకు పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నామన్నారు. పట్టాలు పొందిన గిరిజనులు భూమిపై సర్వహక్కులను కలిగి ఉండి యజమానులుగా మారడమే కాకుండా ఇట్టి భూమిపై వారసత్వపు హక్కు కలిగి ఉంటారన్నారు. ఈ పట్టా పొందిన రైతులకు పది లాభాలు ఉన్నాయని, అందులో హక్కుదారు, రైతుబంధు, రైతుబీమా, వారసత్వం, ఉచిత విద్యుత్, సబ్సీడి, పంట నష్టానికి పరిహారం, అటవీశాఖ కేసుల ఎత్తివేత, రుణమాఫీ, పట్టా పాస్‌బుక్‌లను పొందుతారన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో మూకుమ్మడిగా కలిసి వచ్చి ఉద్యమానికి చేయూతనిచ్చిన వారిలో గిరిజనులే ప్రధానంగా నిలిచారన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం గిరిజనులకు పదిశాతం విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించడంతోపాటు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు 20 లక్షల స్కాలర్‌షిప్‌ను అందజేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3146 గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి స్వయంపాలనకు అవకాశం కల్పించిన ఘనత సిఎం కెసిఆర్‌దేనన్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో 63 తండాలు గ్రామపంచాయతీలుగా మారాయన్నారు. గిరిజనుల కోసం 92 రెసిడెన్షియల్ విద్యాలయాల్లో నాణ్యమైన విద్యను అందజేస్తూ వారి అభివృద్ధి కోసం సిఎం కెసిఆర్ ఎంతో చొరవ చూపుతున్నారని అన్నారు.

కాంగ్రెస్, బిజెపి పార్టీలు బిఆర్‌ఎస్‌ను తిట్టడం తప్ప చేసిందేమిలేదని గతంలో గిరిజనులను ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణించేవారన్నారు. ప్రధానమంత్రి మోడీ రాష్ట్రానికి వచ్చి తెలంగాణలో అభివృద్ధే జరగలేదని సిఎం కెసిఆర్ చేసిందేమిలేదని అంటున్నాడు, మరీ అలాంటప్పుడు కేంద్రంలో రాష్ట్రానికి అన్ని విభాగాల్లో అవార్డులు ఎలా ఇచ్చారని ఈ సందర్భంగా ప్రధానమంత్రిని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర పథకాలను కేంద్రం కాపీ కొడుతూ దేశమంతా అమలు పరచడాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఏవరేమిటో వారికి బాగా తెలుసన్నారు. తెలంగాణపై కక్ష సాదింపు చర్యలో భాగంగానే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంద్రలో బిజెపి సర్కార్ కలిపి పైశాచిక ఆనందం పొందిందన్నారు. ప్రస్తుతం కెసిఆర్ ఎజెండా అన్ని రాష్ట్రాల్లో లెవనెత్తడం వల్లనే బిజెపికి వెన్నులో భయం పుట్టిందన్నారు.

తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే మోడీ కళ్లల్లో మంటలు పుట్టి ఓర్వలేకపోతున్నాడని అన్నారు. నిజంగా కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని కోరారు. కేంద్రంను కోచ్ ప్యాక్టరీ అడిగితే వ్యాగన్ యూనిట్ మాత్రమే ఇచ్చి మనకు రావాల్సిన పరిశ్రమలను గుజరాత్‌కు మల్లించుకుంటున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణకు పెట్టుబడులు వస్తుంటే అవన్నీ కేవలం కెసిఆర్ గొప్పతనమేనని తెలిపారు. బోరు మోటార్లకు మీటర్లు బిగిస్తామంటే సిఎం వద్దన్నందుకు రాష్ట్రానికి రావాల్సిన లక్ష కోట్ల రూపాయలను ప్రధానమంత్రి ఆపారని, ఇతర ప్రాజెక్టులు కూడా ఇక్కడికి రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. అంతేకాకుండా తనవద్ద ఉన్న ఈడి, సిబిఐ లాంటి ఏజెన్సీలను అడ్డుపెట్టుకుని కక్షసాధిస్తున్నారని, దమ్ము, దైర్యం ఉంటే తెలంగాణ అభివృద్ధిపై చర్చకు రమ్మని సవాల్ విసిరారు.

అంతిమంగా న్యాయమే గెలుస్తుందని కేంద్రం ఎన్ని ఏజెన్సీల ద్వారా దర్యాప్తులు చేయించిన చివరకు తెలంగాణ ప్రభుత్వమే గెలుస్తుందని, తెలంగాణ ప్రజలంతా మాకే అండగా ఉంటారని దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జాయింట్ కలెక్టర్ రమేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్, ఆత్మకమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ రాజు యాదవ్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఎంపిపిలు, జడ్పిటిసిలు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News