Thursday, May 9, 2024

ప్లాస్మాథెరపీ ప్రమాదకరం

- Advertisement -
- Advertisement -

Plasma therapy

 

నిర్ధారణ కాకుండా అనుసరించడం కరోనా బాధితుడి ప్రాణాలకే ప్రమాదం
కేంద్రం స్పష్టీకరణ

న్యూఢిల్లీ: కరోనా సోకిన వారికి వ్యాధి నయం చేసేందుకు పలు రాష్ట్రాలు ప్రయోగాత్మకంగా అనుసరిస్తున్న ప్లాస్మా థెరపీపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ప్లాస్మా థెరనీ నిర్ధారిత చికిత్సా విధానం కాదని, ఇది కేవలం ప్రయోగాత్మక దశలోనే ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్)ప్లాస్మా థెరపీపై పరిశోధన జరుపుతోందని కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతానికైతే ప్లాస్మా థెరపీ నిరూపిత విధానం కాదని, ఈ విధానాన్ని ఎవరూ అనుసరించవద్దని సూచించింది. ప్లాస్మా చికిత్సా విధానాన్ని అనుసరించడం కరోనా బాధితుడడికి ప్రమాదకరమని,అంతేకాకుండా ఇది చట్టవిరుద్ధమని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మంగళవారం విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు. ప్లాస్మా థెరపీ ప్రయోగ దశలోనే ఉందని , కరోనాకు ఇదే చికిత్సా విధానమని ఎలాంటి ఆధారాలు లేవని ఆయన తెలిపారు. ప్లాస్మా థెరపీపై జాతీయ స్థాయిలో ఐసిఎంఆర్ అధ్యయనం చేస్తోందని చెప్పారు.

ఐసిఎంఆర్ అధ్యయనం పూర్తయ్యే వరకు,ఈ చికిత్స సరైనదని నిర్ధారణ అయ్యేంతవరకు ప్లాస్మాథెరపీని కేవలం ప్రయోగపరంగానే అనుసరించాలని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా బాధితుడికి ప్లాస్మా థెరపీని సరైన మార్గదర్శకాలు పాటించకుండా అందిస్తే అతని ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని లవ్ అగర్వాల్ హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు ప్లాస్మాథెరపీని అనుసరిస్తున్నాయి. ప్లాస్మాథెరపీ జరిపిన కరోనా బాధితుల్లో చాలా మంది కోలుకున్నట్లు కూడా వార్తలు రావడంతో ప్లాస్మా ఇవ్వడానికి పలువురు దాతలు ముందుకు వస్తున్నారు కూడా. అయితే కేంద్రం తాజా ప్రకటనతో ఆయా రాష్ట్రాలు డైలమాలో పడ్డాయి.

23.4 శాతానికి పెరిగిన రికవరీ రేటు
ఇదిలా ఉండగా దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కోవిడ్19 బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయానికి దేశవ్యాప్తంగా మొత్తం 29,974 కేసులు నమోదయ్యాయి. వీరిలో 937 మంది మరణించగా, 7.026 మంది కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 23.44 శాతంగా ఉందని లవ్ అగర్వాల్ చెప్పారు. గత 24 గంటల్లో కొత్తగా 51 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోగా వీరిలో 27మంది ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నారు. గుజరాత్‌లో 11 మంది, మధ్యప్రదేశ్‌లో ఏడుగురు, రాజస్థాన్‌లో అయిదుగురు, జమ్మూ, కశ్మీర్‌లో ఒకరు చనిపోయారు. మొత్త మరణాల్లో369 మరణాలతో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉండగా గుజరాత్ 162, మధ్యప్రదేశ్ 113,ఢిల్లీ 54,రాజస్థాన్ 46, ఆంధ్రప్రదేశ్, యుపిలు చెరి 31 మరణాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముంబయిలోని అతిపెద్ద మురికివాడ అయిన ధారవిలో కరోనా మరణాలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిపోయాయి.

మంగళవారం ఒక్క రోజే అక్కడ 42 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 330కి చేరుకుంది. కాగా మంగళవారం అక్కడ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 112 మంది పోలీసులకు కరోనా సోకింది. గత వారంలో ముంబయిలో ముగ్గురు కానిస్టేబుళ్లు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. కాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సెంట్రల్ జైల్లో కొత్తగా మరో తొమ్మిది మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు కరోనా బారిన పడిన మొత్తం ఖైదీల సంఖ్య 19కి చేరుకుంది. మరో వైపు పశ్చిమ బెంగాల్‌లో గత 24 గంటల్లో కొత్తగా 28 కరోనా కేసులు నమోదైనాయి.

దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 522కు చేరుకుంది. కేరళలో మంగళవారం కొత్తగా నాలుగు కేసులు నమోదైనాయి. మరో వైపు తమిళనాడులో కొత్తగా 121 కరోనా కేసులు నమోదైనాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2058కు చేరుకుంది. మంగళవారం మరణించిన ఒకరితో కలుపుకొని ఇప్పటివరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 25కు చేరుకుంది. కాగా ఇప్పటివరకు 1128 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గత 28 రోజుల్లో 17 జిల్లాల్లో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని లవ్ అగర్వాల్ చెప్పారు.

 

Plasma therapy at Experimental stage
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News