Sunday, April 28, 2024

మోడీకి ఆర్డర్ ఆఫ్ ది నైల్ అవార్డు ప్రదానం

- Advertisement -
- Advertisement -

కైరో : ఈజిప్టులో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్రమోడీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం “ ఆర్డర్ ఆఫ్ ది నైల్ ” లభించింది. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్‌సిసి దీనిని అందజేసి సత్కరించారు. దేశంతోపాటు మానవాళికి విశేష సేవలు అందించే వివిధ దేశాల అధినేతలు, రాజులు, ఉపాధ్యక్షులకు ఈ పురస్కారం అందిస్తున్నారు. 1915లో దీన్ని ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రధాని మోడీకి ఇది 13 వ పురస్కారం కావడం విశేషం. మూడు చదరపు బంగారు యూ నిట్లతో కూడిన స్వచ్ఛమైన బంగారు కాలర్‌తో ఉండే ఈ పురస్కారంపై గత చారిత్రక వైభవాన్ని గుర్తు చేసే ఫారోనిక్ పాలకుల సంకేతాలు ఉండడం విశేషం.

మొదటి యూనిట్ దుష్టశక్తుల నుంచి దేశాన్ని రక్షించే ఉద్దేశాన్ని ప్రతిబింబించగా, రెండో యూనిట్ నైలు తీసుకువచ్చే వైభవాన్ని, ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది. మూడో యూనిట్ సంపదను, సహనాన్ని సూచిస్తుంది. ఈ మూడు యూనిట్లు మణులు, రత్నాలు పొదిగిన వృత్తాకార బంగారు పుష్పంతో ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. ఈ పతకం మధ్యలో నైలునది పొడుచుకు వచ్చినట్టుండే చిహ్నం ఉంటుంది. అది ఉత్తర (బెరడు)దక్షిణ (కమలం) భాగాలను కలిపినట్టు కనిపిస్తుంది.
ప్రాచీన మసీదు మోడీ సందర్శన
ఈజిప్టులో అతి ప్రాచీన మసీదు అయిన అల్ హకీం ను ప్రధాని మోడీ సందర్శించారు. మసీదు ప్రార్ధన మందిరం గోడలు, తలుపులపై చెక్కిన శాసనాలను పరిశీలించారు. 11 వ శతాబ్దానికి చెందిన ఈ మసీదులో ఇటీవలనే పునరుద్ధరణ పనులు చేపట్టారు. దావూదీ బోహ్రా వర్గానికి చెందిన మతపెద్దలు ఈ పనుల గురించి మోడీకి వివరించారు. 11 వ శతాబ్దంలో కైరో లోనే అతిపెద్ద మసీదుల్లో ఈ మసీదు ఒకటి. వెయ్యేళ్ల చరిత్ర కలిగి ఉంది. 13,560 చదరపు మీటర్ల పరిధిలో విస్తరించింది. ఇందులోని ప్రార్ధనా మందిరమే 5000 చదరపు మీటర్ల పరిధిలో విస్తరించింది. ఫాతిమిద్‌కు (అరబ్ మూలాలున్న ఇస్మాయిలే షియా వర్గం ) చెందిన దావూదీ బోహ్రా వర్గం వారు ఇటీవల దీన్ని పునరుద్ధరించారు. భారత్‌లో ఈ వర్గం జనాభా సుమారు 5 లక్షల వరకు ఉంటుంది.
గిజా పిరమిడ్ల సందర్శన
ఈజిప్టు రాజధాని శివారులో ఉండే ప్రపంచ ప్రఖ్యాత గిజా పిరమిడ్లను ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం సందర్శించారు. ప్రపంచం లోని ఏడు వింతల్లో పిరమిడ్లు ఒకటి. ఉత్తర ఈజిప్టు లోని అల్ జియా సమీపాన నైలు నది పశ్చిమ తీరంలో ఈ పిరమిడ్లు ఉన్నాయి. నాల్గవ ఫారో చక్రవర్తుల వంశానికి చెందిన ఈ పిరమిడ్లు మూడింటిని మోడీ సందర్శించారు. ఈజిప్టు ప్రధాని మొస్తాఫా మాడ్‌బౌలీ కూడా మోడీని అనుసరించారు. నాల్గవ ఫారో చక్రవర్తి ఖుపూకు చెందిన గిజా పిరమిడ్ల గొప్పతనాన్ని మోడీ అడిగి తెలసుకున్నారు. ఈజిప్టు పిరమిడ్లలో ఇదే చాలా పెద్దది. క్రీస్తుపూర్వం 26 వ శతాబ్దంలో దీన్ని 27 సంవత్సరాల పాటు నిర్మించారు. ఇన్నేళ్లయినా చెక్కు చెదరకుండా ఉండడం విశేషం.
హెలియోపోలిస్ యుద్ధ స్మశాన వాటిక సందర్శన
మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్టు, పాలస్తీనాల్లో భారతీయ సైనికులు వీరోచితంగా పోరాడి చరిత్ర సృష్టించారు. ఆనాడు ప్రాణాలర్పించిన భారతీయ యోధుల స్మారక చిహ్నం కైరోలో హెలియో పోలిస్ కామన్‌వెల్త్ యుద్ధ స్మశాన వాటికగా ఉంది. కైరో లోని హెలియో పోలిస్ యుద్ధ స్మశాన వాటికను ఆదివారం మోడీ సందర్శించి పుష్పాంజలి ఘటించారు. అక్కడ సందర్శకుల పుస్తకంలో మోడీ సంతకం చేశారు. దాదాపు 4300 మంది భారతీయ యోధులు ఇక్కడ ప్రాణాలర్పించారు. కామన్‌వెల్త్ వార్ గ్రేవ్స్ కమిషన్ ఈ స్మశాన వాటికను నిర్వహిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం నాటి 1700 కామన్‌వెల్త్ సైనికుల సమాధులు కూడా ఇక్కడ ఉన్నాయి.

 

రా’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News