Monday, April 29, 2024

వేరే దిక్కులేకే గ‘మండియా’ మహిళా బిల్లుకు ఓటేసింది

- Advertisement -
- Advertisement -

భోపాల్ : కాంగ్రెస్, ‘గమండియా’ మిత్రపక్షాలు వేరే గత్యతరం లేకనే ఇప్పటి మహిళా బిల్లుకు విధిలేని స్థితిలో మద్దతు ఇచ్చాయని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో సోమవారం ప్రధాని మోడీ అప్రకటిత ఎన్నికల ప్రచార సభలో ఇండియా కూటమి పార్టీలపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్‌లో ప్రధాని మోడీ కాంగ్రెస్‌ను తుప్పుపట్టిన ఇనుపకడ్డీగా పేర్కొన్నారు. తమ ప్రభుత్వం దేశంలోని మహిళలకు తగు న్యాయం కోసం 33 శాతం కోటా తెచ్చిందని గుర్తు చేశారు. దీనితో కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాల అహంకార పూరిత గమండియా గూబ అదిరినట్లు అయిందన్నారు. బిల్లును వారు అవుననలేరు, కాదనలేని పరిస్థితి ఏర్పడిందని, ఈ విధంగా తటపటాయింపుల నడుమనే ఏదో మొక్కుబడిగా పార్లమెంట్‌లో ఈ బిల్లుకు మద్దతు తెలిపారని చెప్పారు. ఈ పార్టీలను నమ్మవద్దని , వీరికి తగు అవకాశం తిరిగి స్థానం కల్పిస్తే ఈ బిల్లును ఉపసంహరించుకుంటారని ప్రజలను హెచ్చరించారు.

బిజెపి కార్యకర్తల సమావేశం కార్యకర్త మహాకుంభ్‌లో ప్రధాని మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ ఎప్పుడూ తన పాత వైఖరిని వీడని తుప్పు ఇనుము బాపతు అని , ఈ పార్టీని ఇప్పుడు నడిపిస్తున్నది పార్టీ నేతలు కాదని, అర్బన్ నక్సల్స్ అని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పట్టం కట్టినట్లు అయితే రాష్ట్రాన్ని తిరిగి మునుపటి బీమార్ (వెనుకబడిన) కేటగిరికి తీసుకువెళ్లి తీరుతారని వ్యాఖ్యానించారు. జనసంఘ్ సహ వ్యవస్థాపకులు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి నేపథ్యంలో బిజెపి కార్యకర్తల సదస్సు ఏర్పాటు అయింది. నారీశక్తి ఏమిటనేది కాంగ్రెస్‌కు తాము చూపించామని , ఇంతకాలం ఈ బిల్లుపై ఏదో కారణాలు చెప్పి నెగ్గడం లేదని తప్పించుకున్న పార్టీలకు తమ పార్టీ సరైన జవాబు రుచిచూపిందని తెలిపారు. బిల్లుకు ఆమోదంతో మోడీ హైతో ముంకిన్ హై అని చాటిందని, మోడీ అంటేనే గ్యారంటీల అమలుకు గ్యారంటీ అని మోడీ ఈ సభలో ప్రకటించారు. కాంగ్రెస్ ఇతర పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఈ బిల్లును ఎందుకు తీసుకురాలేకపొయ్యాయి? తీసుకువచ్చినా ఎందుకు నెగ్గించలేకపోయ్యాయని ప్రశ్నించారు.

రాజస్థాన్ కాంగ్రెస్ సర్కారుకు సున్నా మార్కులే
ప్యాకేజీలు, లీకేజీల మాఫియాలుః మోడీ
రాజస్థాన్‌లో గెహ్లోట్ సారధ్యపు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో జీరో మార్కులు తెచ్చుకుందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాజస్థాన్‌లో సోమవారం ఆయన ఓ సభలో మాట్లాడారు. గెహ్లోట్ ప్రభుత్వం రాష్ట్ర రాజస్థానీ యువత ఐదేళ్ల జీవితాన్ని నీరుగార్చిందని, వారికి ఎటువంటి భద్రత కల్పించలేకపోయిందని విమర్శించారు. ఇక్కడి యువత భవితను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇదొక్కటే కాదు, ఇక్కడి రెడ్‌డైరీ ఇతర విషయాలతో వెలుగులోకి వచ్చిన అంశాలతో ఇక ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపాల్సిన అవసరం ఏర్పడిందని పిలుపు నిచ్చారు. యువతకు ఎటువంటి జీవిత భద్రత కల్పించలేదు.

పైగా నియామకాల పరీక్షల లీకేజీల మాఫియాలకు ఊతం ఇస్తూ వారి భవితను మరింత చీకట్లోకి నెట్టిందని విమర్శించారు. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వానికి యువత ఇతర వర్గాల నుంచి సున్నా మార్కులే పడాల్సి ఉంటుందని చెప్పారు. బిజెపి తలపెట్టిన పరివర్తన్ సంకల్ప్ మహాసభను ఇక్కడ నిర్వహించి రాష్ట్రంలో జరిగిన నాలుగు పరివర్తన్ యాత్రల ముగింపు పలికారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడం కాంగ్రెస్‌కు చేతకాదు . ఇక మహిళకు సాధికారత ఉద్ధేశం వీరికి అసలుకే లేదని, ఈ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు ఈ బిల్లు ఎందుకు అమలులోకి తేలేకపోయ్యారని ప్రశ్నించారు. మహిళల నుంచి చీత్కారాలు తలెత్తుతాయనే భయంతోనే ఈ బిల్లుకు ఇప్పుడు మద్దతు ఇచ్చారని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News