Tuesday, April 30, 2024

ఇది ప్రజా విజయం

- Advertisement -
- Advertisement -

PM Narendra Modi address to the nation

అక్టోబర్ 21దేశ చరిత్రలో నూతన అధ్యాయం
100 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందరి ప్రశ్నకు సమాధానం చెబుతున్నాయి
జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ: టీకా పంపిణీలో 100 కోట్ల డోసులు అనేది కేవలం సంఖ్య కాదు, దేశ సంకల్ప బలం. దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం, నవ భారతానికి ప్రతీక’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు. కరోనా మహమ్మారి కట్టడి చేసే వ్యాక్సినేషన్‌లో సరికొత్త చరిత్రను లిఖించిన సందర్భంగా ప్రధాని శుక్రవారం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశప్రజల కర్తవ్య దీక్ష వల్లే ఈ లక్షాన్ని చేరుకున్నామన్నారు. విఐపి సంస్కృతికి తావు లేకుండా ప్రతి ఒక్కరికీ టీకాలు అందజేస్తున్నామన్నారు. దేశంలో వ్యాక్సినేషన్‌పై ఎదురైన ఎన్నో సవాళ్లు, ప్రశ్నలకు ‘శతకోటి ఘనతే’ సమాధానమని చెప్పుకొచ్చారు. ‘ కరోనా మహమ్మారి మనకు అతిపెద్ద సవాలు విసిరింది. ఇంత పెద్ద దేశానికి టీకాలు సరఫరా చేయడం అనేది నిజంగా పెద్ద సవాలే. దాన్ని అధిగమించి నేడు వంద కోట్ల మైలురాయిని దాటాం. ఇది ప్రజల విజయం. కరోనా వ్యాక్సిన్ల ద్వారా భారత శక్తి ఏమిటో ప్రపంచానికి చూపించాం. మన ఫార్మా సామర్థం ప్రపంచానికి మరోసారి తెలిసింది. మన శాస్త్రవేత్తలు వ్యాక్సిన్లను అభివృద్ధి చేసి పరీక్షలు జరిపారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యాక్సిన్లను రూపొందించారు. శాస్త్రవేత్తలు కృషి ఫలితంగానే స్వదేశీ వ్యాక్సిన్లను అతిత్వరగా అందుబాటులోకి తీసుకు రాగలిగాం’ అని ప్రధాని తెలిపారు. సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్‌తోనే ఈ లక్షాన్ని సాధించగలిగామన్నారు. ‘ టీకా పంపిణీలో విఐపి సంస్కృతికి తావు ఇవ్వకుండాప్రతి ఒక్కరినీ సమానంగా చూశాం. మహమ్మారి వివక్ష చూపించనప్పుడు వ్యాక్సినేషన్‌లోనూ వివక్ష ఉండకూడదని భావించాం. పేద, ధనిక తేడా లేకుండా అందరికీ టీకా ఇచ్చాం. సాంకేతిక పరిజ్ఞానం వల్ల మారుమూల గ్రామాలకు కూడా టీకాల సరఫరా సాధ్యమైంది. పెద్దపెద్ద దేశాల్లో టీకా పంపిణీ ఇప్పటికీ సమస్యగానే ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో టీకాలు తీసుకోవడానికి ప్రజలు ఇంకా ముందుకు రావడం లేదు. అలాంటిది భారత్‌లో వంద కోట్ల డోసులు వేయించగలిగాం. అది కూడా అందరికీ ఉచితంగానే అందించాం. ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో అందరికీ టీకా సాధ్యమా, టీకాలు ఎక్కడినుంచి తీసుకు వస్తారు అని ప్రశ్నించిన వారున్నారు. వాటన్నిటికీ నేటి 100 కోట్ల మైలురాయే సమాధానం’ అని మోడీ తెలిపారు.

వ్యాక్సిన్ల విజయంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. మన కంపెనీలకు బాగా పెట్టుబడులు వస్తున్నాయి. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తున్నాయి’ అని ప్రధాని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మేడిన్ ఇండియా వస్తువులకు ప్రాధాన్యత పెరిగింది. స్వచ్ఛ భారత్ ఎలా ప్రజా ఉద్యమంగా కొనసాగుతూ ఉందో భారత్‌లో తయారైన, భారతీయులు తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేయడం అలవాటుగా చేసుకోవాలన్నారు. అయితే వంద కోట్ల డోసులు పంపిణీ చేసినప్పటికీ కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోలేదని ప్రధాని ఈ సందర్భంగా హెచ్చరించారు. రాబోయే దీపావళి పండగను దేశప్రజలంతా జాగ్రత్తగా జరుపుకోవాలన్నారు. ప్రతి ఒక్కరిలోనూ విశ్వాసం, ఉత్సాహం కనిపిస్తోంది. అయితే రక్షణ కవచం ఉంది కదా అని నిర్లక్షం వద్దు. కొవిడ్ నిబంధనలను మరవొద్దన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని పండుగలు జరుపుకోవాలి. ఇప్పటికీ ఒక్క డోసు తీసుకోని వారికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. వ్యాక్సిన్ వేసుకున్న వారు ఇతరులు కూడా వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించాలని ప్రధాని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News