Monday, April 29, 2024

శ్రీనగర్ రోడ్లపై మళ్లీ భద్రతా బంకర్లు

- Advertisement -
- Advertisement -

Security bunkers on Srinagar roads

పెరిగిన పారా మిలిటరీ బలగాల మోహరింపు
ఇటీవలి కాలంలో సామాన్య పౌరుల హత్యలతో కఠిన భద్రతా చర్యలు

శ్రీనగర్: కాశ్మీర్‌లో గత రెండు వారాల్లో మిలిటెంట్లు పలువురు పౌరులను హత్య చేసిన నేపథ్యంలో శ్రీనగర్ రోడ్లపై మళ్లీ భద్రతా బంకర్లు దర్శన మిస్తున్నాయి. అలాగే రోడ్లపై మరింత మంది పారా మిలిటరీ బలగాలను నియమిస్తున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఇవి మళ్లీ నగర రోడ్లపై దర్శనమివ్వడం గమనార్హం. చాలా సంవత్సరాల పాటు శ్రీనగర్ రోడ్లపై కేంద్ర సాయుధ పారా మిలిటరీ బలగాలు కాపలా ఉండే సెక్యూరిటీ బంకర్లు ఉండేవి. అయితే ఆ తర్వాత కశ్మీర్ అంతటా శాంతి భద్రతల పరిస్థితి గణనీయంగా మెరుగుపడ్డంతో 2011నుంచి 2014 మథ్య కాలంలో వీటిని తొలగించారు. కాగా ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరగకుండా చేయడం కోసం నగర రోడ్లపై కొత్తగా బంకర్లను నిర్మించడంతో పాటుగా మరింత మంది భద్రతా జవాన్లను నియమించడం జరుగుతోందని భద్రతా వర్గాలు తెలియజేశాయి. ఉగ్ర నేరాలకు పాల్పడిన తర్వాత అతి కొద్ది సమయంలోనే ఉగ్రవాదులు ఒక చోటినుంచి మరో చోటికి వెళుతున్నారు.

ఆయా ప్రాంతాలపై భద్రతా దళాల పట్టు పెరగడం, స్వేచ్ఛగా తిరగడాన్ని నిరోధించడం ద్వారా మాత్రమే దీని అదుపు చేయగలమని ఆ వర్గాలు తెలిపాయి. ఇటీవలి కాలంలో సామాన్య పౌరుల హత్యలు పెరిగిపోయిన దృష్టా కశ్మీర్ లోయలో ముఖ్యంగా శ్రీనగర్‌లో భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయడం కోసం 50 కంపెనీల అదనపు పారా మిలిటరీ బలగాలను మోహరించడం జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. 2010లో కశ్మీర్‌లో పర్యటించిన అఖిలపక్ష బృందం సిఫార్సుల మేరకు ఆ ఏడాది స్త్రనగర్‌లో 50కి పైగా సెక్యూరిటీ పికెట్లు బంకర్లను తొలగించడం జరిగింది. అదే ఏడాది కేంద్రం నియమించిన మేధావుల బృందం కూడా అలాంటి సిఫార్సులే చేసింది. ప్రముఖ జర్నలిస్టు దిలీప్ పడ్గోంకర్ నేతృత్వంలోని ఈ బృందంలో ప్రొఫెసర్ రాధా కుమార్, సమాచార శాఖ మాజీ కమిషనర్ ఎంఎం అన్సారీ సభ్యులుగా ఉన్నారు. కశ్మీర్‌లో పరిస్థితి ఎంతగా మెరుగుపడిందంటే అప్పటి కేంద్ర హోం మంత్రి పి చిదంబరం జమ్మూ కశ్మీర్‌లో దశల వారీగా సాయుధ బలగాల ప్రత్యేకాధికారా చట్టాన్ని ఎత్తివేయాలని కూడా అనుకున్నారు.

అయితే ఈ సారి కశ్మీర్ లోయలో ఉగ్రవాదం తార స్థాయికి చేరుకున్న 1980 దశరంలో కూడా ఎలాంటి సంఘటనలు జరగని ప్రాంతాల్లో కూడా కొత్త బంకర్లు ఏర్పాటు అవుతున్నాయి. శ్రీనగర్ ఎయిర్‌పోర్టు రోడ్డులో బర్జుల్లా బ్రిడ్జి ప్రాంతంలో రెండు కొత్త బంకర్లను ఏర్పాటు చేయడం గమనార్హం. అయితే కశ్మీర్ లోయలో తీసుకొంటున్న కొత్త చర్యలపై పోలీసు అధికారులు మాత్రం ఎలాంటి వ్యాఖ్యలూ చేయడం లేదు. పోలీసులు శ్రీనగర్‌లలోని కొన్ని ప్రాంతాల్లో, అలాగే దక్షిణ కశ్మీర్‌లో రెండు చోట్ల ఇంటర్‌నెట్‌ను నిలిపి వేయడమే కాకుండా నగరంలో టూవీలర్‌పై వెళ్లే వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. అయితే కేవలం ఉగ్రవాద హింసకు సంబంధించి మాత్రమే ఈ చర్యలు చేపట్టినట్లు కశ్మీర్ జోన్ ఐజిపి విజయ్ కుమార్ ్గరువారం ఒక ట్వీట్‌లో స్పష్టం చేశారు. అక్టోబర్ నెలలో ఇప్పటివరకు తొమ్మిది మంది పౌరులను మిలిటెంట్లు హత్య చేశారు. వీరిలో అయిగురు స్థానికేతర కార్మికులు కాగా, ముగ్గురు మైనారిటీ తెగలకు చెందిన వారున్నారు. ఈ సంఘటనలతో ఇతర రాష్ట్రాలనుంచి ఉపాధి కోసం కశ్మీర్ వచ్చిన వారంతా భయంతో తిరిగి వెళ్తున్నట్లు వార్తలు రావడం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News