Friday, May 3, 2024

జ్ఞానం, ధ్యానం రామానుజం

- Advertisement -
- Advertisement -

PM Narendra Modi unveils statue of Ramanujacharya

జగద్గురు బోధనలు సర్వదా అనుసరణీయం

దేశ ఐక్యతకు ఆయనే స్ఫూర్తి

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ దివ్యక్షేత్రంలో 216అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ

మనతెలంగాణ/హైదరాబాద్ : రామానుజాచార్యుల విగ్రహం జ్జానం, ధ్యానానికి ప్రతీకని, ఆయన బోధనలు అనుసరణీయమని దేశ ప్రధాని నరేంద్రమోడి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌ని దివ్యక్షేత్రంలో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఆవిష్కరించి జాతికి అంకితమివ్వడంతో పాటు 120 కిలోల స్వర్ణ శ్రీమూర్తికి ప్రధాని మోడి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. వసంత పంచమి వేళ సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించడం మహాత్భాగ్యంగా భావిస్తున్నట్టు చెప్పారు. దివ్యక్షేత్రంలోని శ్రీరామనగరంలో అద్భుతమైన 108 దివ్య క్షేత్రాలను దర్శించుకున్నానని, దేశమంతా తిరిగి ప్రముఖ దేవాలయాలు చూసిన అనుభూతి కలిగిందని వివరించారు. రామానుజాచార్యుల బోధనలు ప్రపంచానికి దారి చూపిస్తాయన్నారు. మన సంస్కృతిలో గురువే జ్ఞానానికి కేంద్రమని, జగద్గురు రామానుజాచార్యుల బోధనలు సదా అనుసరణీయమన్నారు. మనం గురువును దేవుడితో కొలుస్తామని, ఇది మన భారతదేశ గొప్పతనమని, రామానుజాచార్యుల ప్రతిభ, వైరాగ్యం ఆదర్శాలకు ప్రతీకని, ఆయన ముందు తరాలకు ప్రేరణగా నిలిచారని స్పష్టం చేశారు.

చినజీయర్ స్వామి తనతో విష్వక్సేనేష్ఠి యజ్ఞం చేయించారని ఆ యజ్ఞఫలం 130 కోట్ల ప్రజలకు అందాలన్నారు. దేశంలో అందరూ సమానంగా అభివృద్ధి చెందాలంటే ఐక్యమత్యంతో సాగాలని సబ్కా సాథ్.. సబ్కా వికాస్ నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని,ఉజ్వల్ పథకం, జన్ధన్, స్వచ్ఛ్ భారత్ వంటి పథకాలన్నీ అందులో భాగమేనన్నారు. ఆయన బోధనల్లో ఒకవైపు జ్ఞాన సముపార్జనకు మార్గాలున్నాయనీ.. మరోవైపు భక్తి మార్గాన్ని ఎలా అనుసరించాలో తెలిపారనీ చెప్పారు. సన్యాసాన్ని స్వీకరించి సిద్ధి పొందడానికి ఒక పరంపరను సృష్టించిన మహానుభావుడు రామానుజాచార్యుడన్నారు. దేశ ఏకతకు రామానుజాచార్యులు స్ఫూర్తి ఎంతో అవసరమన్నారు. సమాజంలో అంతరాలను రామానుజాచార్య వెయ్యేళ్ల క్రితమే తొలగించారన్నారు. అందరినీ సమానంగా చూశారని, అనాడే ఆయన ఆదర్శాలు దేశవ్యాప్తంగా విస్తరించాయన్నారు. రామానుజాచార్యులు దళితులను ఆలయ ప్రవేశం చేయించారు. మనిషికి జాతి కాదు.. గుణం ముఖ్యమని లోకానికి చాటారు. రామానుజాచార్యుల సమతాసూత్రం మన రాజ్యాంగానికి స్ఫూర్తి.’ అని పేర్కొన్నారు.

సమతామూర్తి బోధనలో వైరుధ్యం ఎప్పుడూ రాలేదని పేర్కొన్నారు. రామానుజాచార్యులు అంధవిశ్వాసాలను పారదోలారని, అలాగే ఆయన భక్తికి కులం, జాతి లేదని చాటిచెప్పారని గుర్తుచేశారు. మనిషికి జాతి కాదు గుణం ముఖ్యమని లోకానికి చాటి చెప్పిన మహనీయుడు రామానుజాచార్యులని తెలిపారు. ప్రగతి శీలత, ప్రాచీనతలో భేదం లేదని రామానుజాచార్యను చూస్తే తెలుస్తుందన్నారు. వెయ్యేళ్ల కిందట మూఢ విశ్వాసాలు ఎంతగా ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమేనని.. వాటిని తొలగించేందుకు రామానుజాచార్యులు ఎంతో కృషి చేశారని మోదీ గుర్తుచేశారు. ఆనాడే రామానుజాచార్యులు దళితులను కలుపుకుని ముందుకు సాగారన్నారు. ఆలయాల్లో దళితులకు దర్శన భాగ్యం కల్పించారన్నారు. అసమానతల నివారణకు కృషి చేసిన ఆధునిక నాయకుడు అంబేడ్కర్ అని ఆయన అభిప్రాయపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా రామానుజాచార్యుల ప్రవచనాలనే చెప్పారని ప్రధాని గుర్తు చేశారు.స్వాతంత్య్ర పోరాటంలో ఐక్యత, సమానతదీ కీలకపాత్ర అని ప్రధాని వెల్లడించారు. హైదరాబాద్ ఏర్పాటులో సర్దార్ పటేల్ కీలకపాత్ర పోషించారని ఆయన చాణక్యం వల్లే హైదరాబాద్‌కు విముక్తి లభించిందని గుర్తు చేశారు. ఐక్యతా విగ్రహంతో సర్దార్ పటేల్‌ను సత్కరించుకున్నామన్నారు. రామానుజవిగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని మైహోంగ్రూప్ ఎండీ జూపల్లి జగపతిరావు, డైరెక్టర్స్ రామురావు, రంజిత్ రావు, సందీప్‌రావు దగ్గరుండి పర్యవేక్షించారు.

తెలుగు సినిమాపై ప్రధాని ప్రశంసలు 

తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించిందన్నారు. తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతాలు సృష్టిస్తోందన్నారు. ’సిల్కర్ స్కీన్ నుంచి ఒటిటి వరకు తెలుగు సినిమాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. తెలుగు భాష చరిత్ర ఎంతో సుసంపన్నమైందని, కాకతీయుల రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం గర్వకారణమన్నారు. పోచంపల్లి చేనేత వస్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించాయని, తెలుగు సంస్కృతి దేశ భిన్నత్వాన్ని బలోపేతం చేస్తోందన్నారు. శాతవాహనులు, కాకతీయులు, విజయనగర రాజులు తెలుగు సంస్కృతిని పోషించారని, రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా, పోచంపల్లికి ప్రపంచ వారసత్వ గ్రామంగా ఘనత దక్కిందని గుర్తుచేశారు. తెలుగు భాషా చరిత్ర ఎంతో సుసంపన్నమైందని కీర్తించారు.తెలంగాణ గొప్ప పర్యాటక ప్రాంతంగా ఎదుగుతోందని ప్రధాని ప్రశంసించారు. భవిష్యత్తులో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచఖ్యాతి గడిస్తోందని ప్రధాని తెలిపారు.

శ్రీరాముడిలా మోదీ కూడా గుణసంపన్నుడు: చినజీయర్ స్వామి

ముచ్చింతల్లో సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం చినజీయర్ స్వామి మాట్లాడుతూ శ్రీరాముడు వ్రత సంపన్నుడని కొనియాడారు. శ్రీరాముడిలా ప్రధాని మోడి కూడా గుణసంపన్నుడని ప్రశంసించారు. మోడి ప్రధాని అయ్యాకే దేశ ప్రజలు హిందువులమని గర్వంగా చెప్పుకోగలుగుతున్నారని, అలాగే భరతమాత తలెత్తుకొని చిరునవ్వులు చిందస్తోందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఎప్పుడూ ధర్మాన్ని పాటిస్తారన్నారు. ముఖ్యంగా వైదిక నియమాలను పాటిస్తారని, దసరా సమయంలో అమెరికాకు వెళ్లినా నియమాలను పాటించారన్నారు. కేవలం జలప్రసాదంతో గడిపారన్నారు. మోదీ పాలనలో భారత పటంలో కాశ్మీర్ నవ్వుతూ కనిపిస్తుందన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో ప్రధాని మోడి అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నారన్నారు.

రామానుజాచార్యుల సిద్ధాంతాలతోనే ప్రధాని పాలన :కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

రామానుజాచార్యుల సిద్ధాంతాలతోనే ప్రధాని మోదీ పాలన కొనసాగిస్తున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వెయ్యేళ్ల క్రితమే రామానుజాచార్యులు ప్రజలంతా ఒక్కటేనని, దైవం ముందు అందరూ సమానులేనని చాటిచెప్పారన్నారు. ఆ స్ఫూర్తిని మనమంతా పొందాలన్నారు. భగవద్రామానుజుల విగ్రహ ప్రాజెక్ట్ లో భాగమవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈకార్యక్రమంలో మై హోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, ప్రధాని నరేంద్ర మోదీ హాజరవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సమతామూర్తి స్ఫూర్తి నేటి తరానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. సర్వ మానవ సౌభ్రాతత్వం భారతదేశ లక్షణమని, ఈ విషయాన్ని వెయ్యేళ్ల క్రితమే సమానత్వ భావనను రామానుజాచార్యులు చెప్పారని గుర్తు చేశారు. దివ్యక్షేత్రం కోసం చినజీయర్ స్వామి భక్తులందరిని ఏకం చేశారని, రామానుజాచార్య సమతాస్ఫూర్తిని ప్రధాని అమలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవంలో భాగంగా జరిగిన సమతామూర్తి విగ్రహావిష్కరణలో బిజెపి జాతీయ ఒబిసి మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, రాష్ట్రబిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, బిజెపి సీనియర్ నేతలు రఘునందన్‌రావు, రాజాసింగ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, గీతామూర్తి, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

ముచ్చింతల్‌లో ప్రధాని పర్యటన సాగిందిలా..

పటాన్‌చెరులోని ఇక్రిశాట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సంప్రదాయ వస్త్రాల్లో ప్రధాని ముచ్చింతల్‌కు శనివారం సాయంత్రం 5గంటలకు చేరుకోగానే గవర్నర్ , చిన్నజీయర్ స్వామి, జూపల్లి రామేశ్వరరావు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీని చిన్నజీయర్ స్వామి, మైహోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరావులు సత్కరించారు. శ్రీరామనగరం చేరుకున్న ప్రధాని తొలత యాగశాలకు వెళ్లారు. యాగశాలలో విశ్వక్సేనేస్టి పూజలో చిన్న జీయర్ స్వామి ప్రధానికి కంకణధారణ చేయించడంతో పాటు మెడలో పూలమాల వేసి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ప్రధాని శ్రీరామచంద్ర పెరుమాళ్‌ను దర్శించుకుని సమతామూర్తి ప్రాంగణంలో డిజిటల్ గైడ్ ద్వారా 108 దివ్యదేశ నమూన ఆలయ విశేషాలను తెలుసుకున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆలయాల విశిష్టతలను, సమతామూర్తి ప్రాంగణం విశిష్టతలను ప్రధాని మోదీకి వివరించారు. ఆ తర్వాత రామానుజాచార్యుల విగ్రహానికి ప్రధాని పూజలు చేసి శిలాపలకాన్ని ఆవిష్కరించి 216 అడుగుల భగవద్రామానుజాచార్యుల విగ్రహాన్ని లోకార్పణ చేశారు.

సమతామూర్తి విగ్రహావిష్కరణ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామానుజ చిన్నజీయర్ స్వామి శ్రీరామానుజాచార్యుల ప్రతిమను బహూకరించారు. అలాగే రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ , కేంద్ర పర్యాటకమంత్రి కిషన్ రెడ్డిలని సత్కరించారు. ఈక్రమంలో లేజర్ షోను ఆవిష్కరించిన ప్రధాని యాగశాలకు చేరుకుని హోమం గుండం దగ్గర ధ్యానం చేశారు. 5వేల మంది రుత్వికులు ప్రధానికి వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ప్రధాని 108 వైష్ణవ ఆలయాలను దర్శించుకుని దివ్యదేశాల విశిష్టతలను తెలుసుకున్నారు. భద్రవేదిక మొదటి అంతస్తులో ఉన్న 120 కిలోల సమతామూర్తి బంగారు విగ్రహాన్ని ఆయన సందర్శించారు. ఆ తర్వాత భద్రవేదికపై సమతామూర్తి విగ్రహానికి పూజలు చేశారు. తిరునామం, పట్టు వస్త్రాల్లో వచ్చిన మోడి వేద పండితుల్ని అనుకరించారు. ప్రధానిమోదీతో రుత్వికులు సంకల్పం చేయించారు. అనంతరం రామానుజ జీవిత చరిత్ర విశేషాల గ్యాలరీని సందర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News