Sunday, May 12, 2024

డిజిటల్ సర్వేతో పాటు శాటిలైట్ ప్రామాణికంగా పోడు భూముల సర్వే ?

- Advertisement -
- Advertisement -

ఉపగ్రహ చిత్రాల ద్వారా 8 లక్షల ఎకరాల
అటవీభూమి ఆక్రమణయినట్టు గుర్తింపు!
2005 డిసెంబర్ తర్వాతే అధికం
నిర్ధారించిన అధికారులు
అటవీ, రెవెన్యూల మధ్య కొలిక్కిరాని భూముల పంచాయితీ

Podu bhumula survey with digital
మనతెలంగాణ/హైదరాబాద్:  డిజిటల్‌తో పాటు శాటిలైట్ సర్వే ప్రామాణికంగా పోడు భూముల పంచాయతీని పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. నేషనల్ రిమోట్ పెన్సింగ్ ఏజెన్సీ శాటిలైట్ సర్వేను ప్రామాణికంగా తీసుకుంటే వివాదాలను త్వరగా పరిష్కరించవచ్చని అధికారులు ప్రభుత్వానికి అందించిన నివేదికలో పేర్కొనడంతో ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం అటవీ శాఖ ఎన్టీఆర్‌ఎస్‌ఏ కార్ట్ శాట్ ద్వారా ఉపగ్రహ చిత్రాలను తీస్తోంది. దీని ప్రకారం ఏ అటవీ భూమి ఎప్పుడు పంట పొలంగా మారింది. ఎక్కడ కబ్జాకు గురైందన్న వివరాలు ఎన్టీఆర్‌ఎస్‌ఏ కార్ట్ శాట్ ద్వారా తెలిసిపోతోంది. గతంలో శాటిలైట్ ద్వారా కొన్ని జిల్లాలోని అటవీ భూములను అధికారులు సర్వే చేశారు. అక్కడ భూముల వివరాల గురించి నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందచేశారు. దీంతో ఆ భూముల వివరాలు పాత రికార్డులతో సరిపోవడంతో ప్రభుత్వం డిజిటల్‌తో పాటు శాటిలైట్ సర్వే చేయాలని నిర్ణయించినట్టుగా తెలిసింది.

పాత రికార్డుల ఆధారంగా నివేదికలు తయారు

ఈ సర్వే ద్వారా 2005 సంవత్సరానికి ముందు అటవీ శాఖ భూములు ఎన్ని, పోడు భూములు ఎన్ని, ఎంతవరకు కబ్జాకు గురయ్యాయి, ఆ తర్వాత ఎంత భూమి ఆక్రమణకు గురైందన్న విషయాలను తెలుసుకోవడంలో ఈ సర్వే కీలక పాత్రను పోషిస్తున్నాయని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వ్యవస్థ అటవీశాఖ వద్ద ఉంది. ఉన్న వ్యవస్థకు తోడు అధునాతన వ్యవస్థను దీనికి అదనంగా సమకూర్చుకోవడానికి అటవీ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ సర్వేలో ఏదీ అటవీభూమి, ఏదీ రెవెన్యూ భూమి, ఏ వ్యక్తి ఆధీనంలో ఎంత భూమి అన్న విషయం తెలియడం లేదు. అయితే పాత రికార్డుల ఆధారంగా వాటికి సంబంధించి అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు నివేదిక తయారుచేసే పనిలో నిమగ్నం అయినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే శాటిలైట్ చిత్రాలను తీసుకుంటూనే, మరోవైపు డిజిటల్ సర్వే చేయించాలని ప్రభుత్వ నిర్ణయించినట్టుగా తెలిసింది.

8.10 లక్షల ఎకరాల అటవీ భూమి కేటాయింపు

చాలా సంవత్సరాలుగా అడవుల్లోనే నివాసముంటూ పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులు, ఇతర సంప్రదాయ తెగలకు సంబంధించిన వారికి భూమిపై యాజమాన్య హక్కులను ఇవ్వడానికి రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ (ఆర్‌ఓఎస్‌ఆర్) చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 2006లో అమల్లోకి తెచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం డిసెంబర్ 2005వ తేదీ నాటికి 8.10 లక్షల ఎకరాల అటవీ భూమిని కేటాయించింది. ఆర్‌ఓఎస్‌ఆర్ యాక్ట్ ప్రకారం డిసెంబర్ 2005 కంటే ముందు నుంచి అటవీ భూములపై కబ్జాలో ఉండి వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు, పేదలకు పట్టాలివ్వాలన్న నిబంధనను కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. చట్టం అమల్లోకి వచ్చిన మూడు నుంచి ఆరునెలల్లోపు ఆర్‌ఓఎస్‌ఆర్ కింద దరఖాస్తు చేసుకున్న వారిని పరిగణనలోకి తీసుకున్నారు. ఇక గిరిజనేతరులు పట్టా పొందాలంటే చట్టం అమల్లోకి రావడం కన్నా 75 ఏండ్ల ముందు నుంచే సాగు చేసుకున్నట్లు ఆధారాలు చూపాలి. కాగా రాష్ట్రంలో ఆర్‌ఓఎస్‌ఆర్ కింద 94,273 మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు 54వేల 278 మందికి పట్టాలిచ్చి 3,05,977 ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వం కేటాయించింది. సామాజిక అవసరాల కింద మరో 5 లక్షల ఎకరాలను ఇవ్వగా మొత్తానికి ఆర్‌ఎస్‌ఆర్ కింద 8 లక్షల 10వేల ఎకరాల అటవీ భూమిని వ్యక్తులకు, సంస్థలకు ప్రభుత్వం కట్టబెట్టింది. మిగిలిన లక్ష దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

ఏడు లక్షల ఎకరాల వరకు రెవెన్యూ భూమి

రాష్ట్రంలో అటవీ భూమి 66 లక్షల ఎకరాల వరకు ఉండగా దాదాపు 8 లక్షల ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఆర్‌ఓఎస్‌ఆర్ పథకం కింద అదనంగా పోయింది 3 లక్షల ఎకరాలు. ఇక మొత్తంగా మిగిలింది 55 లక్షల ఎకరాలే. ఇది అధికారిక లెక్క మాత్రమే. కానీ, కొంతకాలంగా జరిపిన శాంపిల్ సర్వేలో ఈ కబ్జాలు రెండు నుంచి నాలుగింతలు పెరిగినట్టు ప్రభుత్వానికి అందిన నివేదికలో అధికారులు పేర్కొన్నారు. మహబూబాబాద్ ప్రాంతంలోని ఓ మండలం పరిధిలో 3 వేల ఎకరాల అటవీ భూమి కబ్జా అయిందని రికార్డుల్లో ఉండగా, క్షేత్రస్థాయిలో అది 21వేల ఎకరాలని తేలింది. ఇలా ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరు నాగారం, పాకాల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మహబూబాబాద్ అడవుల్లో ఇలాంటి పరిస్థితే ఎదురయినట్టు అధికారులు ప్రభుత్వానికి అందించిన నివేదికలో పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఆక్రమణలు రెండు రెట్లు అధికంగా ఉన్నట్లు శాటిలైట్ చిత్రాలు కూడా వెల్లడించాయని ఇందులో సగానికి పైగా 2005 డిసెంబర్ తర్వాతే కబ్జాకు గురైనట్లు ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే స్పష్టమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 66 లక్షల ఎకరాల అటవీ భూమిలో ఏడు లక్షల ఎకరాల వరకు రెవెన్యూ భూమి ఉందని రెవెన్యూశాఖ వాదిస్తుండగా రెవెన్యూ శాఖ తప్పుడు రికార్డులను చూపుతుందని, ఆ భూమి అంతా తమదేనని అటవీశాఖ స్పష్టం చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News