Sunday, May 5, 2024

రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు : సిఎస్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఈ నెల 26వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి విడిది కోసం చేయాల్సిన ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల ఉన్నతాధికారులతో శుక్రవారం బిఆర్‌కెఆర్‌భవన్‌లో సమన్వయ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేయాలని, ఈ మేరకు అధికారులు సమన్వయంతో పని చేయాలని పలు శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. రాష్ట్రంలో జరిపే ఐదు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముర్ము, రామప్ప, భద్రాచలాన్ని సందర్శిస్తారు. నగరంలో స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. రంగారెడ్డి జిల్లా కన్హాశాంతి వనంలో శ్రీ రామచంద్ర మిషన్ వ్యవస్థాపకులు రామచంద్ర మహారాజ్ 150 జయంతి ఉత్సవాల ను ప్రారంభిస్తారు.

దీనికి గుర్తుగా హర్ దిల్ ధ్యాన్, హర్ దిన్ ధ్యాన్ ప్రచార ఫలకం ఆవిష్కరణలో కూడా ఆమె పాల్గొంటారని తెలిపారు. రాష్టప్రతి మార్గంలో రోడ్డు మరమ్మతులు, బారికేడింగ్ పనులు చేపట్టాలని జిహెచ్‌ఎంసి కమిషనర్, కంటోన్మెంట్ బోర్డు సిఈఒలను ఆదేశించారు. పోలీసుశాఖ విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కోరారు. రాష్ట్రపతి నిలయంలో ప్రొటోకాల్ అనుసరించి 24 గంటల పాటు విద్యుత్తు శాఖ, వైద్య బృందాలను నియమించాలని సంబంధిత విభాగాలను ఆదేశించారు. కాగా, 2023 జనవరి 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు రంగారెడ్డి జిల్లా కన్హా శాంతి వనంలో నిర్వహించనున్న శ్రీ రామచంద్రజీ మహారాజ్ 150వ జయంతి ఉత్సవాలు సజావుగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సి.ఎస్ అధికారులను ఆదేశించారు. ఈ ఉత్సవాలకు దేశ, విదేశాల నుంచి లక్ష మందికి పైగా యాత్రికులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని, ఇందుకు గాను ఏ విధమైన లోటు పాట్లు జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయాలని డిజిపి మహేందర్‌రెడ్డి కోరారు. ఈ సమీక్షా సమావేశానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, శాఖల అధిపతులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News