Friday, April 26, 2024

సంపాదయకీయం: ప్రైవేటు ‘దోచు’పత్రులు!

- Advertisement -
- Advertisement -

Sampadakiyam:8 UP Cops Killed by gangster Vikas dubey

నయమైన కరోనా రోగుల నుంచి గుంజుకోడమే కాకుండా మృతుల శవాలను కూడా అడ్డంపెట్టి భారీగా నగదు చేసుకొని, కోవిడ్ 19 బాధితుల కొంపలు కూల్చుతున్న ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల అమానుషాల వార్తలు బెంబేలెత్తిస్తున్నాయి. దేశంలో రోజురోజుకీ వేలాదిగా కొత్త కేసులు బయటపడుతూ ప్రజలను భీతావహులను చేస్తున్న మహమ్మారి వైరస్ కనీవినీ ఎరుగని కల్లోల్లాన్ని సృష్టిస్తున్నది. ప్రభుత్వ వైద్య రంగానికి అగ్ని పరీక్షగా మారింది. ఇటువంటి పెను విపత్తులో సహేతుక ఛార్జీలతో కరోనా చికిత్స చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావలసిన ప్రైవేటు రంగంలోని ఆసుపత్రులు అందుకు విరుద్ధంగా రోగుల జేబులు కొల్లగొట్టి వారి కుటుంబాలను దివాలా తీయిస్తున్న తీరు పరమ జుగుప్సాకరంగా ఉన్నది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిస్సహాయతను ప్రదర్శించడం మరింత దారుణం. అంతోఇంతో కలిగి ఉన్న రోగులు ఉన్నదంతా ఊడ్చి కార్పొరేట్ ఆసుపత్రుల దోసిట్లో పోసి నెత్తిన చేతులతో ఇంటి ముఖం పట్టినా, పేద బాధితులకు దిక్కెవరు అనే ప్రశ్న భయపెడుతున్నది. ప్రైవేటు దవాఖానాల్లోనూ, కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ కరోనా చికిత్సకు హేతుబద్ధమైన ఛార్జీలను వసూలు చేసేటట్టు చూడవలసిందిగా ఆదేశించాలంటూ దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గత నెలలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ స్పందనను కోరింది. అలాగే ఆయుష్మాన్ భారత్ పథకం కింద నిర్ణయించే ఛార్జీలకు కరోనా చికిత్స చేయలేరా అని ఈ ఆసుపత్రులనూ అడిగింది. వైరస్ సోకిన కొంతమందికైనా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందేలా చూడాలని సుప్రీంకోర్టు అంతకు ముందు ఒకసారి ఆదేశించింది.

చట్ట ప్రకారం తమకు ఆ అధికారాలు లేవని కేంద్ర ప్రభుత్వ సీనియర్ న్యాయవాదులు న్యాయ స్థానానికి తెలియజేశారు. ప్రభుత్వం నుంచి భూమిని ఉచితంగానో, రాయితీ ధరకో పొందిన ప్రైవేటు వైద్య శాలలు కరోనా రోగులను తగు రీతిలో ఎందుకు ఆదుకోకూడదన్న ప్రశ్నకు ఆసుపత్రుల యాజమాన్యాలు ‘ఇప్పటికే కొందరు పేద రోగులకు ఉచిత వైద్యం చేస్తున్నామ’ని చెప్పి చేతులు దులుపుకున్నాయి. తన అత్యవసర రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ మౌలిక విలువలకు కూడా తిలోదకాలిచ్చి పార్లమెంటు చేత చట్టాలు చేయించగలుగుతున్న కేంద్ర ప్రభుత్వం ఈ ఆపద సమయంలో కరోనా రోగులను ప్రైవేటు ఆసుపత్రుల అధిక లాభార్జన దాహం నుంచి కాపాడడానికి సహేతుక ఛార్జీలకే చికిత్స చేసి తీరాలంటూ ఆర్డినెన్స్‌ను జారీ చేయించలేదా? జనాభాలో 70శాతం పైగా పేద, మధ్య తరగతి ప్రజలున్న, అణగారిన సామాజిక వర్గాలతో కిక్కిరిసిపోయిన దేశంలో వారి ఓట్ల్లతో అధికారంలోకి వచ్చిన ప్రజా పాలకులకు ఆపాటి జనపక్షపాతం కరువైందా? తాను చేయగలిగేదంతా చేయవలసి ఉన్న తరుణంలో రాష్ట్రాలకు పైసా అదనపు నిధులివ్వకుండా బాధ్యతను మాత్రం వాటిపైకి నెట్టివేస్తున్న ప్రధాని మోడీ ప్రభుత్వ వైఖరి అత్యంత బాధాకరం. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఒక్కో కరోనా రోగి నుంచి రూ.1012 లక్షలు ముక్కు పిండి వసూలు చేస్తున్నాయని పిటిషనర్ సచిన్ జైన్ అత్యున్నత న్యాయస్థానానికి నివేదించుకున్నారు. హైదరాబాద్ నగరంలోనూ లక్షలాది రూపాయల మేరకు బిల్లులు బిగించి చెల్లించలేని పక్షంలో రోగులను డిశ్చార్జి చేయకుండా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెప్పనలవికాని వేధింపులకు గురి చేస్తున్నాయి. చనిపోయినవారి మృత దేహాలను బంధువులకు అప్పగించకుండా బ్లాక్‌మెయిల్ చేసి బిల్లులు వసూలు చేస్తున్నాయి.

దీనిపై రాష్ట్ర హైకోర్టులో ప్రజాప్రయోజన పిటిషన్‌ను దాఖలు చేసిన సీనియర్ న్యాయవాది శ్రీకిషన్ శర్మ ప్రైవేటు ఆసుపత్రులు ఒక్కొక్క రోగి నుంచి రూ.5.30 లక్షలు పిండుకుంటున్నాయని ఫిర్యాదు చేశారు. ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ విజయేశన్ రెడ్డిల ధర్మాసనం ఇంతటి ఘోరమైన బిల్లులను చెల్లించలేని రోగుల విడుదలకు నిరాకరిస్తున్న ఆసుపత్రుల వైఖరి తీవ్ర ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. చికిత్సకు వసూలు చేయవలసిన ఛార్జీలపై రాష్ట్ర ప్రభుత్వం గరిష్ఠ పరిమితిని విధించినా ఆసుపత్రులు ఆ జిఒను ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా విపరీతమైన బిల్లులను వసూలు చేస్తున్నాయని అభిప్రాయపడింది. ఇటువంటి దవాఖానాలపై చర్యలు తీసుకొని ఉండవలసిందన్నది. ప్రభుత్వ వైద్యం కుంటువడిన నేపథ్యంలో ఇన్నేళ్లుగా రోగుల నుంచి అపారంగా గడిస్తూ ఆస్తులు పెంచుకుంటున్న ప్రైవేటు ఆసుపత్రులు తక్కువ లాభాలతో సరిపెట్టుకొని కోవిడ్ 19 రోగులకు చికిత్స అందించాల్సిన మానవతా బాధ్యతను విస్మరించడం, ఒక అపూర్వ ప్రళయం నుంచి మరింత సంపద పోగేసుకునే దురాశను ప్రదర్శించడం చెప్పనలవికానంత సామాజిక నేరం. కరోనా కష్ట కాలం తీరేంతవరకైనా దేశంలోని ప్రైవేటు ఆసుపత్రులను స్వాధీనం చేసుకునే అత్యవసరాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా గుర్తించాలి.

Private Hospitals Collect heavy bills from Corona patients

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News