Monday, April 29, 2024

మోదానీ బంధంపై బహుపరాక్

- Advertisement -
- Advertisement -

హుస్నాబాద్: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ సంపదను పారిశ్రామికవేత్త అదానికి దోచి పెడుతున్నారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. శుక్రవారం పట్టణంలో హుస్నాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన అదాని ఒక రోజు సంపాదన 1600 కోట్లు అని తెలిపారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు తొత్తుగా మారి దేశ సంపదను అప్పనంగా అప్పగిస్తుందని మండిపడ్డారు. దేశ ప్రజలు బిజెపి ప్రభుత్వ ధోరణిని అర్థం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ఢిల్లీలో బిఆర్‌ఎస్‌కు బిజెపి, తెలంగాణలో బిజెపికి, బిఆర్‌ఎస్ అనుకూలంగా వ్యవహరిస్తుందని తెలిపారు.

ఎంఐఎం తెలంగాణ పార్టీ అని దేశంలో 60, 70 స్థానాలకు పోటీ చేస్తూ తెలంగాణలో కేవలం ఏడు స్థానాలలో పోటీ చేయడం చూస్తుంటే ఎంఐఎం దేశంలో బిజెపికి రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. తెలంగాణలో ప్రజల ఆకాంక్ష నెరవేరలేదన్నారు. మహిళలకు రక్షణ లేదని, పేదలకు ఇండ్లు స్థలాలు ఇవ్వలేదని తెలిపారు. పీవీ నరసింహారావు, సర్దార్ పాపన్న పౌరుషం గల ప్రాంతం హుస్నాబాద్ అన్నారు. ఇందిరమ్మకు చాలా దగ్గరగా సన్నిహితంగా ఉండేవారని దేశ ప్రధానిగా పనిచేసిన పివి నరసింహారావు తన తండ్రి రాజీవ్ గాంధీ మరణించినప్పుడు పార్టీకి అండగా ఉన్నారని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని వాటితో పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి జరుగుతుందన్నారు. హుస్నాబాద్ ప్రాంత సమస్యలపై మీ ఎమ్మెల్యే స్పందించారా అని ప్రశ్నించారు.

మహాత్మా గాంధీ నాటి నుండి నేటి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన నిలబడుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని, ప్రజల మధ్యనే ఉంటుందని, ప్రజల సమస్యలపై నిత్యం పోరాడుతుందని అన్నారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ, కార్మిక తదితర రంగాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవలే మేనిఫెస్టోలో పొందుపరిచిన 6 గ్యారంటీలను అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలాగా క్షుణ్ణంగా వివరించారు. మనభూమి.. మన చెమట.. ఓటు కు ముందు ఒకసారి ఆలోచించాలని సూచించారు. ఈనెల 30న జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించే కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News