Friday, May 17, 2024

హెచ్‌ఎంల బదిలీల తర్వాతనే పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలి

- Advertisement -
- Advertisement -
పాఠశాలల్లో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలి
మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ప్రధానోపాధ్యాయుల సంఘం విజ్ఞప్తి

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రధానోపాధ్యాయుల బదిలీలు నిర్వహించిన తర్వాతనే పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రతినిధులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. 2023 -24 విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నందున పాఠశాలల్లో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి. రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఆర్. రాజ గంగారెడ్డిలు మంత్రికి వినతిపత్రం అందజేశారు.

ప్రధానోపాధ్యాయుల బదిలీల నిర్వహణకు స్పెషల్ పాయింట్స్ అంశమే చట్టపరంగా అవరోధమైతే వాటిని తాము స్వచ్ఛందంగా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అవసరమైతే వాటిని రద్దు చేసి బదిలీలు నిర్వహించాలని కోరారు. 100 శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయబడే ప్రధానోపాధ్యాయల పోస్టులకు బదిలీలు నిర్వహించకుండానే, పదోన్నతులు ఇచ్చినట్లయితే ప్రస్తుతం పని చేస్తున్న, బదిలీల కోసం వేచి చూస్తున్న ప్రధానోపాధ్యాయులు అన్యాయానికి గురవుతారని అన్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి ప్రధానోపాధ్యాయులకు బదిలీలు నిర్వహించిన తదుపరి పదోన్నతులు నిర్వహించేటట్లు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పాఠశాలల్లో స్థానిక సంస్థల ద్వారా నిర్వహించబడే పారిశుద్ధ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించబడక విద్యార్థులకు చాలా అసౌకర్యంగా ఉందని, వీటి నిర్వహణ ప్రధానోపాధ్యాయులకు సమస్యగా మారిందని, కాబట్టి పాఠశాలల్లో వీటిని సక్రమంగా నిర్వహించుటకు పాఠశాలల్లో, పాఠశాల సమయంలో అందుబాటులో ఉండే స్పెషల్ వర్కర్స్‌ను నియమించాలని తెలిపారు. బడిబాటలో భాగంగా విద్యార్థుల నమోదుకు చేసే ప్రయత్నంలో పాఠశాలలో అన్ని సబ్జెక్టుల బోధనకు ఉపాధ్యాయులు ఉన్నారా..? అని తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను ప్రశ్నిస్తున్నారని మంత్రికి వివరించారు. నూతన ఉపాధ్యాయుల నియామకం పూర్తయ్యే వరకు విద్యా వాలంటీర్లను నియమించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News