Monday, April 29, 2024

‘ఉప’ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

Corona again in india మూడు లోక్‌సభ, యేడు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప యెన్నికల ఫలితాలలో యుపి, పంజాబ్‌ల తీర్పులు అందరి దృష్టినీ ఆకర్షించాయి. ఉత్తర ప్రదేశ్‌లో యెన్నికలు జరిగిన రెండు లోక్‌సభ స్థానాలు ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) కంచుకోటలు. ఇందులో వొకటి అజాంగడ్, మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఖాళీ చేసింది కాగా, రెండో స్థానం రాంపూర్ ఆ పార్టీ ముఖ్యనేత అజాంఖాన్ ఖాళీ చేసింది. ఇటీవలి అసెంబ్లీ యెన్నికల్లో గెలిచిన తర్వాత ఈ రెండు స్థానాలకూ వీరిద్దరూ రాజీనామా చేశారు. ఉప యెన్నికల్లో రెండింటినీ బిజెపి గెలుచుకోడం ఆశ్చర్యాన్ని కలిగించింది. యుపిలో ఎస్‌పి నుంచి రెండు అత్యంత ముఖ్యమైన లోక్‌సభ స్థానాలను గెలుచుకోడం బిజెపిలో వెయ్యి ఏనుగుల బలాన్ని కలిగించింది.

ప్రధాని మోడీ నాయకత్వంలో బిజెపి సమకూర్చిన డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పట్ల యుపి ప్రజలు విశ్వాసాన్ని ప్రకటించారని, కుటుంబ పాలకులకు, వారసత్వ రాజకీయ నేతలకు, కులతత్వ శక్తులకు గట్టి పాఠం చెప్పారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. 2024 యెన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 80 లోక్‌సభ స్థానాలను బిజెపి గెలుచుకొంటుందని ఆయన దృఢ విశ్వాసం ప్రకటించారు. ప్రధాని మోడీ కూడా ఇది డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ప్రభావమని అన్నారు. బిజెపి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి యీ ఉపయెన్నికలు గెలుచుకుందని, వీటిని ఎన్నికలని అనడానికే వీల్లేదని అఖిలేష్, అజామ్ ఖాన్‌లు వ్యాఖ్యానించారు. బిజెపి గత అసెంబ్లీ యెన్నికల్లో సాధించుకొన్న పునర్విజయంతో సకల బలాలను, వ్యూహాలను ప్రయోగించి ఈ ఉపయెన్నికలను గెలుచుకొన్నది. యుపిలో గాని, దేశంలో ఇంకెక్కడైనా గాని బిజెపిని వోడించాలంటే యేకైక శరణ్యం ప్రతిపక్షాల మహాకూటమి ఏర్పాటు, బహుజన సామాజిక వర్గాలు, మైనారిటీల సంఘటన నిర్మాణమే. ప్రజాస్వామ్య, సెక్యులర్ శక్తుల బలమైన కలయిక అవసరం యెంతయినా వుంది.

మొన్నటి యెన్నికల్లో పంజాబ్‌లో అత్యధిక స్థానాలతో అధికారాన్ని సాధించుకొని అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచిన ఆమ్ ఆద్మీ పార్టీ యీసారి ఆ రాష్ట్రంలో ఉపయెన్నిక జరిగిన వొకే వొక్క లోక్‌సభ స్థానంలో ఘోరంగా వోడిపోయింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఖాళీ చేసిన సంగ్రూర్ లోక్‌సభ స్థానాన్ని అకాలీదళ్ కైవసం చేసుకొన్నది. ఇక్కడి నుంచి భగవంత్ మాన్ 2014లో 2 లక్షల వోట్ల ఆధిక్యంతో, 2019లో లక్ష వోట్ల మెజారిటీతో విజయదుందుభి మోగించారు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు ప్రస్తుత వోటమి ఆయనకు, ఆయన పాలనకు, ఆప్ వ్యూహకర్తలకు యెదురు దెబ్బగానే పరిగణించాలి. కాంగ్రెస్ నేత, ప్రముఖ గాయకుడు మూసావాలా హత్య ప్రభావం ఇందులో కనిపిస్తున్నది. విఐపిలకు వ్యక్తిగత అంగరక్షకులను ఉపసంహరించడంలో భాగంగా మూసావాలాకు పోలీసు బందోబస్తును తొలగించిన మరుసటి రోజే యీ హత్య జరిగింది. పంజాబ్‌లో అసాధారణ విజయంతో అధికారాన్ని పొందగలగడం ఆప్‌ను అజాగ్రత్తలోకి నెట్టివేసినట్టు రుజువువుతున్నది. మిగతా ఉప యెన్నికల్లో, ఢిల్లీలో రాజీందర్ నగర్ అసెంబ్లీ స్థానాన్ని ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థి గెలుచుకున్నారు. ఆ విధంగా దేశ రాజధానిలో ఆప్ తన ఎదురులేనితనాన్ని నిరూపించుకొన్నది.

పంజాబ్‌లో అధికారంలోకి వచ్చి వంద రోజులు ముగిసిన వెంటనే జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికలో ఆప్ పొందిన అపజయాన్ని గమనిస్తే విజయవంతమైన దాని ఢిల్లీ ఫార్ములా ఢిల్లీకే పరిమితమవుతుందా అనే అభిప్రాయం కలగడం సహజం. త్రిపురలో నాలుగు శాసనసభ స్థానాలకు ఉపయెన్నికలు జరిగాయి. మూడింటిని బిజెపి గెలుచుకోగా, వొకటి కాంగ్రెస్ కైవసమయింది. ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహ టౌన్ బర్దోవాలి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయనకిది మొదటి ఎన్నిక కావడం విశేషం. సిపిఐ (ఎమ్), టిఎమ్ సిలు వొక్క సీటూ సాధించుకోలేకపోయాయి. లోక్‌సభకు గాని, అసెంబ్లీలకు గాని యెన్నికలు మామూలుగా ఐదేళ్ళకొకసారి జరుగుతాయి. సిట్టింగ్ అభ్యర్థులు రాజీనామా చేసినప్పుడో, మరణించినప్పుడో ఖాళీ అయ్యే స్థానాలకు ఆరు మాసాల గడువు ముగిసేలోగా జరిగే ఉపయెన్నికలు పార్టీలకు అగ్నిపరీక్షలవంటివి.

ఇందులో పరాజయం పాలయ్యే పార్టీలు ప్రజల అభిమానాన్ని మరింతగా కోల్పోకుండా జాగ్రత్త పడడానికి యీ ఉపయెన్నికలు మంచి దిద్దుబాటు మార్గాలుగా పని చేస్తాయి. దేశంలో నేడున్న రాజకీయ పరిస్థితి, బిజెపి ఎదురులేని ఆధిపత్యం సెక్యులర్, ప్రజాస్వామ్య వ్యవస్థకే మరణ శాసనంగా రుజువు చేసుకొంటున్నది. అన్ని రాజ్యాంగ నియమాలు అతిక్రమణకు, ఉల్లంఘనలకు గురి అవుతున్నాయి. న్యాయ వ్యవస్థ సహా దేని నిస్పాక్షిక వైఖరికీ మనుగడ లేదనే అభిప్రాయం బలపడుతున్నది. ప్రజాస్వామిక, బహుళత్వ సామాజిక జీవన విధానాన్ని ప్రీతిపాత్రంగా యెంచుకొన్న జాతి అస్తిత్వానికే యిది ముప్పుగా తయారైయింది. అందుచేత యిక ముందు జరిగే చిన్న, పెద్ద ఎన్నికలన్నింటిలో ప్రతిపక్షాలు సంఘటితంగా పోటీ చేసి బిజెపిని మట్టిగరిపించవలసి వున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News