Saturday, April 27, 2024

రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

- Advertisement -
- Advertisement -
Rain expected in Telangana for next 3 days
ఉత్తర తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు

హైదరాబాద్: రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 24గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రం వైపునకు తూర్పు ఆగ్నేయ దిశ నుంచి కిందిస్థాయి నుంచి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం ఆగ్నేయ బంగాళా ఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం మంగళవారం మధ్య దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టానికి సమారు 5.8కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 24గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వర్షం

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వర్షం కురిసిందని, అత్యధికంగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ), ఆదిలాబాద్ జిల్లా బోథ్ 5 సెంటిమీటర్లు, కరీంనగర్ జిల్లాలో 5, వికారాబాద్ జిల్లా దోమలో 3, నిర్మల్ జిల్లా లో 2 సెంటి మీటర్ల వర్షపాతం నమోదయ్యిందని అధికారులు వివరించారు. జగిత్యాల జిల్లాలోని రాయికల్, మేడిపల్లి మండలాల్లో ఉదయం నుంచి విడతల వారీగా వర్షం కురుస్తోంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు వాపోతున్నారు. రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తమిళనాడును వణికిస్తున్న వర్షాలు

తమిళనాడును వర్షాలు వణికిస్తున్నాయి. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. 23, 24 తేదీల్లో ఎల్లో అలర్ట్, 25, 26న ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో మరికొన్ని రోజులు తమిళనాడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, కరైకల్‌లో కూడా రాబోయే 5 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News